icon icon icon
icon icon icon

ఖమ్మంపై కాంగ్రెస్‌ మల్లగుల్లాలు

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మూడు రోజులు గడిచినా మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.

Updated : 21 Apr 2024 07:21 IST

అభ్యర్థిని తేల్చని అధిష్ఠానం
కరీంనగర్‌, హైదరాబాద్‌ స్థానాలూ పెండింగ్‌లోనే..

ఈనాడు, హైదరాబాద్‌: నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మూడు రోజులు గడిచినా మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. మిగిలిన రెండు పార్టీలు అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారంలో ముందుండగా.. కాంగ్రెస్‌ మాత్రం మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఖమ్మం అభ్యర్థిత్వం తేలకపోవడంతో కరీంనగర్‌, హైదరాబాద్‌లనూ పెండింగ్‌లో పెట్టింది. ఖమ్మం అభ్యర్థి ఎంపికతో కరీంనగర్‌ స్థానం ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం లోక్‌సభ స్థానానికి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతో పాటు పాత తరం కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డి మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్‌, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి తదితరులు పోటీపడినా చివరకు మండవ, రఘురామిరెడ్డిల మధ్య ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం వరకు మండవ పేరు ముందున్నా.. తాజాగా రఘురామిరెడ్డి కూడా గట్టి పోటీదారుగా నిలిచినట్లు తెలుస్తోంది.

ఖమ్మాన్ని ఆనుకొని ఉన్న మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానానికి రఘురామిరెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు. రఘురామిరెడ్డి.. మంత్రి పొంగులేటికి వియ్యంకుడు కూడా. అభ్యర్థి ఎంపిక విషయంలో ముఖ్య నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌కు ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఖమ్మంలో కాంగ్రెస్‌ బలంగా ఉండటం, ఉప ముఖ్యమంత్రి, మరో ఇద్దరు కీలక మంత్రులు ఉండటంతో అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించినా గెలుపు అవకాశాలపై ప్రభావం పడదనే అభిప్రాయాలను పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.  కరీంనగర్‌ స్థానం.. దీనికి భిన్నం. ఇక్కడ సిటింగ్‌ ఎంపీ, భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ ఎంపీ, భారాస సీనియర్‌ నేత వినోద్‌కుమార్‌ పోటీలో ఉన్నారు. వీరిద్దరూ చాలా రోజుల నుంచే ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్‌ మాత్రం అభ్యర్థిని ప్రకటించకుండానే ప్రచారం చేస్తోంది. అభ్యర్థి ఎంపికలో జాప్యంతో ఇప్పటికే నష్టం జరిగిందని, మరింత ఆలస్యమైతే మరింత నష్టం వాటిల్లుతుందనే ఆందోళన కరీంనగర్‌ కాంగ్రెస్‌ నాయకుల నుంచి వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img