icon icon icon
icon icon icon

వంద రోజుల్లోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత

అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

Published : 23 Apr 2024 03:34 IST

8 నుంచి 10 స్థానాల్లో భారాసదే గెలుపు
సిరిసిల్ల కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో సోమవారం సిరిసిల్ల పట్టణ క్లస్టర్‌ స్థాయి పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని.. లోక్‌సభ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. భారాసకే విజయావకాశాలు  ఎక్కువగా ఉన్నాయని, 8 నుంచి 10 స్థానాల్లో గెలుస్తామని సర్వే సంస్థలు చెబుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే ఉచిత బస్సు తీసేస్తామంటున్నారని, ప్రజలు కూడా దీనిపై ఆలోచన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌, భాజపా మోసాలను ఎండగడుతూ లోక్‌సభ ఎన్నికల్లో కొట్లాడుదామని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్‌ విజయం సాధించిందన్నారు.


కరీంనగర్‌కు బండి చేసిందేమీ లేదు

యిదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఒక పాఠశాల గానీ, ఉన్నత విద్యాసంస్థను గానీ తీసుకురాలేదన్నారు. కనీసం ఒక్క ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. యువతకు ఉపాధి అవకాశాల కోసం ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని తెలిపారు. భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌ గెలిస్తే పార్లమెంటు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ‘ఇప్పుడు మీరు కష్టపడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ గెలుపు కోసం కష్టపడతానని’ నేతలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ వారు భారాస నాయకులను పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారని, చేరని వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. సిరిసిల్లలో మే 10న కేసీఆర్‌ రోడ్‌ షో ఉంటుందని, ప్రతి కార్యకర్త తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img