icon icon icon
icon icon icon

మోదీకి ఓట్లడిగే హక్కులేదు

తెలంగాణ అవతరణను పార్లమెంటులో అవమానించిన ప్రధాని మోదీకి రాష్ట్రంలో ఓట్లడిగే హక్కు లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 22 Apr 2024 06:49 IST

రాష్ట్ర ఏర్పాటును పార్లమెంటులో అవమానించారు
భాజపా చెరలో రాజ్యాంగ వ్యవస్థలు
కవిత బెయిల్‌ కోసం భాజపాకు భారాస పరోక్ష మద్దతు
నాతో పాటు సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికే అర్హత ఉంది
భువనగిరి సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఈనాడు, నల్గొండ: తెలంగాణ అవతరణను పార్లమెంటులో అవమానించిన ప్రధాని మోదీకి రాష్ట్రంలో ఓట్లడిగే హక్కు లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఏర్పాటే తప్పన్నట్లుగా మోదీ మాట్లాడారని.. దీనిపై భాజపా నాయకులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, అర్వింద్‌ ఏనాడూ స్పందించలేదని విమర్శించారు. రాష్ట్రానికి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమలను ఇవ్వలేదని.. అందుకు భాజపాకు ఓటేయాలా అని ప్రశ్నించారు. దేశంలో మోదీ దెబ్బకు ప్రజాస్వామ్యం కుప్పకూలిందన్నారు. ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ లాంటి రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ భాజపా చెరబట్టిందని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణకు కేంద్రంలో ఇండియా కూటమిని గెలిపించి, రాహుల్‌ గాంధీని ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో పార్టీ దెబ్బతింటుందని తెలిసినా.. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఆగస్టు 15లోపు రాష్ట్రంలోని రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో తన పాలనలో కేసీఆర్‌ విధ్వంసం సృష్టించారని ధ్వజమెత్తారు. ఆయన కుమార్తె కవితకు బెయిల్‌ కోసం భువనగిరిలో భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు భారాస మద్దతు ఇస్తోందని రేవంత్‌ ఆరోపించారు. ప్రస్తుత ఎన్నికల్లో భారాసకు ఒక్క స్థానం వచ్చినా మోదీకి తాకట్టు పెడతారని మండిపడ్డారు. ఆదివారం భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలతో కలిసి సీఎం పాల్గొన్నారు. పట్టణంలోని వినాయక్‌ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించారు. ‘‘గత పదేళ్లుగా మోదీ, కేసీఆర్‌లు అంటకాగారు. నోట్లరద్దుతో పాటు జీఎస్టీ లాంటి అన్ని బిల్లులకు పార్లమెంటులో భాజపాకు కేసీఆర్‌ మద్దతిచ్చారు. కేసీఆర్‌ తన పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ గత ప్రభుత్వంలో ఆయన బంధువులకే దక్కాయి. 30 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్‌పీఎస్సీలో నమోదు చేసుకుంటే పరీక్షలు నిర్వహించలేక పిల్లల ఆత్మహత్యలకు కారణమయ్యారు. మేం 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలిచ్చాం. ఎవరికైనా వివరాలు కావాలంటే రండి.. ఇస్తా. ఉద్యోగాల కల్పనపై భువనగిరి గడ్డపై చర్చకు సిద్ధం.

పేదల కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా

పోరాటాల పురిటిగడ్డ అయిన భువనగిరి.. కాంగ్రెస్‌కు కంచుకోట. 2009 నుంచి ఇక్కడ ఎంపీలుగా గెలుస్తున్న కోమటిరెడ్డి సోదరులు పేదలకు సాయం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్‌ ఎలెక్షన్‌, సెలెక్షన్‌, కలెక్షన్‌ అంటూ హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రావాళ్లని బెదిరించి డబ్బులు వసూలు చేశారు. మరోవైపు, ఓయూ విద్యార్థుల కోరిక మేరకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి పదవిని త్యాగం చేసి.. నల్గొండలో నిరాహార దీక్ష చేశారు. పార్టీ జెండాను మోసి.. అధిష్ఠానాన్ని మెప్పించి కోమటిరెడ్డి సోదరులు నాయకులుగా ఎదిగారు తప్ప.. ఎవరో ఆరోపించినట్లు నాకు మస్కా కొట్టలేదు. నాతోపాటు ముఖ్యమంత్రి పదవికి ఎవరికైనా అర్హత ఉందీ అంటే.. అది కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికే. నేను సీఎం పదవిని ఏనాడూ అహంకారంతో చూడలేదు. బాధ్యతగా భావిస్తున్నాను. పేదవాడి అభివృద్ధి, సంక్షేమం కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాను. మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రగతిభవన్‌ గడీలను బద్దలుకొట్టాం. ముళ్లకంచెను తీసేశాం. జ్యోతిబా ఫులే పేరుపెట్టి గౌరవించుకున్నాం. మూసీ ప్రక్షాళనతో పాటు బ్రాహ్మణవెల్లంల, గంధమల్ల, ఎస్‌ఎల్‌బీసీ, మూసీ ఉపకాల్వలను పూర్తి చేసే బాధ్యత      నాది. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తాం. ఎన్నికల కోడ్‌ ఎత్తివేయగానే గుట్టకు వచ్చి అన్ని సమస్యలు పరిష్కరిస్తా.

