icon icon icon
icon icon icon

ఎవరి ఆస్తులు ఎంతెంత?

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఇంతవరకు నామినేషన్లు దాఖలు చేసినవారిలో అత్యంత ధనికుడైన అభ్యర్థిగా చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నిలిచారు.

Updated : 23 Apr 2024 06:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఇంతవరకు నామినేషన్లు దాఖలు చేసినవారిలో అత్యంత ధనికుడైన అభ్యర్థిగా చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నిలిచారు. ఆయన తన కుటుంబ ఆస్తుల విలువ రూ.4,500 కోట్లకు పైగా ఉన్నట్లు అఫిడవిట్‌లో ప్రకటించారు. ఈ మేరకు ప్రధాన పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఆస్తులు, అప్పులు, కేసులు తదితర వివరాలతో అఫిడవిట్లు సమర్పించారు. వాటిలో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి.


రూ.4,568 కోట్ల ఆస్తులు..

అభ్యర్థి: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

నియోజకవర్గం: చేవెళ్ల

పార్టీ: భాజపా

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు కలిపి రూ.4,568.22 కోట్ల ఆస్తులున్నాయి. ఇందులో అత్యధిక శాతం వివిధ సంస్థల్లో పెట్టుబడులు. ఆయన వద్ద రూ.60 లక్షల విలువైన 86.2 తులాల బంగారు ఆభరణాలు, సతీమణి సంగీతారెడ్డి వద్ద రూ.10.40 కోట్ల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు ఉన్నాయి. చరాస్తుల విలువ     రూ.4,490.08 కోట్లు. విశ్వేశ్వర్‌రెడ్డి పేరిట రూ.1,178.72 కోట్లు, ఆయన సతీమణి పేరిట రూ.3,203.90 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేరిట 22 బ్యాంకు ఖాతాలున్నాయి. అపోలో ఆసుపత్రిలో రూ.2,577 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. పలు లిస్టెడ్‌, అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లోనూ షేర్లు ఉన్నాయి. నార్సింగి, చేవెళ్లతోపాటు ఏపీలోని చిత్తూరు జిల్లాల్లో 85.12 ఎకరాల వ్యవసాయ భూములు; చేవెళ్ల, హైదర్షాకోట్‌, స్నేహితహిల్స్‌లో వ్యవసాయేతర భూములు, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో వాణిజ్య భవనాలు, ఉస్మాన్‌గంజ్‌లో 14 మల్గీలు, పుప్పాలగూడ, బంజారాహిల్స్‌లో రెండు నివాస గృహాలు ఉన్నాయి. స్థిరాస్తుల విలువ రూ.78.14 కోట్లు. రూ.13.83 కోట్ల అప్పులున్నాయి. కుటుంబ సభ్యుల పేరిట సొంత కార్లు లేవు. ఆయనపై 4 క్రిమినల్‌ కేసులున్నాయి.


ఆస్తులు రూ.3.06 కోట్లు..

అప్పులు రూ.1.37 కోట్లు

అభ్యర్థి: అజ్మీరా సీతారాంనాయక్‌

నియోజకవర్గం: మహబూబాబాద్‌

పార్టీ: భాజపా

జ్మీరా సీతారాంనాయక్‌ కుటుంబ ఆస్తుల విలువ రూ.3.06 కోట్లు. ఆయన కుటుంబం వద్ద 87 తులాల బంగారు ఆభరణాలు, మూడు కార్లు, 6.17 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. శేరిలింగంపల్లి అప్పయ్యసొసైటీ, హనుమకొండలో నివాస గృహాలు ఉన్నాయి. రూ.1.37 కోట్ల అప్పులున్నాయి.


3.5 కిలోల బంగారం.. 60 ఎకరాల సాగు భూములు..

అభ్యర్థి: సురేశ్‌ షెట్కార్‌

నియోజకవర్గం: జహీరాబాద్‌

పార్టీ: కాంగ్రెస్‌

సురేశ్‌ షెట్కార్‌ కుటుంబానికి రూ.10.77 కోట్ల ఆస్తులున్నాయి. చరాస్తుల విలువ రూ.3.20 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ.7.57 కోట్లు. ప్రైమ్‌ ఫుడ్‌ టెక్‌ ప్రై.లిమిటెడ్‌లో రూ.20 లక్షల విలువైన షేర్లు, ఆయన సతీమణి పేరిట 3.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. నారాయణఖేడ్‌, సంగారెడ్డిలలో కలిపి 60.08 ఎకరాల వ్యవసాయ భూములు, నారాయణఖేడ్‌లో అర ఎకరా వ్యవసాయేతర భూమి, రెండు నివాస గృహాలు ఉన్నాయి. ఆయనపై ఒక క్రిమినల్‌ కేసు ఉంది.


సొంతంగా ఇల్లు, సాగు భూములేమీ లేవు..

