icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ను ఓడిస్తేనే రుణమాఫీ అమలు

వంద రోజులలోపు రుణమాఫీ చేస్తామని చేయకుండా రైతులను మోసం చేసినందుకు రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది అన్నదాతలకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Published : 22 Apr 2024 03:20 IST

అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్‌రెడ్డికి ఆస్కార్‌ వస్తుంది
మాజీ మంత్రి హరీశ్‌రావు

మెదక్‌, న్యూస్‌టుడే: వంద రోజులలోపు రుణమాఫీ చేస్తామని చేయకుండా రైతులను మోసం చేసినందుకు రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది అన్నదాతలకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఆదివారం రాత్రి మెదక్‌లోని భారాస జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఓడిస్తేనే రైతులకు రుణమాఫీ జరుగుతుందన్నారు.  ‘నా ఎత్తు గురించి మాట్లాడడం కంటే, ముందుగా కర్షకులు పడుతున్న తిప్పల గురించి ఆలోచించాల’ని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. ‘‘కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చి 21 రోజులవుతోంది. ఇంతవరకు ఒక్క లారీ వడ్లు కూడా కొనలేదు. వందరోజుల పాలనలో రైతులు, ఆటో కార్మికుల ఆత్మహత్యలు జరిగినా, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ఇప్పటి వరకు ఒక్క బాధిత కుటుంబాన్నైనా సీఎం పరామర్శించారా? అబద్ధాలు మాట్లాడేందుకు సమయం కేటాయిస్తారు కానీ, రైతులను కలిసేందుకు సమయం లభించదా?

అవి సీఎం స్థాయి మాటలా?

ఇందిరాగాంధీ హయాంలో బీహెచ్‌ఈఎల్‌, ఇక్రిశాట్‌ పరిశ్రమలు వచ్చాయని మెదక్‌ సభలో రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పారు. బీహెచ్‌ఈఎల్‌ 1952లో ఏర్పాటైతే, ఇందిరాగాంధీ 1980లో మెదక్‌ ఎంపీగా గెలిచారు. ఇక్రిశాట్‌కు నాడు ప్రధాని చరణ్‌సింగ్‌ శంకుస్థాపన చేశారు. అబద్ధాలు చెప్పడంలో ఆస్కార్‌ అవార్డు ఇస్తే అది రేవంత్‌రెడ్డికే వస్తుంది. ‘ఉరికించి కొడతా, బొందపెడతా.. పేగులు మెడల వేసుకుంటా... మానవ బాంబునవుతా, కనుగుడ్లతో ఆడుకుంటా’ అని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. అవి అసలు సీఎం మాట్లాడే మాటలా?

మా ఆత్మగౌరవాన్ని రేవంత్‌ కొనలేరు

భారాస ఎమ్మెల్యేలను లాక్కుంటామని రేవంత్‌ పదేపదే చెబుతున్నారు. భారాస ఎమ్మెల్యేలను కొనవచ్చేమో కానీ, మా ఆత్మగౌరవాన్ని, భారాస కార్యకర్తలను ఆయన కొనుగోలు చేయలేరు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్‌రెడ్డి, నాడు మళ్లీ మల్కాజిగిరిలో పోటీచేశారు. మెదక్‌ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయిస్తే, ఆ జీవోను రేవంత్‌రెడ్డి రద్దు చేశారు. గత పదేళ్లలో మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో అభివృద్ధి జరగలేదని సీఎం పేర్కొనడం శోచనీయం. భారాస ప్రభుత్వం మెదక్‌ రైల్వేలైన్‌ నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించింది. ఘనపూర్‌ కాలువల ఆధునికీకరణకు రూ.100 కోట్లు ఖర్చు చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇచ్చింది. ఇందిరాగాంధీ హయాంలో మెదక్‌ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దానిని మాజీ సీఎం కేసీఆర్‌ నెరవేర్చారు. మూడు జిల్లాలకు వైద్యకళాశాలలను మంజూరు చేశాం’’ అని హరీశ్‌రావు వివరించారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు అహంకారం తలకెక్కిందని, దానిని నేలమీదకు దించాలంటే మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలవాలని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img