icon icon icon
icon icon icon

CM Revanthreddy: తెలంగాణపై భాజపా నేతలది సవతి తల్లి ప్రేమ: సీఎం రేవంత్‌రెడ్డి

రిజర్వేషన్లే ప్రధాన అంశంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated : 03 May 2024 20:18 IST

ధర్మపురి: రిజర్వేషన్లే ప్రధాన అంశంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ధర్మపురిలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం ప్రసంగించారు. నేతకాని కార్పొరేషన్‌, సింగరేణి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో  భారాసకు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. పోటీ చేసే అభ్యర్థి లేక .. ధర్మపురి ప్రజలు తిరస్కరించిన కొప్పుల ఈశ్వర్‌నే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా భారాస నిలబెట్టిందని ఆక్షేపించారు.

భాజపా నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మోదీ వాట్సాప్‌ వర్సిటీలో అన్నీ అబద్ధాలే ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పదేళ్లు దేశ ప్రధానిగా ఉన్న మోదీ, ఐదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. విభజనచట్టంలో సోనియాగాంధీ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కలిపేశారన్నారు. కాజీపేటకు ఇచ్చిన రైల్యే కోచ్‌ ఫ్యాక్టరీని లాతూర్‌కు తరలించుకుపోయారని ఆరోపించారు.

‘‘నాలుగువేల మెగావాట్ల సామర్థ్యంలో ఎన్‌టీపీసీ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థను నిర్మించాల్సింది. పదేళ్లలో 1600 మెగావాట్లతో నిర్మించారు. రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్‌ కారిడార్‌ను సోనియాగాంధీ ఇస్తే దానిని రద్దు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించకుండా మొండి చేయి చూపించారు. గిరిజన యూనివర్సిటీ, ఐఐటీ, ఐఐఎం ఇలా చెప్పుకొంంటూ పోతే పెద్ద జాబితానే ఉంది. గుజరాత్‌కు మాత్రం బుల్లెట్‌ రైలు, సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ తీసుకెళ్లారు. రూ.లక్ష కోట్ల నిధులు తరలించుకు పోయారు. గుజరాత్‌లో ఉన్నవారేనా? తెలంగాణలోఉన్న వాళ్లు మనుషులు కాదా? ఈ రాష్ట్రంపై భాజపా నేతలు సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారు.

కులగణన చేపట్టి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా కుట్ర చేస్తోంది. 400 సీట్లు గెలిస్తే లోక్‌సభలో మూడో వంతు మెజార్టీతో రిజర్వేషన్లు రద్దు చేస్తారు. రిజర్వేషన్ల రద్దుకు దేశంలోని 50శాతం రాష్ట్రాలు ఆమోదించాలి. అందుకే 8 రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలను పడగొట్టి భాజపా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. భాజపాకు ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుంది. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రిజర్వేషన్లు పెంచేందుకు దోహదపడుతుంది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img