అభ్యర్థి: కడియం కావ్య

నియోజకవర్గం: వరంగల్‌

పార్టీ: కాంగ్రెస్‌

డియం కావ్యకు రూ.1.55 కోట్ల ఆస్తులున్నాయి. సొంతంగా ఇల్లు, వ్యవసాయ భూమి వంటివి లేవు. కడియం కావ్యతో పాటు ఆమె భర్త మహ్మద్‌ నజీరుల్లా షేక్‌ వద్ద రూ.1.15 లక్షల నగదు ఉంది. ఆమె భర్త వివిధ వ్యక్తులు, సంస్థలకు అడ్వాన్సుల రూపంలో రూ.77 లక్షలు ఇచ్చారు. ఇన్నోవా క్రిస్టా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండా యాక్టివా ఉన్నాయి. ఇరువురి వద్ద 27 తులాలు,  పిల్లల పేరిట 8 తులాల బంగారం ఉంది. కావ్య భర్త పేరిట ఏపీలోని బాపట్ల జిల్లా మూలపాలెంలో రూ.5.88 లక్షల వ్యవసాయేతర భూమి ఉంది.


కెనడాలో రెండిళ్లు..

అభ్యర్థి: సైదిరెడ్డి శానంపూడి

నియోజకవర్గం: నల్గొండ

పార్టీ: భాజపా
సైదిరెడ్డి శానంపూడి కుటుంబానికి  రూ.31.35 కోట్ల ఆస్తులున్నాయి. నువాగ్రి ఇన్నోవేషన్‌, ఎంజీ పవర్‌ ప్రాజెక్టుల్లో షేర్లు ఉన్నాయి. కామాక్షి ఎడ్యుకేషనల్‌ సొసైటీకి రూ.2.5 కోట్ల అడ్వాన్సు ఇచ్చారు. రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నాయి. వ్యక్తిగతంగా 27 తులాల బంగారం, ఆయన సతీమణి పేరిట 1.5 కిలోల బంగారు ఆభరణాలున్నాయి. సిద్దిపేట జగదేవ్‌పూర్‌, సూర్యాపేటల్లో మొత్తం 9.04 ఎకరాల వ్యవసాయ భూమి; కోదాడ, సూర్యాపేటల్లో వ్యవసాయేతర భూములు, మల్కాజిగిరి, సూర్యాపేటల్లో వాణిజ్య భవనాలు ఉన్నాయి. కెనడాలో రెండు నివాస గృహాలు ఉన్నాయి. రూ.6.10 కోట్ల అప్పులున్నాయి. ఆయనపై 6 క్రిమినల్‌ కేసులున్నాయి.


11 నివాస గృహాలు, ప్లాట్లు..

అభ్యర్థి: పట్నం సునీత

నియోజకవర్గం: మల్కాజిగిరి

పార్టీ: కాంగ్రెస్‌

ట్నం సునీత కుటుంబానికి రూ.60.93 కోట్ల ఆస్తులున్నాయి. సొంతంగా 60 తులాల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్‌, ఇబ్రహీంపట్నం, వికారాబాద్‌లలో కలిపి మొత్తం 50.27 ఎకరాల వ్యవసాయ భూములు, వికారాబాద్‌ జిల్లా కోకట్‌ గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయేతర భూమి, కొండాపూర్‌, తాండూరు, షాబాద్‌, శంషాబాద్‌, హైదరాబాద్‌లలో మొత్తం 11 నివాస గృహాలు, ప్లాట్లు ఉన్నాయి.


అప్పులేమీ లేవు..

అభ్యర్థి: గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌

నియోజకవర్గం: హైదరాబాద్‌

పార్టీ: భారాస

డ్డం శ్రీనివాస్‌యాదవ్‌ కుటుంబానికి రూ.23.71 కోట్ల ఆస్తులున్నాయి. రెండు కార్లు, ఒక ద్విచక్రవాహనం, 53 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు కలిపి మొత్తం చరాస్తుల విలువ రూ.1.69 కోట్లు. శంషాబాద్‌ రాయన్నగూడలో 6.22 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌ ఓల్డ్‌ మలక్‌పేటలో రెండు 540 గజాల వ్యవసాయేతర స్థలాలు, హిమాయత్‌నగర్‌, బర్కత్‌పుర, బొగ్గులకుంట, కాచిగూడ, చిక్కడపల్లిల్లో 11 వాణిజ్య భవనాలు, రాంకోఠి, గౌలిగూడలో రెండు నివాస గృహాలు ఉన్నాయి. శ్రీనివాస్‌యాదవ్‌ కుటుంబానికి ఎలాంటి అప్పుల్లేవు. ఆయనపై 3 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.


18 వాహనాలు.. 19 కేసులు..

