icon icon icon
icon icon icon

మోదీ.. కేసీఆర్‌ చెప్పేవన్నీ అబద్ధాలే

మెదక్‌ చర్చి, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నాను. ఆగస్టు 15లోగా పంట రుణమాఫీ చేసే బాధ్యత నాది. వచ్చే పంట సీజన్‌లో ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇచ్చి కొనే పూచీ కూడా నాదే.

Published : 21 Apr 2024 04:19 IST

పదేళ్లుగా రెండు పార్టీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదు
మెదక్‌ ప్రాంతంలోని పరిశ్రమలు ఇందిరా గాంధీ తెచ్చినవే
ఆ నియోజకవర్గ ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌, మెదక్‌ - న్యూస్‌టుడే


మెదక్‌ చర్చి, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నాను. ఆగస్టు 15లోగా పంట రుణమాఫీ చేసే బాధ్యత నాది. వచ్చే పంట సీజన్‌లో ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇచ్చి కొనే పూచీ కూడా నాదే.

20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారు. కాంగ్రెస్‌ పని అయిపోయిందంటున్నారు. అది అంత సులభం కాదు. కాంగ్రెస్‌కు కాపలా ఉన్నదెవరో తెలుసా? మర్యాదగా ఉండటానికి నేను జైపాల్‌రెడ్డిని, జానారెడ్డిని కాదు.

సీఎం రేవంత్‌రెడ్డి


ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు గత పదేళ్లలో చేసిందేమీ లేకున్నా.. మళ్లీ ఓట్లు వేస్తే అభివృద్ధి చేస్తామంటూ అబద్ధాలు చెబుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. శనివారం మెదక్‌లో లోక్‌సభ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌ కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. ‘‘1999 నుంచి 2024 వరకు భాజపా, భారాస చేతుల్లోనే మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం ఉంది. ఈ రెండు పార్టీల అభ్యర్థులే మెదక్‌లో గత పాతికేళ్లుగా ఎంపీలుగా నెగ్గారు. అంతకుముందు ఇందిరా గాంధీ ఎంపీగా ఉన్నప్పుడు మెదక్‌కు తెచ్చిన పరిశ్రమలు తప్ప.. ఆ తర్వాత పాతికేళ్లలో ఈ ప్రాంతానికి ఏమైనా వచ్చాయా? 2014 నుంచి 2024 వరకు పదేళ్లపాటు కేసీఆర్‌, హరీశ్‌రావులు ఈ ప్రాంతానికి ఏమైనా పరిశ్రమలు తెచ్చారా? చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించి.. నేత పరిశ్రమను కుప్పకూల్చారు. ఓటు కోసం భారాస, భాజపా నేతలు అబద్ధాలు చెబుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రధానిని అడిగి నిధులు తెచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తానని రఘునందన్‌రావు దుబ్బాక ఉప ఎన్నికలో చెప్పారు. మేం బస్సులేసుకుని దుబ్బాకకు వస్తాం. ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి. రఘునందన్‌రావును గెలిపిస్తే మోదీ చంద్రమండలానికి ప్రధాని అవుతారా? గత పదేళ్లు అధికారంలో ఉన్నవారు జెండాలు మార్చి మెదక్‌ను పట్టిపీడిస్తున్నారు. మోదీ, కేసీఆర్‌లు.. ఈ ప్రాంతానికి ఏం చేశారు? మెదక్‌ గడ్డకు ఓ చరిత్ర ఉంది. కాంగ్రెస్‌ కష్టాల్లో ఉన్నప్పుడు 1980లో ఇందిరా గాంధీని మెదక్‌ ప్రజలు గెలిపిస్తే.. భెల్‌, ఇక్రిశాట్‌ వంటి అనేక సంస్థలను తెచ్చారు. మెదక్‌ ప్రజలు గెలిపించినందువల్లే దేశానికి ప్రధాని అయ్యారు. కరవు కాటకాలతో అల్లాడుతున్న ఇక్కడి ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. దేశం నలుమూలల నుంచి కార్మికులు ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్నారు. అనేక రాష్ట్రాలతో పాటు ఏపీ నుంచి కూడా తెలంగాణకు వస్తున్నారంటే మెదక్‌ ప్రజలే కారణం. కట్టెల కోసం మహిళలు అడవుల్లోకి వెళ్లి కష్టాలు పడకుండా.. కాంగ్రెస్‌ పాలనలో గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని తెస్తే.. మోదీ హయాంలో సిలిండర్‌ ధరను రూ.1200కి పెంచారు. రూ.500కే సిలిండర్‌ ఇస్తున్న కాంగ్రెస్‌ను ఓడించాలని మోదీ, కేసీఆర్‌ చూస్తున్నారు. కాంగ్రెస్‌ను ఓడిస్తే ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం రద్దవుతుందని వారు ఎదురుచూస్తున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎందుకు పడగొడతారు