కమ్యూనిస్టులతో భిన్నాభిప్రాయాలున్నా అవమానపర్చలేదు

సీపీఎం, సీపీఐలతో అవసరాలు తీరిన తర్వాత కమ్యూనిస్టులను కేసీఆర్‌ పక్కనబెట్టి అవమానపర్చారు. కమ్యూనిస్టులతో భిన్నాభిప్రాయాలున్నా వారిని మేం అవమానపర్చలేదు. సీపీఐ కార్యాలయానికి ఉపముఖ్యమంత్రి భట్టి వెళ్లి.. కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. భారాస, భాజపాలను ఓడించడంలో కమ్యూనిస్టులు మాతో కలిసిరావాలి. సామాజిక న్యాయం చేయడంలో కాంగ్రెస్‌ను మించిన పార్టీ లేదు. మంత్రి కోమటిరెడ్డి చెప్పగానే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు విప్‌ పదవి ఇచ్చాం. అనిల్‌కుమార్‌ యాదవ్‌కు రాజ్యసభ ఎంపీ, పొన్నం ప్రభాకర్‌గౌడ్‌కు మంత్రి, మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఎమ్మెల్సీ, రాజయ్యకు ఆర్థిక సంఘం ఛైర్మన్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు విప్‌ పదవులిచ్చాం. నకిరేకల్‌కు చెందిన పాల్వాయి రజనిని టీఎస్‌పీఎస్సీ సభ్యురాలిని చేశాం. మంత్రి దామోదర్‌ రాజనర్సింహ నేతృత్వంలో ఎస్సీల వర్గీకరణకు చర్యలు తీసుకుంటున్నాం.

భువనగిరిలో గెలిపిస్తే ట్రిపుల్‌ ఇంజిన్‌ అభివృద్ధి

భువనగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి పోటీపడుతోంది భారాస, భాజపా అభ్యర్థులతో కాదు.. నల్గొండ కాంగ్రెస్‌ అభ్యర్థితోనే. ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుందన్నదే ప్రధాన అంశం. భువనగిరిలో డబుల్‌ ఇంజిన్‌ లాంటి కోమటిరెడ్డి సోదరులున్నారు. మూడు లక్షల మెజార్టీతో కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే.. ట్రిపుల్‌ ఇంజిన్‌తో అభివృద్ధి చేస్తారు’’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.


ప్రభుత్వాన్ని కూలుస్తామంటే తెలంగాణ భవన్‌ను లేపేస్తాం

-కోమటిరెడ్డి

ఎన్నికల్లో భారాసకు ఓటేస్తే భాజపాకు ఓటేసినట్లేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ‘‘ప్రభుత్వాన్ని కూలుస్తామని భారాస నేతలు మరోసారి అంటే హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ను లేపేస్తాం. రేవంత్‌రెడ్డికి కోమటిరెడ్డి సోదరులు మస్కా కొడుతున్నారని జగదీశ్‌రెడ్డి అంటున్నారు. మాకు రేవంత్‌ తమ్ముడు లాంటివారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో 20 ఏళ్లు ఉంటుంది. గంధమల్ల, బస్వాపూర్‌ ప్రాజెక్టులకు రూ.400 కోట్ల నిధులిస్తే.. పనులు పూర్తవుతాయి’’ అని పేర్కొన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేల్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మమ్మల్ని ఎందుకు ఓడించాలి?

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ను ఓడించాలని కేసీఆర్‌ అంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే గ్యారంటీలను అమలు చేస్తున్నందుకు ఓడించాలా? బీసీల జనాభా ప్రకారం నిధులు, విధులు ఇవ్వాలని మా మంత్రివర్గం నిర్ణయించినందుకు కాంగ్రెస్‌ను ఓడించాలా? కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఉద్యోగాలను ఊడగొట్టి పేద పిల్లలకు ఉద్యోగాలిచ్చినందుకు మా ప్రభుత్వాన్ని పడగొడతారా? దీనికి కేసీఆర్‌ సమాధానం చెప్పాలి.


ఫ్లోరైడ్‌ పాపం కేసీఆర్‌దే

 -సీఎం రేవంత్‌

2005లో ప్రారంభించిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును కేసీఆర్‌ పట్టించుకోలేదు. 33 కి.మీ. సొరంగంలో 10 కి.మీ.లు తవ్వాల్సి ఉండగా.. పదేళ్లలో పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి సమస్య తీరేది. కృష్ణా జలాలతో జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్‌ నుంచి విముక్తి లభించేది. ఈ సమస్య పరిష్కారం కాకపోవడానికి కేసీఆరే కారణం. 


నేడు 3 నియోజకవర్గాల్లో రేవంత్‌ పర్యటన

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మూడు లోక్‌సభ నియోజకవర్గాలు- ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మల్కాజిగిరిలలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ఆదిలాబాద్‌, మధ్యాహ్నం ఒంటి గంటకు నిజామాబాద్‌, సాయంత్రం 4.15 గంటలకు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img