అభ్యర్థి: బీబీ పాటిల్‌

నియోజకవర్గం: జహీరాబాద్‌

పార్టీ: భాజపా

బీబీ పాటిల్‌ కుటుంబానికి రూ.151.69 కోట్ల ఆస్తులున్నాయి. చరాస్తుల విలువ రూ.8.84 కోట్లు. స్థిరాస్తుల విలువ రూ.142.85 కోట్లు. మల్లికార్జున కన్‌స్ట్రక్షన్స్‌, బస్వంత్‌ బిల్డర్స్‌, పాటిల్‌ ఇండస్ట్రీస్‌, అభిషేక్‌ ప్రాపర్టీస్‌, సంభాజీరాజే సహకార కార్ఖానా, జైమాతాదీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, పంజాబ్‌ సింధ్‌బ్యాంకు, నదిగ్రామ్‌ పత్‌సంస్థ, అకోలా అర్బన్‌బ్యాంకు, విశ్వేశ్వరయ్య సహకార సొసైటీ, జలగాం జనతా సహకార బ్యాంకు, సమత నగరి సహకార సంస్థ, సన్‌రైజ్‌ ఇన్ఫోపార్కులలో రూ.1.88 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. పాటిల్‌ దంపతులిద్దరూ రూ.4.51 కోట్ల అప్పులు, అడ్వాన్సులు ఇచ్చారు. మొత్తం 18 వాహనాలు ఉన్నాయి. పాటిల్‌ వద్ద 63.4 తులాలు, ఆయన సతీమణి వద్ద 66 తులాల బంగారు ఆభరణాలు, 1.93 కిలోల వెండి వస్తువులున్నాయి. నిజామాబాద్‌, ఔరంగాబాద్‌, రత్నగిరిలో 61.10 ఎకరాల వ్యవసాయ భూములు, బంజారాహిల్స్‌, కూకట్‌పల్లి, ఔరంగాబాద్‌, పుణెలో 65.8 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నాయి. ఔరంగాబాద్‌లో రెండు వాణిజ్య భవనాలు, కామారెడ్డిలో నివాస భవనం పాటిల్‌ పేరిట ఉన్నాయి. రూ.3.52 కోట్ల అప్పులున్నాయి. ఆయనపై 19 క్రిమినల్‌ కేసులున్నాయి.


సొంతంగా వాహనం లేదు

అభ్యర్థి: కాసాని జ్ఞానేశ్వర్‌

నియోజకవర్గం: చేవెళ్ల

పార్టీ: భారాస

కాసాని జ్ఞానేశ్వర్‌ కుటుంబానికి రూ.228.47 కోట్ల ఆస్తులున్నాయి. బ్యాంకు డిపాజిట్లతో పాటు కాసాని కన్‌స్ట్రక్షన్స్‌, కాసాని హోటల్స్‌, కేజీఎం బయోటెక్‌, ఇంప్రెసివ్‌ హోటల్స్‌, విన్నింగ్‌ఎడ్జ్‌, ఆకాషైనీ హెల్త్‌కేర్‌ సంస్థల్లో షేర్లు ఉన్నాయి. సొంతగా ఆయనకు వాహనాలు లేవు. ఆయన సతీమణి పేరిట 4 కార్లు ఉన్నాయి. జ్ఞానేశ్వర్‌ దంపతుల వద్ద 12 తులాల బంగారు ఆభరణాలున్నాయి. ఇద్దరికీ కలిపి చరాస్తుల విలువ రూ.15.12 కోట్లు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు, మహబూబ్‌పేట మక్తా, వికారాబాద్‌ శివారెడ్డిపేటల్లో కలిపి మొత్తం 50.20 ఎకరాల వ్యవసాయ భూములు, బాచుపల్లిలో 6.28 ఎకరాలు, గాజుల రామారంలో 1.05 ఎకరాలు, ఖానామెట్‌లో 18 గుంటలు, చందానగర్‌లో 2.10 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నాయి. గుట్టల బేగంపేట్‌లో రెండు వాణిజ్య భవనాలు, అమీర్‌పేట, బాచుపల్లిలో నివాస గృహాలు ఉన్నాయి. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.213.35 కోట్లు. రూ.30 లక్షల అప్పులున్నాయి. ఆయనపై ఒక క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉంది.


43.31 ఎకరాల సాగు భూములు..

అభ్యర్థి: క్యామ మల్లేశ్‌

నియోజకవర్గం: భువనగిరి

పార్టీ: భారాస

క్యామ మల్లేశ్‌ కుటుంబ ఆస్తుల విలువ రూ.145.34 కోట్లు. మూడు కార్లు, 1.1 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. 43.31 ఎకరాల వ్యవసాయ భూములు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 1,329 గజాల వ్యవసాయేతర భూమి, ఇబ్రహీంపట్నంలో ఒకటి, వనస్థలిపురంలో రెండు నివాస గృహాలతో కలిపి మొత్తం స్థిరాస్తుల విలువ రూ.116.98 కోట్లు. మొత్తం రూ.63.46 లక్షల అప్పులున్నాయి.


అప్పులు లేవు.. కేసులు లేవు..

అభ్యర్థి: మరపల్లి సుధీర్‌కుమార్‌

నియోజకవర్గం: వరంగల్‌

పార్టీ: భారాస

సుధీర్‌కుమార్‌ కుటుంబానికి రూ.2.04 కోట్ల ఆస్తులున్నాయి. టాటా జెస్ట్‌ కారు, 8 తులాల బంగారు ఆభరణాలు, హనుమకొండలో 18 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల వ్యవసాయేతర భూమి, ఒక ఇల్లు ఉన్నాయి. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.1.79 కోట్లు. అప్పులు, క్రిమినల్‌ కేసులు లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img