icon icon icon
icon icon icon

ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలి

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

Published : 23 Apr 2024 03:26 IST

ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దేశ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పకపోతే ఆయనను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కోరింది. గాంధీభవన్‌లో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈసీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ‘కాంగ్రెస్‌ వస్తే సంపదంతా ముస్లింలకే. అర్బన్‌ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నేతలు మహిళల మంగళ సూత్రాల్నీ వదలరు’ అంటూ రాజస్థాన్‌ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడిన విషయాన్ని ఫిర్యాదులో ప్రస్తావించినట్టు చెప్పారు.  కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో గురించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మోదీ ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికి రెండు సార్లు ఆయన కోడ్‌ ఉల్లంఘించారన్నారు. హైదరాబాద్‌ ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ కోడ్‌ ఉల్లంఘిస్తూ ప్రసంగించారని, ఆయన్ను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని నిరంజన్‌ ఈసీని కోరారు. ‘మోదీకి ఓటమి భయం పట్టుకుంది. విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు’ అని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మండిపడ్డారు. మోదీ వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఎన్నికల కమిషన్‌ చెప్పాలన్నారు. మహిళలను కించపరిచేలా మోదీ మాట్లాడుతున్నారని వీహెచ్‌ అన్నారు. వారు గాంధీభవన్‌లో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని