icon icon icon
icon icon icon

నాలుగో రోజు 121 నామినేషన్లు

లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వంలో నాలుగో రోజైన సోమవారం 121 నామినేషన్లు దాఖలయ్యాయి.

Published : 23 Apr 2024 03:39 IST

కాంగ్రెస్‌, భారాస, భాజపా నుంచి 9 మంది దాఖలు

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వంలో నాలుగో రోజైన సోమవారం 121 నామినేషన్లు దాఖలయ్యాయి. పలుచోట్ల కాంగ్రెస్‌, భారాస, భాజపాల నుంచి 9మంది అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను ఆయా నియోజకవర్గ ఎన్నికల అధికారులకు అందజేశారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పట్నం సునీత(మల్కాజిగిరి), డాక్టర్‌ కడియం కావ్య(వరంగల్‌), వెలిచాల రాజేందర్‌రావు(కరీంనగర్‌) నామినేషన్లు వేశారు. భారాస నుంచి డాక్టర్‌ ఎం.సుధీర్‌కుమార్‌(వరంగల్‌), క్యామ మల్లేశ్‌(భువనగరి), గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌(హైదరాబాద్‌) నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. భాజపా నుంచి అజ్మీరా సీతారాంనాయక్‌(మహబూబాబాద్‌), బీబీ పాటిల్‌(జహీరాబాద్‌), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(చేవెళ్ల) దాఖలు చేశారు.

అధికంగా కరీంనగర్‌లో..

అత్యధికంగా సోమవారం ఒక్క రోజు కరీంనగర్‌ నియోజకవర్గంలో 13 నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దపల్లిలో 12, మల్కాజిగిరి, భువనగిరిలో 11 చొప్పున, వరంగల్‌ 10, సికింద్రాబాద్‌ తొమ్మిది, జహీరాబాద్‌, మెదక్‌, ఖమ్మం, నల్గొండలలో ఏడు చొప్పున, చేవెళ్ల, హైదరాబాద్‌ ఆరు వంతున, నిజామాబాద్‌లో అయిదు, మహబూబాబాద్‌లో నాలుగు, నాగర్‌కర్నూల్‌లో మూడు, మహబూబ్‌నగర్‌లో రెండు, ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఒక్క నామినేషన్‌ దాఖలయ్యాయి. పలువురు అభ్యర్థులు గతంలో ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేసిన వారు సోమవారం రెండో, మూడో సెట్లను అందజేశారు. ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

వరంగల్‌ పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్యకు నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. చిత్రంలో వర్ధన్నపేట, వరంగల్‌ పశ్చిమ, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కేఆర్‌ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దొమ్మాటి సాంబయ్య


భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హన్మంత్‌ కె.జెండగేకు నామినేషన్‌ పత్రాన్ని అందజేస్తున్న భారాస అభ్యర్థి క్యామ మల్లేశ్‌. చిత్రంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి


సంగారెడ్డిలో ఎన్నికల అధికారి వల్లూరి క్రాంతికి నామినేషన్‌ పత్రాలు అందిస్తున్న జహీరాబాద్‌ భాజపా అభ్యర్థి బీబీ పాటిల్‌. పక్కన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, భాజపా కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, పార్టీ సంగారెడ్డి జిల్లా నాయకుడు బస్వరాజు పాటిల్‌


మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి కరీంనగర్‌లో ఆర్వో పమేలా సత్పతికి నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న కాంగ్రెస్‌ నేత వెలిచాల రాజేందర్‌రావు. చిత్రంలో చొప్పదండి, వేములవాడ, మానకొండూరు ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్‌, కవ్వంపల్లి సత్యనారాయణ


వరంగల్‌ రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్యకు నామినేషన్‌ పత్రాలిస్తున్న భారాస ఎంపీ అభ్యర్థి మరపల్లి సుధీర్‌కుమార్‌. చిత్రంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌


మహబూబాబాద్‌లో ఆర్వో అద్వైత్‌కుమార్‌సింగ్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌. చిత్రంలో పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ జిల్లాల అధ్యక్షులు రంగాకిరణ్‌, రవికుమార్‌, పార్టీ నేత బాలరాజు, మహబూబాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img