icon icon icon
icon icon icon

CM Revanthreddy: అన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్‌ అజెండా: రేవంత్‌రెడ్డి

అన్ని కులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్‌ పార్టీ అజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated : 27 Apr 2024 17:53 IST

హైదరాబాద్‌: అన్ని కులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్‌ పార్టీ అజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలు 50శాతానికి పైగా ఉన్నారని, జనగణన చేసి వారికి రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

‘‘ఈ దేశ రాజకీయాలను, సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే అంశంపై విస్పష్టంగా మాట్లాడాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది. అక్రమంగానో.. దౌర్జన్యంగానో.. 400 సీట్లు సాధించి రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలపైనే దాడి చేయాలని మోదీ, అమిత్‌ షా కంకణ బద్దులై ఉన్నారు. ఇందులో భాగంగానే దేశం నలుమూలలా తిరుగుతూ అన్ని రకాల వ్యవస్థలు, సంస్థల్ని ఉపయోగించుకొని ముప్పేట దాడి చేస్తున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత భాజపాపై .. కాంగ్రెస్‌ స్పష్టమైన ఆరోపణలు చేస్తోంది. కాంగ్రెస్‌ ప్రశ్నలకు ఇప్పటి వరకు నరేంద్రమోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా సమాధానం చెప్పలేదు. ప్రజాస్వామ్య విలువలు, విధానాలకు విరుద్ధంగా వారు వ్యవహరిస్తున్నారు. 

ఆర్‌ఎస్‌ఎస్‌ మనువాద విధానాన్ని అమలు చేయాలని వారిద్దరూ ప్రయత్నిస్తున్నారు. వివిధ కులాలు, వర్గాలు ఉంటే హిందువులు ఏకతాటి మీదకురారు అనేది భాజపా కుట్ర. రిజర్వేషన్లు రద్దు చేస్తే.. వేర్వేరు కులాలు, వర్గాల ప్రస్తావన లేకుండా పోతుందనేది ఆ పార్టీ ఆలోచన. వచ్చే ఏడాదికి ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపించి వందేళ్లు అవుతుంది. 2025 నాటికి రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం. రాజ్యాంగాన్ని మార్చాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. అందుకే 400 సీట్లలో గెలిపించాలని మోదీ పదే పదే కోరుతున్నారు. భారత్‌ను రిజర్వేషన్‌ రహిత దేశంగా మార్చాలని మోదీ, అమిత్‌ షా భావిస్తున్నారు’’ అని రేవంత్‌ ఆరోపించారు.

భారాస, భాజపా కుమ్మక్కు రాజకీయాలు

‘‘రిజర్వేషన్ల రద్దుపై భాజపా, భారాస ఒకే విధానంతో ఉన్నాయి. ఆ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. మల్కాజిగిరిలో భాజపాను గెలిపిస్తామని నిన్న భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఆయనపై కేటీఆర్‌ ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఈటలను కేటీఆర్‌ ఎందుకు విమర్శించడం లేదు? ఐదు నియోజకవర్గాల్లో భాజపాకు భారాస మద్దతు ఇస్తోందని నేను చెబుతూనే ఉన్నా. అది నిజమని నిన్న మల్లారెడ్డి మాటలతో స్పష్టమైంది. పదేళ్లపాటు కేసీఆర్‌ భూములు అమ్ముతుంటే ఈటల రాజేందర్‌ ఎప్పుడైనా మాట్లాడారా? నేను రుణమాఫీ చేస్తాను అనగానే భూములు అమ్మవద్దని ఈటల కండీషన్లు పెడతున్నారు. దేశంలో రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలి’’ అని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img