icon icon icon
icon icon icon

ఖర్గే వద్దకు ఖమ్మం పంచాయితీ

ఖమ్మం కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి ఎంపిక పంచాయితీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు చేరింది.

Updated : 23 Apr 2024 06:50 IST

భట్టి, పొంగులేటితో విడివిడిగా సమావేశం
అధిష్ఠానంతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామన్న పార్టీ అధ్యక్షుడు

ఈనాడు, హైదరాబాద్‌: ఖమ్మం కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి ఎంపిక పంచాయితీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు చేరింది. గత కొన్ని రోజులుగా చర్చల మీద చర్చలు జరుగుతున్నా ముఖ్య నాయకులు ఎవరికి వారు తాము సూచించిన వారికే ఇవ్వాలని ఒత్తిడి తెస్తుండటంతో చివరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద సోమవారం ఉదయం బెంగళూరులో పంచాయితీ జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఖర్గే సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌ మున్షీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.  మొదట ఇద్దరితో వేర్వేరుగా, తర్వాత ఇద్దరితో కలిపి చర్చించినట్లు తెలిసింది. తొలుత భట్టి.. తన సతీమణికి టికెట్‌ ఇవ్వాలని కోరగా, దానికి అంగీకరించలేదని తెలిసింది. దాంతో పొంగులేటి కుటుంబ సభ్యులకు కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరు సూచించినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరినప్పుడు తాను సూచించిన వ్యక్తికి లోక్‌సభ టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చారని, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చిన మేరకు సీట్లు కేటాయించలేదని పొంగులేటి అన్నట్లు తెలిసింది. ‘‘నా సోదరుడు ప్రసాదరెడ్డికి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నా. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నా. అయితే పార్టీ నాయకులు రఘురామిరెడ్డి పేరును తెరమీదకు తెచ్చారు. ఆయన పాత తరం కాంగ్రెస్‌ నాయకుడు రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడిగానే కాకుండా ముందు నుంచి కాంగ్రెస్‌లో ఉన్నారు. నాతో రఘురామిరెడ్డికి బంధుత్వం ఇటీవల కాలంలోనే ఏర్పడింది’’ అని చెప్పినట్లు సమాచారం. ఇద్దరితో కలిసి చర్చించిన తర్వాత.. పార్టీ అధిష్ఠానం ముఖ్యులతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని, ఎవరికి ఇచ్చినా కలిసి విజయం కోసం పని చేయాలని సూచించినట్లు తెలిసింది. తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖర్గేతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని చెప్పినట్లు తెలిసింది. ఖమ్మంకు రఘురామిరెడ్డి, కరీంనగర్‌కు వెలిచాల రాజేందర్‌రావు, హైదరాబాద్‌కు షమీవలీ ఉల్లా పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యలో తెరపైకొచ్చిన మండవ వెంకటేశ్వరరావు పేరు పక్కకు వెళ్లినట్లు సమాచారం.

మొదటి నుంచీ తీవ్ర పోటీ...: ఖమ్మం లోక్‌సభ స్థానానికి మొదటి నుంచి ముఖ్యనాయకుల మధ్య పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపిక అధిష్ఠానానికి జటిలంగా మారింది. భట్టి.. తన భార్య నందినికి, మంత్రి పొంగులేటి.. తన సోదరుడు ప్రసాదరెడ్డికి, తుమ్మల.. తన కుమారుడు యుగంధర్‌కు టికెట్‌ ఇవ్వాలని కోరుతూ వచ్చారు. దీనిపై స్క్రీనింగ్‌ కమిటీలోనూ, కేంద్ర ఎన్నికల కమిటీలోనూ చర్చల మీద చర్చలు జరిగిన తర్వాత మంత్రుల కుటుంబ సభ్యులకు టికెట్‌ ఇవ్వడానికి అధిష్ఠానం అంగీకరించలేదు. ఇదే సమయంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌, తుమ్మల సానుకూలత వ్యక్తం చేయడంతో మండవ పేరు దాదాపు ఖరారైందనే ప్రచారం జరిగింది. అయితే భట్టి రాయల నాగేశ్వరరావు పేరును కూడా సూచించినట్లు తెలిసింది.  దీంతో ఖర్గే సోమవారం భట్టి, పొంగులేటిలతో బెంగళూరులో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img