icon icon icon
icon icon icon

CM Revanthreddy: ప్రపంచం తలకిందులైనా రుణమాఫీ ఆపను: సీఎం రేవంత్‌రెడ్డి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెబుతున్నా.. ప్రపంచం తలకిందులైనా సరే ఆగస్టు 15లోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Published : 21 Apr 2024 21:24 IST

భువనగిరి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెబుతున్నా.. ప్రపంచం తలకిందులైనా సరే ఆగస్టు 15లోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో సీఎం ప్రసంగించారు. ‘‘నల్గొండ జిల్లా ఎన్నో పోరాటాలకు స్ఫూర్తినిచ్చిన గడ్డ. భువనగిరి కోట.. కాంగ్రెస్‌ కంచుకోట అని ఎన్నోసార్లు నిరూపించారు. సీఎం పదవిని నేను ఏనాడూ గర్వంగా భావించలేదు.. బాధ్యతగా నిర్వర్తిస్తున్నా. మోదీ దెబ్బకు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయి. వ్యవస్థలను చెరబట్టి విపక్షాలను బెదిరించేందుకు వాడుకుంటున్నారు.

ఎన్నో రైతు ఉద్యమాలు చేసిన కమ్యూనిస్టులను కేసీఆర్‌ ఏనాడూ గౌరవించలేదు. మోదీ ప్రభుత్వాన్ని దించేందుకు కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో కలిసి వచ్చారు. పదేళ్లపాటు భారాస ప్రభుత్వం మోదీకి మద్దతిచ్చింది. కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకు భారాస ఎంపీలు మద్దతిచ్చారు. పదేళ్ల భారాస పాలనలో పేద బిడ్డలెవరికీ ఉద్యోగాలు రాలేదు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చారు. కానీ, 30లక్షల మంది యువతను పట్టించుకోలేదు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలను జిరాక్స్‌ సెంటర్లలో అమ్మి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించిన మోదీకి.. ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు ఉందా? ఆంధ్రాలో కాంగ్రెస్‌కు నష్టమని తెలిసి కూడా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే ఐదు గ్యారంటీలు అమలు చేసింది. వచ్చే పంటలో వడ్లకు రూ.500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేస్తాం’’ అని సీఎం హామీ ఇచ్చారు. ర్యాలీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img