icon icon icon
icon icon icon

CM Revanthreddy: కాంగ్రెస్‌ ఇచ్చిన సంస్థలను భాజపా అమ్మేస్తోంది: సీఎం రేవంత్‌రెడ్డి

సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారసభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

Published : 26 Apr 2024 21:13 IST

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రం పదేళ్లపాటు కేసీఆర్‌ కబంధహస్తాల్లో చిక్కుకుందని.. డిసెంబర్‌లో కేసీఆర్‌ గడీలు బద్దలుకొట్టి ప్రజాపాలన తెచ్చుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశామన్నారు. పేదలకు కూడా కార్పొరేట్‌ వైద్యం అందాలని గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ తెచ్చిందని, ఆ పథకాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం పదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామన్నారు.

‘‘మహిళలకు కట్టెల పొయ్యి కష్టాలు పోవాలనే కాంగ్రెస్‌ ప్రభుత్వం దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చింది. వాటి ధరను మోదీ రూ.1,200కు పెంచడంతో మహిళలకు మళ్లీ కట్టెల పొయ్యి కష్టాలు వచ్చాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చి రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తోంది. పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తానని చెప్పి కేసీఆర్‌ మోసం చేశారు. పదేళ్లపాటు పేదల వాటి గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే 4.50 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కేటాయిస్తున్నాం.

ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ యువత రాష్ట్రం కోసం పోరాటం చేశారు. పేదల ఉద్యోగాల గురించి కేసీఆర్‌ పదేళ్ల పాటు పట్టించుకోలేదు. కుమారుడు, కుమార్తె, అల్లుడు, బంధువులకు మాత్రమే కేసీఆర్‌ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం రాగానే 25 వేల మందికి నియామక పత్రాలు ఇచ్చాం. రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ, అమిత్‌షా తలుచుకున్నారు. అదే భాజపా విధానం. ఆనాడు బ్రిటీషర్లు సూరత్‌ చేరుకొని క్రమంగా దేశమంతా ఆక్రమించుకున్నారు. ఇప్పుడు కూడా సూరత్‌ వ్యాపారులు దేశాన్ని ఆక్రమిస్తున్నారు. భాజపా అంటే బ్రిటీష్‌ జనతా పార్టీ. బ్రిటీష్‌ వాళ్ల లాగే.. భాజపా వాళ్లకు కూడా రిజర్వేషన్లు నచ్చవు. కార్పొరేట్‌ కంపెనీల కుట్రలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా భావిస్తోంది. తద్వారా దేశాన్ని కార్పొరేట్‌ వ్యాపారుల చేతిలో పెట్టాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. ఈసారి 400 సీట్లు గెలవాలి.. రాజ్యాంగం మార్చాలని మోదీ కంకణం కట్టుకున్నారు. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఈసీఐఎల్‌, బీహెచ్ఈఎల్‌, డీఆర్‌డీవో వంటి ఎన్నో సంస్థల్ని ఇచ్చింది. కాంగ్రెస్‌  ఇచ్చిన సంస్థల్ని మోదీ, అమిత్‌షా కలిసి అంబానీ, అదానీలకు అమ్ముతున్నారు. ఇప్పటికే రూ.60 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ సంస్థలను అమ్మేశారు’’ అని రేవంత్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ సైనికులు మరోసారి అవిశ్రాంతంగా పోరాడి పార్టీ లోక్‌సభ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img