ప్రజల మన్నన పొందిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని.. మోదీ, కేసీఆర్‌ కలిసి పడగొడతారా? మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రద్దు కావాలని ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేసీఆర్‌ చూస్తున్నారు. మా సర్కారుపై కుట్ర చేస్తే ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలు అందించేదెవరు? కేసీఆర్‌ కారు కార్ఖానాకు పోయింది. ప్రజాపాలన అందించి.. ప్రజల కష్టాలు తీర్చే ఇందిరమ్మ రాజ్యం పదేళ్లపాటు ఉంటుంది. ఎన్నిసార్లయినా మోసం చేయవచ్చని మోదీ అనుకుంటున్నారు. 20 కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పి మోసం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయనందుకు, పేదలకు ఇళ్లు ఇవ్వనందుకు, నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి చేయనందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని దించేయాలి.

గడీల్లో ఉన్నవారికి, బీసీ బిడ్డకు పోటీ..

మెదక్‌లో గడీల్లో ఉన్నవారికి, బీసీ బిడ్డకు మధ్య పోటీ జరుగుతోంది. భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా ఉన్న సమయంలో మల్లన్నసాగర్‌ కింద 50 వేల ఎకరాలు గుంజుకుని.. పేద రైతులను గోదావరి జలాల్లో ముంచారు. పోలీస్‌ స్టేషన్లలో కొట్టించారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎంపీ కావాలనుకుంటున్నారు. మల్లన్నసాగర్‌లో పేదల పొట్టకొట్టిన వెంకట్రామిరెడ్డిని ఓడించాలి. మేం వజ్రాలు, వైఢూర్యాలు అడగటం లేదు. గత 20 ఏళ్లు భారాస, భాజపాలకు ఓటు వేశారు. మెదక్‌లో ఈసారి బలహీనవర్గాల బిడ్డ నీలం మధుకు ఓటు వేసి.. ఎంపీగా గెలిపించండి’’ అని రేవంత్‌రెడ్డి కోరారు. ర్యాలీ, సమావేశం ఆలస్యం కావడంతో ముందుగా నిర్ణయించుకున్న ముహూర్త సమయానికి కాంగ్రెస్‌ మెదక్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు శనివారం తన నామినేషన్‌ దాఖలు చేయలేకపోయారు. ఆయన మరో రోజు నామినేషన్‌ వేస్తారని పార్టీ శ్రేణులు తెలిపాయి.

త్వరలో భాజపాలోకి కేసీఆర్‌: పొంగులేటి

నాలుగు నెలల క్రితం అధికారం కోల్పోయిన భారాస అధినేత కేసీఆర్‌.. ఇప్పటికీ తాను ముఖ్యమంత్రినేనని భావిస్తున్నారని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ‘‘లోక్‌సభ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ దుకాణం బంద్‌ కానుంది. అతి త్వరలో ఆయన భాజపాలోకి వెళ్తారు. 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భారాసలోకి వస్తారని కేసీఆర్‌ అంటున్నారు. ఏం చూసి ఆ పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్తారు? ఆయనను, ఆ పార్టీని నమ్మి కాంగ్రెస్‌ నుంచి గాని, ఇతర పార్టీల నుంచి ఏ ఒక్కరూ వెళ్లరు. రాహుల్‌ గాంధీని ప్రధాని చేసేందుకు కాంగ్రెస్‌కు ఓటేయాలి’’ అని పొంగులేటి కోరారు.

15 స్థానాల్లో గెలుస్తాం: దామోదర్‌ రాజనర్సింహ

స్వేచ్ఛను హరించిన, దోపిడీకి పాల్పడిన భారాస పాలనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడి.. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌కు పట్టం కట్టారని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. ‘‘అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఆరు గ్యారంటీల్లోని హామీల్లో నాలుగింటిని అమలు చేశాం. మరో రెండింటిని త్వరలో అమలు చేయనున్నాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో ఐదు గ్యారంటీలు అమలు చేయనుంది. లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో 15 స్థానాలు కైవసం చేసుకుంటాం’’ అని ఆయన పేర్కొన్నారు.

సంక్షేమం, అభివృద్ధిపై మాట్లాడే హక్కు భారాసకు లేదు: కొండా సురేఖ

నిరుపేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ‘‘నాలుగు నెలల కాలంలో ఏమీ చేయలేదని మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు అంటున్నారు. గత తొమ్మిదిన్నరేళ్లలో భారాస ప్రభుత్వం చేయని పనులను కేవలం నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి చేసి చూపించారు. సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు భారాసకు లేదు. అదానీ, అంబానీలకు కొమ్ముకాస్తూ నిరుపేదల జీవితాలతో ఆడుకున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి’’ అని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img