icon icon icon
icon icon icon

భారాసలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది

పార్టీ నిర్మాణం లేకపోవడం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడం, గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కేంద్రంగా రాజకీయం నడపడంతోనే ప్రస్తుతం భారాస ఈ పరిస్థితుల్లో ఉందని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Published : 21 Apr 2024 04:12 IST

శాసనసభ ఎన్నికల ముందు కేసీఆర్‌ను కలవాలని ఆరు నెలలు ప్రయత్నించా: గుత్తా సుఖేందర్‌రెడ్డి

ఈనాడు, నల్గొండ-చిట్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: పార్టీ నిర్మాణం లేకపోవడం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడం, గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కేంద్రంగా రాజకీయం నడపడంతోనే ప్రస్తుతం భారాస ఈ పరిస్థితుల్లో ఉందని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి అప్పటి సీఎం కేసీఆర్‌ను కలవడానికి ప్రయత్నిస్తే అది సాధ్యం కాలేదని చెప్పారు. రాజకీయ పార్టీలకు అంతర్గత ప్రజాస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో శనివారం మీడియాతో మాట్లాడారు. పార్టీలో ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసినప్పుడు పార్టీ నాయకత్వం ఇద్దరినీ పిలిచి మాట్లాడితే ప్రయోజనం ఉంటుందని, భారాసలో అలాంటి పరిస్థితి లేదన్నారు. 2018లో ఉమ్మడి నల్గొండలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు గెలిచినా 2019లో నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో భారాస ఓడిందని.. అప్పటి నుంచి సమీక్షలు లేకపోవడంతోనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. తన కుమారుడు అమిత్‌రెడ్డికి భారాస ఎంపీ టికెట్‌ ఇవ్వలేదనేది అవాస్తవమని తెలిపారు. స్వయంగా కేసీఆర్‌, కేటీఆర్‌ ఫోన్‌ చేసి అమిత్‌ లోక్‌సభ ఎన్నికల పోటీలో ఉండాలని కోరారన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన కొంత మంది అభ్యర్థులు తమకు సహకరిస్తామని చెప్పారని, మరికొందరు తామే పార్టీ మారుతున్నామని చెప్పడంతోనే పోటీ నుంచి తప్పుకొన్నామని చెప్పారు. ఈ విషయం కేసీఆర్‌, కేటీఆర్‌కు సైతం తెలియజేశానన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని భారాస నేతలు ఫిర్యాదు చేశారని.. వాటిని పరిశీలించి న్యాయబద్ధంగా.. రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వార్తలొస్తున్నాయని.. తాను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని, ఏ పార్టీతో సంబంధం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా పార్టీ నాయకత్వం పార్టీ నిర్మాణంపై దృష్టిసారించాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img