icon icon icon
icon icon icon

ఒకరిని మించి మరొకరు..

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లతో పాటే భారీ ప్రచార కార్యక్రమాలకు ప్రధాన పార్టీలు చేపడుతున్నాయి. అభ్యర్థుల నామినేషన్లలో పార్టీల కీలక నేతలు పాల్గొనడమే కాకుండా భారీ ర్యాలీలు, సభలతో సందడి చేస్తున్నారు.

Published : 22 Apr 2024 03:14 IST

అట్టహాసంగా అభ్యర్థుల నామినేషన్లు
ముఖ్యనేతల ర్యాలీలు, సభలకు ప్రాధాన్యం  

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లతో పాటే భారీ ప్రచార కార్యక్రమాలకు ప్రధాన పార్టీలు చేపడుతున్నాయి. అభ్యర్థుల నామినేషన్లలో పార్టీల కీలక నేతలు పాల్గొనడమే కాకుండా భారీ ర్యాలీలు, సభలతో సందడి చేస్తున్నారు. కాంగ్రెస్‌, భారాస, భాజపా అభ్యర్థులు గత నాలుగు రోజులుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నామినేషన్లకు చివరి రోజు. ఇక నాలుగు రోజులే గడువు ఉండటంతో ప్రచారం జోరందుకోనుంది. ప్రతి సందర్భాన్ని ఓటర్లపై బలమైన ముద్ర వేసేందుకు ఉపయోగించుకునేలా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అభ్యర్థులు ఒకరి కంటే మించి మరొకరు అన్నట్లుగా నామినేషన్‌ వేసిన రోజు నుంచే భారీ ర్యాలీలు, సభలకు తెరతీస్తున్నారు.

ముఖ్యుల రాకతో ఉత్సాహం

ప్రధాన పార్టీల అభ్యర్థులకు మద్దతుగా.. నామినేషన్లకు ముఖ్యనాయకులు తరలి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్‌ ర్యాలీలకు హాజరై శ్రేణులను ఉత్తేజపరిచారు. భువనగిరి అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌ కంటే ముందే.. ఆదివారం సీఎం అక్కడ రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు. సికింద్రాబాద్‌, ఖమ్మం భాజపా అభ్యర్థులు కిషన్‌రెడ్డి, తాండ్ర వినోద్‌రావుల నామినేషన్ల సందర్భంగా ర్యాలీలు, సభలకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరయ్యారు. మెదక్‌ అభ్యర్థి రఘునందన్‌రావు నామినేషన్‌కు గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌, మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌ నామినేషన్‌ సభలో కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ అభ్యర్థి డి.కె.అరుణ నామినేషన్‌కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ హాజరయ్యారు. భారాస అభ్యర్థుల్లో కొందరు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయగా.. ఆయా కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు వెళ్లారు.


నేటి నుంచి మరింత ఊపు

సోమవారం నుంచి మరింత ముమ్మర ప్రచారంతో ముఖ్యనాయకులు తమ శ్రేణుల్లో ఉత్సాహం నింపనున్నారు. పలువురు కేంద్రమంత్రులు నామినేషన్‌ కార్యక్రమాలకు విచ్చేయనున్నారు. చివరి రోజైన 25వ తేదీన భాజపా అగ్రనేత అమిత్‌షా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా మరికొందరు అభ్యర్థుల నామినేషన్లకు హాజరు కానున్నారు. భారాస అభ్యర్థుల నామినేషన్లు కూడా ఊపందుకోనుండగా.. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు పాల్గొననున్నారు. భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img