icon icon icon
icon icon icon

మూడోరోజు 65 నామినేషన్లు!

రాష్ట్రంలోని లోక్‌సభ ఎన్నికల్లో మూడో రోజు శనివారం 65 నామినేషన్లు దాఖలయ్యాయి. భారాస నుంచి ఇద్దరు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకరు నామినేషన్‌ వేశారు.

Published : 21 Apr 2024 04:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని లోక్‌సభ ఎన్నికల్లో మూడో రోజు శనివారం 65 నామినేషన్లు దాఖలయ్యాయి. భారాస నుంచి ఇద్దరు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకరు నామినేషన్‌ వేశారు. దీంతో మూడు రోజుల్లో దాఖలైన నామినేషన్ల సంఖ్య 164కు చేరింది. ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాల్లో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు చేయలేదు. శనివారం భారాసకు చెందిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ (కరీంనగర్‌), గాలి అనిల్‌కుమార్‌ (జహీరాబాద్‌) నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌ పార్టీ నేత పులిపాటి రాజేశ్‌కుమార్‌ (హైదరాబాద్‌), మజ్లిస్‌ పార్టీ నుంచి షేక్‌ మున్నాబాషా (మహబూబ్‌నగర్‌) నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. అత్యధికంగా మెదక్‌ నియోజకవర్గంలో 8, మల్కాజిగిరి, నల్గొండల్లో 7 చొప్పున, పెద్దపల్లిలో 6, జహీరాబాద్‌, చేవెళ్ల, భువనగిరి నియోజకవర్గాలకు 5 వంతున, నిజామాబాద్‌, హైదరాబాద్‌, వరంగల్‌లో నాలుగేసి, కరీంనగర్‌, సికింద్రాబాద్‌ మూడు... ఖమ్మం, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల్లో రెండు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆదివారం సెలవుగా కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే ప్రకటించింది.


బోయినపల్లి వినోద్‌కు 34 ఎకరాల సాగు భూములు

అభ్యర్థులు అఫిడవిట్లలో వెల్లడించిన ఆస్తులు, అప్పులు, ఇతర వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌ నుంచి పోటీచేస్తున్న బోయినపల్లి వినోద్‌కుమార్‌కు రూ.15.06 కోట్ల ఆస్తులున్నాయి. ఆయనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవు. ఆయన వద్ద రూ.30 వేల నగదు ఉంది. బ్యాంకుల్లో డిపాజిట్లు, కొన్ని కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. కాస్మోస్‌ సహకార బ్యాంకు, మమత మెడికేర్‌, ప్రతిమ ఇండస్ట్రీస్‌లలో షేర్లు ఉన్నాయి. వ్యక్తిగత రుణాలు, అడ్వాన్సుల కింద రూ.1.90 కోట్లు ఇచ్చారు. సొంతంగా అర తులం బంగారు ఉంగరం, ఆయన సతీమణి వద్ద రూ.1.2 కోట్ల విలువైన రాళ్లు పొదిగిన బంగారు ఆభరణం ఉంది. మొత్తం చరాస్తుల విలువ రూ.9.02 కోట్లు. వినోద్‌ కుటుంబానికి రాజన్నసిరిసిల్లలో 19.28 ఎకరాలు, వరంగల్‌లో 15.20 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. కూకట్‌పల్లి భాగ్యనగర్‌ హౌసింగ్‌ సొసైటీలో వాణిజ్య భవనం ఉంది. తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన హన్మకొండ కాకతీయ కాలనీలో ఇల్లు ఉంది. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.6.04 కోట్లు. ఆయన కుటుంబానికి రూ.64.61 లక్షల అప్పులున్నాయి.


గాలి అనిల్‌కుమార్‌కు రూ.82.92 కోట్ల ఆస్తులు..

జహీరాబాద్‌ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న గాలి అనిల్‌కుమార్‌ కుటుంబానికి రూ.82.92 కోట్ల ఆస్తులున్నాయి. ఆయనపై ఆరు క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయన వద్ద రూ.50 వేల నగదు, 2 తులాల బంగారు ఆభరణాలు, సతీమణి పేరిట 10 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.1.35 కోట్లు. కుటుంబానికి 49.11 ఎకరాల వ్యవసాయ భూములు, ఫామ్‌హౌస్‌లు, పశువుల కొట్టాలు ఉన్నాయి. రామచంద్రాపురంలో వాణిజ్య భవనం; చందానగర్‌, మియాపూర్‌లలో నివాస గృహాలతో కలిపి మొత్తం స్థిరాస్తుల విలువ రూ.81.57 కోట్లు. మొత్తం రూ.3.16 కోట్ల అప్పులున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img