icon icon icon
icon icon icon

మంతనాల మంత్రాంగం

లోక్‌సభ ఎన్నికల్లో ఊరూరు.. గడప గడపకూ తిరిగి ప్రచారం చేసేంత సమయం లేదు. ప్రతి గ్రామాన్ని చేరుకోవడం కూడా సాధ్యం కాదు. ఎండల తీవ్రత మరింత ప్రతికూలంగా మారింది.

Published : 22 Apr 2024 03:18 IST

మాజీ సర్పంచ్‌లు.. ప్రాదేశిక సభ్యులతో అభ్యర్థుల భేటీలు
పార్టీలో చేరకపోయినా మద్దతిస్తే చాలంటూ వేడుకోలు
ప్రచారంలో జోరు పెంచిన పలువురు అభ్యర్థులు
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా ఉంటామని భరోసా

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో ఊరూరు.. గడప గడపకూ తిరిగి ప్రచారం చేసేంత సమయం లేదు. ప్రతి గ్రామాన్ని చేరుకోవడం కూడా సాధ్యం కాదు. ఎండల తీవ్రత మరింత ప్రతికూలంగా మారింది. ఈ క్రమంలో ఓట్ల సాధనకు పలువురు అభ్యర్థులు దగ్గరి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికోసం పార్టీలతో సంబంధం లేకుండా స్థానికంగా బలమున్న ప్రజాప్రతినిధులపై దృష్టి పెట్టారు. ఒకవైపు ప్రచారం నిర్వహిస్తూనే గంపగుత్తగా ఓట్లు తమ ఖాతాలో వేసుకునే వ్యూహాలకు పదునుపెడుతున్నారు. కొన్ని నెలల్లో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా ఉంటామనే భరోసా ఇస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కొన్ని నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో వ్యయం తాము భరిస్తామంటూ పలువురు లోక్‌సభ అభ్యర్థులు స్థానిక నేతలకు మాట ఇస్తున్నారు. పార్టీల్లో పలుకుబడి ఉన్న అభ్యర్థులైతే ఒకడుగు ముందుకేసి.. సీటు ఇప్పించి గెలిపించే బాధ్యత తీసుకుంటామని, ఇప్పుడు మాత్రం గట్టెక్కించాలని కోరుతున్నట్లు తెలిసింది. దీంతో మండలాలు, పెద్ద గ్రామాల్లో గట్టి పట్టున్న ఎంపీపీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు డిమాండ్‌ పెరిగింది.కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు వారితో నేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు నెలల క్రితమే సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటికీ పట్టున్న వారిని కొన్ని చోట్ల దగ్గరికి తీస్తున్నారు. మున్సిపాలిటీలు, నగరపాలికల్లో ప్రస్తుత కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పాటు మాజీల నివాసాలకు వెళ్లి ఎన్నికల్లో సాయం కోరుతున్నారు.  

  • ఉత్తర తెలంగాణకు చెందిన ఓ అభ్యర్థి రెండు రోజుల క్రితం రెండు మూడు శాసనసభ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున సమావేశాలు పెట్టి మద్దతు కూడగట్టారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా ప్రతినిధులను పిలిపించి మాట్లాడారు. కొందరిని హైదరాబాద్‌లోని తన ఇంటికి కూడా పిలిపించుకున్నారు. వారు ఆ అభ్యర్థి ముందు భారీ డిమాండ్లనే ఉంచినట్లు తెలిసింది. మరోసారి కలిసినప్పుడు చర్చిద్దామని, మీ కష్టం ఎక్కడికీ పోదంటూ వారికి గట్టి భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
  • ఉత్తర తెలంగాణలోనే మరో అభ్యర్థి ప్రతి రోజు ఉదయం స్థానిక ప్రజాప్రతినిధులను నివాసానికి పిలిపించుకుని భేటీ నిర్వహిస్తున్నారు. సొంతపార్టీ ప్రజాప్రతినిధులతో మంతనాలు పూర్తయ్యాక వారి ఫోన్ల నుంచి ఇతర పార్టీలకు చెందిన స్థానిక నేతలతో మాట్లాడించి మద్దతు కూడగడుతున్నట్లు తెలిసింది. వీలైతే తమ పార్టీలో చేరాలని లేదంటే బయటి నుంచి గుట్టుగా ఓట్లు పడేలా చూస్తే చాలని కోరి.. తగిన హామీలు ఇస్తున్నట్లు సమాచారం. ఎప్పుడూ ‘లోకల్‌’ నాయకులను పట్టించుకోని ఆయన ఇప్పుడు పిలిచి పెద్దపీట వేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
  • దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాలో ఇప్పటికే తన పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పార్టీ మారినప్పటికీ.. ఆ అభ్యర్థి మాత్రం కొందరితో వ్యక్తిగతంగా భేటీ అవుతూ.. సాయం కోరుతున్నారు. ఈ ఒక్కసారి సాయం చేస్తే రాజకీయ జీవితం నిలబడుతుందంటూ తన కష్టం చెప్పుకొంటున్నట్లు తెలిసింది. తనను కలిసినట్లు ఎక్కడా బయటపడకుండా చూసుకోవాలని, మీ తరఫున ఉండే ఓటు బ్యాంకును తనకు మళ్లించాలని కోరినట్లు చర్చ జరుగుతోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img