icon icon icon
icon icon icon

భాజపా పాలనలో రాజ్యాంగ విలువల హననం

‘‘భాజపా పదేళ్ల పాలనలో రాజ్యాంగ విలువల హననం జరిగింది. చట్టాలను పాతరేసి ఆ పార్టీ అనుకూల కార్పొరేట్‌ శక్తులకు సంపదను దోచిపెట్టి.. నిరుద్యోగులను మోసం చేసింది.

Published : 21 Apr 2024 04:16 IST

భారాస కూడా ఇదే వైఖరి అవలంబించింది
‘ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం’ కార్యశాలలో వక్తలు

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘భాజపా పదేళ్ల పాలనలో రాజ్యాంగ విలువల హననం జరిగింది. చట్టాలను పాతరేసి ఆ పార్టీ అనుకూల కార్పొరేట్‌ శక్తులకు సంపదను దోచిపెట్టి.. నిరుద్యోగులను మోసం చేసింది. తెలంగాణలోనూ గత పదేళ్ల పరిపాలనలో భారాస ఇదే వైఖరిని అవలంబించింది’’ అని ‘ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం’ పేరుతో నిర్వహించిన కార్యశాలలో వక్తలు అభిప్రాయ పడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి మదీనా ఎడ్యుకేషన్‌ సెంటర్లో తెజస ఈ కార్యశాల నిర్వహించింది. ఇందులో తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మాట్లాడుతూ.. ‘‘భాజపా భావోద్వేగాల ప్రచారాల మాటున ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోంది. వివిధ సర్వేల ప్రకారం దేశంలో 2.7 లక్షల శాశ్వత ఉద్యోగాలు తగ్గాయి. దేశ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసి కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే చట్టాలు తీసుకొచ్చారు. వాటిపై ప్రశ్నించిన రైతులపై నిర్బంధం ప్రయోగిస్తున్నారు’’ అని అన్నారు. ఆచార్య హరగోపాల్‌ మాట్లాడుతూ.. ‘‘అధికారంలోకి రాగానే అవినీతిని అంతమొందించి విదేశాల్లో ఉన్న అక్రమ డబ్బును దేశానికి తీసుకొస్తానని, ప్రతి పౌరుని ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఒక్కరి ఖాతాలోనూ పైసా వేయలేదు. పైగా దేశంలో కొత్త పన్నుల చట్టాలు తీసుకొచ్చి స్వయం ఉపాధి రంగాన్ని దెబ్బతీసి ప్రజలపైనే భారం మోపారు’’అని పేర్కొన్నారు. కార్యశాలలో వక్తలు ఆచార్య విశ్వేశ్వర్‌రావు, కన్నెగంటి రవి, అంబటి నాగయ్య, అబంటి శ్రీనివాస్‌, ధర్మార్జున్‌, బైరి రమేశ్‌, ఎన్‌ వేణుగోపాల్‌, ఆచార్య నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img