icon icon icon
icon icon icon

ఇళ్ల బిల్లులు ఇవ్వకపోతే ప్రాణత్యాగానికి సిద్ధం

పెండింగ్‌లో ఉన్న రెండు పడకగదుల ఇళ్ల బిల్లులను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వకపోతే తాను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని శాసనసభ మాజీ స్పీకర్‌, బాన్సువాడ భారాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.

Published : 21 Apr 2024 04:12 IST

పోచారం భావోద్వేగం

పొతంగల్‌, కోటగిరి, న్యూస్‌టుడే: పెండింగ్‌లో ఉన్న రెండు పడకగదుల ఇళ్ల బిల్లులను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వకపోతే తాను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని శాసనసభ మాజీ స్పీకర్‌, బాన్సువాడ భారాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిజామాబాద్‌ జిల్లా పొతంగల్‌, కోటగిరి మండల కేంద్రాల్లో రోడ్‌షో, కార్నర్‌ సమావేశాల్లో జహీరాబాద్‌ భారాస అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గానికి 11 వేల రెండు పడక గదుల ఇళ్లు మంజూరయ్యాయని, వాటిలో 10 వేల ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రూ.400 కోట్లు చెల్లించామన్నారు. వేయి మందికి రూ.26.5 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లులు ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరగా.. ఆయన అంగీకరించారన్నారు. కానీ, కాంగ్రెస్‌ స్థానిక నాయకులు మంత్రితో చెప్పి బిల్లులు రాకుండా అడ్డుపడ్డారన్నారు. తనను నమ్ముకుని పేదలు అప్పు చేసి ఇళ్లు కట్టుకున్నారని, వారి బాధ చూడలేకపోతున్నానని పోచారం పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోపు బిల్లులు రాకపోతే.. ఎన్నికల తర్వాత లబ్ధిదారులతో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తానని చెప్పారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడతానని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img