icon icon icon
icon icon icon

ప్రజలు కోరుకున్న పాలన అందిస్తున్నాం

రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న పాలనను కాంగ్రెస్‌ ప్రభుత్వం సమర్థంగా అందిస్తుందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Published : 22 Apr 2024 03:17 IST

హుజూర్‌నగర్‌ ప్రచార సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న పాలనను కాంగ్రెస్‌ ప్రభుత్వం సమర్థంగా అందిస్తుందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆదివారం జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ తన పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు నియంతలా వ్యవహరించిన ఆయన.. ఇంకా అధికారంలోకి రాబోతున్నాననే భ్రమలో ఉన్నారని విమర్శించారు. 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ చెప్పడం.. ఈ దశాబ్దపు జోక్‌ అని అన్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేల వరకు భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్నారని గుర్తుచేశారు. ఇక ప్రతిరోజూ లెక్క చూసుకోవడమే కేసీఆర్‌ పని అని ఎద్దేవా చేశారు. భారాస నాయకుల సలహాలు ప్రభుత్వానికి అవసరం లేదని, తాము టీం వర్క్‌తో సమర్థంగా పనిచేస్తున్నామని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఏడు వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పారు.

వ్యాపారులు, మిల్లర్లు మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని.. పార్లమెంటరీ వ్యవస్థను ధ్వంసం చేసిన మోదీని గద్దె దించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సమర్థంగా పనిచేసి నల్గొండ కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ కలిశాక మరో పార్టీకి డిపాజిట్‌ రావడం సాధ్యం కాదని అన్నారు. రానున్న రోజుల్లో ఇండియా కూటమి గెలవబోతోందన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత కరవు కేసీఆర్‌ అసమర్థత వల్లే వచ్చిందని విమర్శించారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రధాని మోదీ నియంతృత్వ పోకడలతో రాజ్యాంగానికి తూట్లు పొడిచే చర్యలు చేపడుతున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన భారాస ఏ మొహం పెట్టుకొని ఓట్లడగడానికి వస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిని పదేళ్లు వెనక్కు తీసుకుపోయిన భారాసకు గుణపాఠం చెప్పాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img