icon icon icon
icon icon icon

CM Revanth reddy: మోదీ, కేసీఆర్‌ మెదక్‌ ప్రాంతాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు: రేవంత్‌రెడ్డి

ఏడుపాయల దుర్గమ్మ, మెదక్‌ చర్చి సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసితీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated : 20 Apr 2024 17:00 IST

మెదక్‌: ఏడుపాయల దుర్గమ్మ, మెదక్‌ చర్చి సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు నామినేషన్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.5లక్షల ఇళ్లు నిర్మించాలని ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం ప్రారంభించాం. పేదోడికి సొంత ఇల్లు ఉంటే గౌరవంగా జీవిస్తారు. కాంగ్రెస్‌ను ఓడించి.. ఇచ్చే ఇళ్లను రద్దు చేయాలని దిల్లీలో ఉండే మోదీ, గజ్వేల్‌లో ఉండే కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారు. పేదవాడి కళ్లలో ఆనందం చూసి ఓర్వలేకపోతున్నారు. వచ్చే వరి పంటను రూ.500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. 

పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోదీ మోసం చేశారు. మీ బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామన్నారు.. ఒక్క రూపాయి అయినా వేశారా? దిల్లీలో రైతులను చంపిన భాజపాను బొంద పెట్టాలి. మోదీ, కేసీఆర్‌ ఏనాడూ మెదక్‌ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఈ ప్రాంతానికి కేంద్రం ఏదైనా పరిశ్రమ ఇచ్చిందా? మల్లన్నసాగర్‌లో వేల ఎకరాలు గుంజుకున్నది ఎవరో మనకు తెలియదా? ఆనాడు కలెక్టర్‌గా ఉండి పేదల భూములు గుంజుకున్న వ్యక్తే.. నేడు భారాస అభ్యర్థి. కాంగ్రెస్‌పై చెయ్యి వేస్తే మాడి మసైపోతారు. నేను జైపాల్‌రెడ్డి, జానారెడ్డిని కాదు.. జాగ్రత్తగా ఉండాలి. పదేళ్ల ఇక్కడే ఉంటాం.. ఎవరు వస్తారో రండి.  కాంగ్రెస్‌ కష్టాల్లో ఉన్నప్పుడు మెదక్‌ ప్రజలు ఇందిరమ్మను గెలిపించారు. ఇందిరాగాంధీ.. హైదరాబాద్‌కు అనేక పరిశ్రమలు కేటాయించారు. బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఇక్రిశాట్‌ను ఇచ్చారు. పేద ముదిరాజ్‌ బిడ్డకు ఎంపీ టికెట్‌ ఇచ్చాం.. గెలిపించే బాధ్యత మీదే’’ అని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పలువురు కాంగ్రెస్‌ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img