icon icon icon
icon icon icon

CM Revanthreddy: భాజపా కుట్రను తిప్పికొట్టేందుకు పోరాడుతా: సీఎం రేవంత్‌రెడ్డి

భాజపా కుట్రను తిప్పి కొట్టేందుకు కచ్చితంగా పోరాడుతానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated : 01 May 2024 18:23 IST

హైదరాబాద్‌: భాజపా కుట్రను తిప్పి కొట్టేందుకు కచ్చితంగా పోరాడుతానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము రిజర్వేషన్లు పెంచాలని భావిస్తుంటే.. భాజపా రిజర్వేషన్లు తొలగించాలని చూస్తోందని ధ్వజమెత్తారు.

‘‘రాజ్యాంగంపై సమీక్షించాలని 2000 సంవత్సరంలో వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు ఓ గెజిట్‌ ఇచ్చారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి కే.ఆర్‌.నారాయణన్‌ ప్రసంగం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. రాష్ట్రపతి ప్రసంగం సారాంశంలో రిజర్వేషన్ల రద్దు గురించి ఉంది. దీనిపై ఆధారాలతో సహా నేను వాదిస్తున్నా. మూడింట రెండొంతులు మెజారిటీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు. నా వాదనలపై సరైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మోదీ, అమిత్‌ షాకు ఉంది. భాజపా ఎన్నికల్లో గెలవడానికి ఈడీ, సీబీఐ, దిల్లీ పోలీసులను వాడుకుంటోంది. 

కుల ఆధారిత రిజర్వేషన్లు సరికాదని 2015లో ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త ఎన్‌జీ వైద్య పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఆయన రాసినట్టే 2025 నాటికి రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా ప్రయత్నిస్తోంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలను సవరించాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ కావాలి. రిజర్వేషన్ల రద్దు కోసమే భాజపా 400 సీట్లు కావాలని చూస్తోంది. దేశాన్ని హిందూదేశంగా ప్రకటించాలనేది ఆర్‌ఎస్‌ఎస్‌ మౌలిక సిద్ధాంతం. ఎస్సీలకు సమానత్వం, హక్కులు లేని హిందూ రాష్ట్రం కావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ రెండో సర్‌సంఘ్‌ చాలక్‌ గోల్వాల్కర్‌ రాశారు. దురదృష్టవశాత్తూ దళితులకు కూడా సమాన హక్కులు ఇచ్చారని రాశారు. పదేళ్ల తర్వాత రిజర్వేషన్లు తొలగించాలని సూచించారు. ఆయన చెప్పిన గడువు దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు రద్దుకు యత్నిస్తున్నారు. గత లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు.

బెదిరించే ప్రయత్నం విరమించుకోవాలి..

మండల్‌ కమిషన్‌ బీసీలకు 27శాతం రిజర్వేషన్లకు సిఫారసు చేసినప్పుడు భాజపా నిరసన ఉద్యమం చేసింది. బీసీ రిజర్వేషన్లు సమ్మతమేనని 9 మంది సభ్యుల సుప్రీం ధర్మాసనం తీర్పు చెప్పింది.  ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని మార్చాలా? మార్చకూడదా? అనే అంశంపై మాత్రమే జరుగుతున్నాయి. ఈసారి భాజపాకు వేసే ప్రతీ ఓటు రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడతాయి. రిజర్వేషన్లు పెంచాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండి. వాళ్ల ముందు లొంగిపోతానని ఈ దిల్లీ సుల్తానులు ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మోదీ, అమిత్‌ షా నన్ను బెదిరించే ప్రయత్నాన్ని విరమించుకోవాలి’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img