icon icon icon
icon icon icon

గ్యారంటీల పేరిట కాంగ్రెస్‌ గారడీ

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీల పేరుతో ఓట్ల గారడీ చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన గ్యారంటీలను గాలికొదిలేసిన కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కే లేదన్నారు.

Published : 21 Apr 2024 04:18 IST

అమలుచేయని ఆ పార్టీ నేతల్ని నిలదీయండి
సీఎం మాపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించం
25న రాష్ట్రానికి రానున్న అమిత్‌షా: కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీల పేరుతో ఓట్ల గారడీ చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన గ్యారంటీలను గాలికొదిలేసిన కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కే లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు వస్తుందని తెలిసీ.. వంద రోజుల్లో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఆగస్టు 15వ తేదీకి అమలు చేస్తామంటూ.. స్థానిక సంస్థల ఎన్నికల పబ్బం కూడా గడుపుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ నాయకుల్ని ప్రజలు నిలదీయాలన్నారు. శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. భాజపాకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్‌, భారాసలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. కవితకు బెయిల్‌ ఇప్పించేందుకు.. భాజపా ఐదు సీట్లను సుపారీగా తీసుకుందంటూ సీఎం రేవంత్‌ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆయన నిరాధారంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. కవిత అరెస్టుకు.. లోక్‌సభ ఎన్నికలకు సంబంధం లేదన్నారు.

ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన భారాస: భారాస ఎమ్మెల్యేలు పార్టీలు మారడంపై ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ప్రజాప్రతినిధుల వెన్నుపోట్లు, పార్టీ నుంచి వలసలు, ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం, కవిత మద్యం కేసుతో భారాస సతమతమవుతోందన్నారు. భారాసకు ఓటేస్తే వృథా అని, ఆ పార్టీ తరఫున ఎవరైనా ఎంపీలుగా గెలిచినా.. పార్టీలో ఉంటారనే నమ్మకం లేదన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన భారాస.. ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపబోదని, ఒక్క సీటు కూడా గెలవబోదని అన్నారు. భవిష్యత్తు అంతా భాజపాదే అని అన్నారు. 70 శాతం యువత భాజపాతో ఉందన్నారు. తమ పార్టీ భారీ సభల కంటే ఇంటింటి ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 25న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రెండంకెల స్థానాలను భాజపా సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో భువనగిరి అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, అధికార ప్రతినిధి రాణి రుద్రమ, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ ఇతర నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img