icon icon icon
icon icon icon

దేశాభివృద్ధే భాజపా లక్ష్యం

70 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో జరిగిన వైఫల్యాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతి వంటి అంశాలను.. గత పదేళ్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సరిదిద్దుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

Updated : 22 Apr 2024 06:14 IST

ఉమ్మడి పౌరస్మృతి, జమిలి ఎన్నికలు, పేదలకు మరో మూడు కోట్ల ఇళ్లు
మ్యానిఫెస్టోలో మరెన్నో: కిషన్‌రెడ్డి
సంకల్ప పత్రం తెలుగు ప్రతి విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: 70 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో జరిగిన వైఫల్యాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతి వంటి అంశాలను.. గత పదేళ్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సరిదిద్దుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే భాజపా లక్ష్యమన్నారు. వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి మోదీ గ్యారంటీతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంపై కఠినంగా వ్యవహరించడంతో పాటు దేశ రక్షణ, అంతర్గత భద్రతకు భాజపా ఎంతో ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అమలు, దేశమంతటా శాసనసభలు, పార్లమెంటుకు ఒకేసారి (జమిలి) ఎన్నికలను సాకారం చేయనున్నామన్నారు. ఆదివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల మ్యానిఫెస్టో (సంకల్పపత్రం) తెలుగు ప్రతిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి ప్రకాశ్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. మ్యానిఫెస్టోలోని అంశాలను కిషన్‌రెడ్డి వివరిస్తూ.. దేశంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేలా మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. దేశ ప్రజలందరికీ నాణ్యమైన విద్య, వైద్యం, సొంత ఇల్లు.. మోదీ ఇచ్చే గ్యారంటీలని చెప్పారు. పేదలకు నెలకు ఐదు కిలోల బియ్యం, తాగునీరు, ఇళ్లకు సౌర విద్యుత్‌ పథకం అమలు సహా అనేక కార్యక్రమాలను భాజపా ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పేపర్‌ లీక్‌లను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను తీసుకువస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. నాణ్యమైన వైద్యం కోసం ఆయుష్మాన్‌ భారత్‌ పథకం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, పశుగణాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్మికుల ఆత్మగౌరవంతో పాటు ఉపాధికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. గిరిజన ఆచార వ్యవహారాలు, సంస్కృతిని కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. గత పదేళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్‌ ఐటీలు, 15 ఎయిమ్స్‌ ఆసుపత్రులు, 315 వైద్య కళాశాలలు, 390 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు. రైళ్ల ఆధునికీకరణ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు ప్రపంచంలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్‌ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని వివరించారు.


కాంగ్రెస్‌ది విభజిత భారత్‌

-లక్ష్మణ్‌

కాంగ్రెస్‌ పార్టీ న్యాయ పత్రం పేరిట విడుదల చేసిన మ్యానిఫెస్టోను ప్రజలు అన్యాయపత్రంగా భావిస్తున్నారని పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. భాజపా సంకల్ప పత్రాన్ని నరేంద్ర మోదీ గ్యారంటీగా ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ విభజన రాజకీయాలకు పాల్పడుతూ విభజిత భారత్‌గా మార్చాలని కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో.. ఓటు బ్యాంకు రాజకీయాలకు ముడిపెట్టిన పత్రం మాత్రమే అని అన్నారు. యూపీఏ పాలన అంతా కుంభకోణాలమయమన్నారు. యువత, మహిళలు, రైతులు, పేదల సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా భాజపా సంకల్ప పత్రాన్ని మోదీ గ్యారంటీగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు, ఉచితాల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img