icon icon icon
icon icon icon

సమయం లేదు మిత్రమా...

ఎన్నికల ప్రచారానికి సమయం సమీపిస్తోంది. మరో 19 రోజులు(వచ్చే నెల 11) మాత్రమే గడువు ఉంది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇంకా గూడేలు, తండాలు, గ్రామాలకు వెళ్లలేదు.

Published : 23 Apr 2024 03:23 IST

మరో 19 రోజులే ప్రచారానికి గడువు
ఇంకా గ్రామాలు, గూడేలకు వెళ్లని అభ్యర్థులు
పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు వెళ్లి పలకరింపులు
మండుటెండలు, తక్కువ సమయంతో హైరానా

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల ప్రచారానికి సమయం సమీపిస్తోంది. మరో 19 రోజులు(వచ్చే నెల 11) మాత్రమే గడువు ఉంది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇంకా గూడేలు, తండాలు, గ్రామాలకు వెళ్లలేదు. కొందరు అభ్యర్థులైతే ఇంతవరకూ కొన్ని మండల కేంద్రాలకు కూడా వెళ్లలేదు. చాలా లోక్‌సభ నియోజకవర్గాలలో 45 నుంచి 50 మండలాలు, వెయ్యికి పైగా గ్రామాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 52 మండలాలు, 1,825 గ్రామాలు, 380 అటవీ గూడేలు, తండాలు ఉన్నాయి. మహబూబాబాద్‌ నియోజకవర్గంలో 1,158 గ్రామాలు, పెద్దసంఖ్యలో తండాలు ఉన్నాయి. ఇంతవరకూ తండాలు, అటవీ గూడేల్లో ఎక్కడా ఎన్నికల సందడే కనిపించడం లేదు. సమయం బాగా తక్కువగా ఉన్నందున రోడ్‌షోలు, ర్యాలీలు, పెద్ద నేతలతో బహిరంగ సభలు వంటివాటిపై అభ్యర్థులు దృష్టి పెడుతున్నారు. గ్రామస్థాయిలో ఉండే స్థానిక నేతలు, వార్డు సభ్యులు కీలకమని వారు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 44 డిగ్రీల వరకూ ఉంటున్న ఉష్ణోగ్రతల్ని భరించలేక కార్యకర్తలు పగటిపూట ప్రచారానికి రావడానికి జంకుతున్నారు. ఉదయం 6 నుంచి 12 వరకూ తిరిగి సాయంత్రం 5 నుంచి నేతలు, అభ్యర్థులు సమావేశాలు, ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఏ ఫంక్షన్‌ ఉన్నా అతిథులుగా వెళ్లి....

పార్లమెంటు ఎన్నికలలో ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలవడం సాధ్యం కాదు కాబట్టి.. అభ్యర్థులు ఎక్కువగా గ్రామాల్లో జరిగే పలు రకాల ఫంక్షన్లు, ఇతర కుటుంబ కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు. అక్కడకు అతిథులుగా వెళ్తున్నారు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు ఏం ఉన్నాయని గ్రామాలవారీగా సమాచారం సేకరించి అక్కడికి అభ్యర్థులు, ముఖ్యనేతలు వెళ్లి కలుస్తున్నారు. ఎక్కడ ఎవరు చనిపోయినా సమాచారం తెలుసుకుని వెళ్లి బాధిత కుటుంబానికి సానుభూతి, సంతాపం తెలిపి పేదలైతే ఎంతోకొంత ఆర్థిక సాయం చేస్తున్నారు. అభ్యర్థి వెళ్లలేకపోతే ఎమ్మెల్యే లేదా ఇతర ముఖ్యనేతలను సైతం పంపుతున్నారు. అలాగే వివిధ సంఘాల పెద్దలని పిలిపించుకుని మాట్లాడుతూ తమ పార్టీకి ఓటు వేయించాలని కోరుతున్నారు. రోడ్‌షోలు, ర్యాలీలతో ప్రజలందరి దృష్టి ఆకర్షించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఒక అభ్యర్థి చెప్పారు. పార్టీ పెద్ద నేతలతో బహిరంగ సభలను ఏర్పాటుచేయడం ద్వారా నియోజకవర్గంలో అందరికీ చేరువకావచ్చని వాటిపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జుల ద్వారా స్థానిక ప్రచారం చేయిస్తున్నట్లు పలువురు అభ్యర్థులు తెలిపారు. కొన్ని పార్టీలు ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి టికెట్లు ఇచ్చాయి. తాము కొత్తగా చేరిన పార్టీ గుర్తుకే ఓటు వేయించాలని గ్రామస్థాయి నేతలను అభ్యర్థులు కోరుతున్నారు. వారి ద్వారా ఈ సమాచారాన్ని ప్రభావవంతంగా ఓటర్లకు చేరవేయాలని అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో ప్రభావం చూపగల కార్యకర్తల వివరాలనూ సేకరిస్తున్నారు. ఆ కేంద్రం పరిధిలో ఏ గుర్తుకు ఓటు వేయాలనే విషయంపై వారితో ప్రచారం చేయించడంపై అభ్యర్థులు దృష్టిపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img