icon icon icon
icon icon icon

జూన్‌ నుంచే రుణమాఫీ అమలు చేయాలి

కాంగ్రెస్‌ ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని జూన్‌ నెల నుంచే అమలు చేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 22 Apr 2024 03:16 IST

కరీంనగర్‌ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: కాంగ్రెస్‌ ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని జూన్‌ నెల నుంచే అమలు చేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామంటున్నారని.. కానీ జూన్‌ 4తో ఎన్నికల కోడ్‌ ముగియనున్నందున మరుసటి రోజు నుంచే అమలు చేయడానికి ఇబ్బందులేమిటని ప్రశ్నించారు. ధాన్యానికి బోనస్‌గా ఇవ్వాల్సిన రూ.5 వేల కోట్లు లేవంటున్న ప్రభుత్వం.. రుణమాఫీకి దాదాపు రూ. 30 వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణం, తంగళ్లపల్లి, వీర్నపల్లి మండలాల్లో సంజయ్‌ ఎన్నికల ప్రచారం చేశారు. సిరిసిల్లలో ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. భాజపాకు రాముడంటే భక్తి ఉంది తప్ప.. రాముడిని రాజకీయాల కోసం వాడుకోబోదని ఆయన పేర్కొన్నారు. భారాస గుడిని మింగితే, కాంగ్రెస్‌ గుడిలోని లింగాన్ని కూడా మింగే రకమని విమర్శించారు.


భారాస వల్లే వస్త్ర పరిశ్రమలో సంక్షోభం

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి భారాస ప్రభుత్వమే కారణమని సంజయ్‌ విమర్శించారు. బతుకమ్మ చీరలు, ప్రభుత్వ ఆర్డర్లకు అవసరమైన నూలును అప్పటి మంత్రి కేటీఆర్‌ ప్రతిపాదించిన మూడు కంపెనీల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలంటూ షరతు పెట్టారని ఆరోపించారు. ఇతర కంపెనీల్లో కిలో రూ.100కు లభించే నూలును.. కేటీఆర్‌ సూచించిన కంపెనీలు రూ.150 చొప్పున విక్రయించడంతో నేతన్నలు భారీగా నష్టపోయారని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. నూలు కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌లో తనను ఓడించే కుట్రలో భాగంగానే ఇంతవరకు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. కాంగ్రెస్‌, భారాస కుమ్మక్కయినా.. తన విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర నాయకురాలు రాణి రుద్రమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img