icon icon icon
icon icon icon

PM Modi: రాహుల్‌ను ప్రధానిని చేయాలని పాక్‌ తహతహ: మోదీ ధ్వజం

PM Modi: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ను దేశ ప్రధానిని చేయాలని దాయాది పాకిస్థాన్‌ తహతహలాడుతోందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌-పాక్‌ బంధం బయటపడిందని అన్నారు.

Updated : 02 May 2024 13:26 IST

గాంధీనగర్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై పాకిస్థాన్‌ (Pakistan) మాజీ మంత్రి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది. దీనిపై భాజపా (BJP) నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) స్పందిస్తూ.. హస్తం పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ (Congress) యువరాజు కోసం పాక్‌ నేతలు ప్రార్థిస్తున్నారని ఆరోపించారు. వారి మధ్య బంధం తేటతెల్లమైందని అన్నారు.

గుజరాత్‌లోని ఆనంద్‌ ప్రాంతంలో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై పాక్‌ ప్రశంసల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘దేశంలో కాంగ్రెస్‌ నానాటికీ బలహీనపడుతోంది. ఇక్కడ ఆ పార్టీ అస్థిత్వాన్ని కోల్పోతుంటే.. అక్కడ పాకిస్థాన్‌ కన్నీళ్లు పెట్టుకుంటోంది. కాంగ్రెస్‌ యువరాజును (రాహుల్‌ను ఉద్దేశిస్తూ) భారత ప్రధానిని చేయాలని దాయాది తహతహలాడుతోంది. ఆ పార్టీ పాక్‌కు అభిమాని అని మనకు తెలుసు. ఇప్పుడు వారి మధ్య భాగస్వామ్యం పూర్తిగా బయటపడింది’’ అని మోదీ దుయ్యబట్టారు.

ఖర్చు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ధన సునామీ దిశగా 2024 ఎన్నికలు..!

‘‘భారత్‌లో బలహీన ప్రభుత్వం ఉండాలని మన శత్రువులు కోరుకుంటున్నారు. 26/11 ముంబయి దాడుల నాటి ప్రభుత్వం, 2014కు ముందున్న సర్కారు మళ్లీ అధికారంలోకి రావాలని ఆశపడుతున్నారు. అందుకే కాంగ్రెస్‌ కోసం పాక్‌ నేతలు ప్రార్థిస్తున్నారు’’ అని మోదీ మండిపడ్డారు.

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఫవాద్‌ హుస్సేన్‌ ఇటీవల తన సోషల్‌ మీడియా ఖాతాలో రాహుల్‌ గురించి ఓ పోస్ట్‌ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నేత ప్రసంగించిన వీడియోను షేర్‌ చేసి.. ‘రాహుల్‌ ఆన్ ఫైర్‌’ అని రాసుకొచ్చారు. దీనిపై భాజపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘పాక్‌ మాజీ ప్రధాని రాహుల్‌ను ప్రమోట్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆ దేశంలో పోటీ చేయాలనుకుంటోందా? మేనిఫెస్టో దగ్గర నుంచి ఈ ప్రశంసల వరకు హస్తానికి దాయాదితో ఉన్న స్నేహం మరింత స్పష్టమైంది’’ అని భాజపా ఐటీ విభాగం చీఫ్‌ అమిత్ మాలవీయ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img