icon icon icon
icon icon icon

మిర్యాలగూడ నుంచి సిద్దిపేట వరకు..

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సు యాత్ర షెడ్యూలు ఖరారైంది. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ కేసీఆర్‌ ప్రచారం ఉండేలా బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌ రూపొందించారు.

Published : 21 Apr 2024 04:18 IST

ఏప్రిల్‌ 22న ప్రారంభం.. మే 10న ముగింపు
ఆఖరి రోజు భారీ బహిరంగ సభ
కేసీఆర్‌ బస్సు యాత్ర షెడ్యూలు ఖరారు

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సు యాత్ర షెడ్యూలు ఖరారైంది. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ కేసీఆర్‌ ప్రచారం ఉండేలా బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌ రూపొందించారు. ఈ నెల 22న నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మిర్యాలగూడలో ప్రారంభమవుతుంది. రోజూ ఉదయం పొలం బాట కార్యక్రమం ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఉదయం పర్యటనల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమవుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నైరాశ్యంలో ఉన్న శ్రేణుల్లో పునరుత్తేజం నింపడంలో ఈ సమావేశాలు దోహదపడతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సాయంత్రం వేళల్లో కనీసం 2-3 ప్రాంతాల్లో రోడ్‌షోల్లో కేసీఆర్‌ పాల్గొంటారు. ప్రజలనుద్దేశించి కార్నర్‌ మీటింగ్‌లలో ప్రసంగిస్తారు. అనంతరం భారాస నాయకులు, కార్యకర్తల ఇళ్లలోనే భారాస అధినేత, ఇతర నాయకులు బస చేస్తారు. వచ్చే నెల(మే) 10న మెదక్‌ జిల్లా సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. దాంతో కేసీఆర్‌ బస్సు యాత్ర ముగుస్తుంది. ఈ నెల 22న హైదరాబాద్‌లో బయలుదేరే కేసీఆర్‌.. బస్సు యాత్ర ముగిసేవరకు మళ్లీ తిరిగిరారు. అయితే ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చేపట్టే బస్సు యాత్రకు మాత్రం దూరాభారం దృష్ట్యా ఆయన హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. మిగిలిన అన్నిచోట్ల ప్రత్యేక బస్సులోనే ప్రయాణం చేస్తారు. బస్సుయాత్ర మే 10వ తేదీతో ముగిసినా.. ప్రచార గడువు మే నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ ఉంటుంది. ఆ రోజు కూడా కేసీఆర్‌ ప్రచారంలో పాల్గొంటారు. అది ఎక్కడన్నది ఇంకా నిర్ణయం కాలేదని తెలుస్తోంది.

మెదక్‌కు హరీశ్‌రావు.. కరీంనగర్‌కు కేటీఆర్‌

రాష్ట్రంలోని ఐదు లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతలను భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, పార్టీ సీనియర్‌ నేత హరీశ్‌రావులకు అధిష్ఠానం అప్పగించింది. మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతలను హరీశ్‌రావు, కరీంనగర్‌ బాధ్యతలను కేటీఆర్‌ నిర్వహిస్తారు. సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాల్లో ప్రచార బాధ్యతలపై కేటీఆర్‌, హరీశ్‌రావులిరువురూ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని పార్టీ నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img