icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు

అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌, సీపీఐ.. లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.

Published : 21 Apr 2024 04:14 IST

మఖ్దూంభవన్‌లో కూనంనేని తదితరులతో భట్టి విక్రమార్క చర్చలు
అన్ని లోక్‌సభ స్థానాల్లో సహకారానికి నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌, సీపీఐ.. లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరగా సీపీఐ అంగీకరించిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. భాజపా గెలవొద్దన్న ఉద్దేశంతోనే తామీ నిర్ణయం తీసుకున్నామని, భవిష్యత్తులో స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికల సమయంలో సీపీఐ గౌరవప్రదమైన స్థానాలు తీసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. భట్టి విక్రమార్క శనివారం సాయంత్రం సీపీఐ కార్యాలయం మఖ్దూంభవన్‌కు వెళ్లారు. సీపీఐ నేతలు కూనంనేని, అజీజ్‌పాషా, చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డిలతో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల పొత్తు కుదిరిన సమయంలో కాంగ్రెస్‌ ఇస్తామన్న రెండు ఎమ్మెల్సీ పదవుల గురించి సీపీఐ నేతలు భట్టికి గుర్తుచేశారు. చెప్పిన మాట ప్రకారం ఎమ్మెల్సీ పదవులిస్తామని భట్టి స్పష్టం చేసినట్లు సీపీఐ వర్గాల సమాచారం. చర్చల అనంతరం ఇరు పార్టీల నేతలు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయం మేరకు మఖ్దూంభవన్‌కు వచ్చి సీపీఐ మద్దతు కోరానని, లౌకికవాదాన్ని కాపాడేందుకు కలిసి ప్రయాణించాలని నిర్ణయించామని భట్టి తెలిపారు. ‘అన్ని లోక్‌సభ స్థానాల్లో సహకరిస్తామని సీపీఐ నేతలు చెప్పారు. రాష్ట్రంలో మతోన్మాద భాజపాను ఎంపీ సీట్లు గెలవకుండా నిలువరించేందుకు మేం కలిసి పనిచేయాలని నిర్ణయించాం. భువనగిరి స్థానంలోనూ కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు ఇస్తుంది’ అని భట్టి వివరించారు. కూనంనేని మాట్లాడుతూ.. ‘మేం కూడా ఒకటి రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలనుకున్నాం. కానీ కొన్ని అనివార్యతలు, భాజపాకు రాష్ట్రంలో స్థానం ఇవ్వకూడదన్న లక్ష్యం కోసం, కాంగ్రెస్‌, ఇండియా కూటమి మరింత బలపడేందుకు రాష్ట్రంలో పోటీ చేయడం లేదు. కాంగ్రెస్‌కు మద్దతిస్తాం’ అని వివరించారు. భారాస మరింత పతనావస్థకు వెళుతోందన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో రూపొందించిన ‘మోదీని ఇంటికి పంపుదాం’ సీడీని ఈ సందర్భంగా భట్టి, కూనంనేని తదితరులు ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img