icon icon icon
icon icon icon

Revanth Reddy: 5 ఎంపీ స్థానాల్లో గెలిపించేందుకు మోదీతో కేసీఆర్‌ ఒప్పందం: రేవంత్‌

రాజకీయాల్లో పడిపోతున్న తనకు కేసీఆర్‌తో పోరాడేంత బలం ఇచ్చింది.. మాల్కాజిగిరి ప్రజలు, పార్టీ కార్యకర్తలేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 

Updated : 22 Apr 2024 19:15 IST

మల్కాజిగిరి: రాజకీయాల్లో పడిపోతున్న తనకు కేసీఆర్‌తో పోరాడేంత బలం ఇచ్చింది.. మాల్కాజిగిరి ప్రజలు, పార్టీ కార్యకర్తలేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక్కడ ఎంపీగా చేసిన పోరాటంతోనే పీసీసీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదువులు వచ్చాయన్నారు. మాల్కాజిగిరిలో నిర్వహించిన కాంగ్రెస్‌ ‘జనజాతర’సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 

‘‘మల్కాజిగిరి నియోజకవర్గాన్ని నేనెప్పుడూ మర్చిపోను. కొడంగల్‌లో ఓడిపోతే ఇక్కడ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించారు. భారాస ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇక్కడ అభివృద్ధి లేనందునే కోకాపేటలో పెరిగినట్లుగా ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరగలేదు. ఇక్కడి ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ఏదైనా అడిగేందుకు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధి ఇప్పుడు లేరు. ఈ ఎన్నికల్లో అయినా మాల్కాజిగిరి ఎంపీగా కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలి.

భాజపాతో కేసీఆర్‌ ఒప్పందం

భారాస అధినేత కేసీఆర్‌ భాజపాతో చీకటి ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్రంలో 5 ఎంపీ స్థానాల్లో భాజపాను గెలిపిస్తానని మోదీతో కేసీఆర్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్న చోట భాజపాకి  భారాస మద్దతిస్తోంది. ఇన్నాళ్లు తనను గుండెల్లో పెట్టుకున్న హుజూరాబాద్‌ ప్రజలు ఇప్పుడు ఎందుకు ఓడించారో మాల్కాజిగిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ చెప్పాలి. కేసీఆర్‌, కేటీఆర్‌ అవినీతిపై విచారణ జరపాలని అమిత్‌షాను ఈటల ఎందుకు కోరలేదు? కేటీఆర్‌ అవినీతి, ఫోన్ల ట్యాపింగ్‌ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? మోదీ ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు ఈటల సిద్ధమేనా? 

తెలంగాణకు మోదీ చేసిందేమీ లేదు

పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు. ఆయన రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే.. అవి రద్దయ్యే వరకు కాంగ్రెస్‌ పోరాటం చేసింది. సాగు చట్టాలు రద్దు చేసి.. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పేలా చేసింది రైతులు, కాంగ్రెస్‌ నేతలే. ఓట్ల కోసం ఆయన మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. మతాలు, భాషల మధ్య చిచ్చుపెట్టి గెలవాలని భాజపా చూస్తోంది. దేవుడి పేరు మీద రాజకీయం చేసే వారిని పొలిమేర వరకు తరిమికొట్టాలి’’అని రేవంత్‌రెడ్డి అన్నారు. 

సీఎం హెలిప్యాడ్‌ వద్ద డ్రోన్‌ కలకలం

సీఎం రేవంత్‌రెడ్డి హెలిప్యాడ్‌ వద్ద డ్రోన్‌ కలకలం రేపింది. శామీర్‌పేట వద్ద ఉన్న హెలిప్యాడ్‌ వద్ద ఓ వ్యక్తి డ్రోన్‌ను ఎగరవేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని రామంతాపూర్‌కు చెందిన గణేశ్‌రెడ్డిగా గుర్తించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img