icon icon icon
icon icon icon

రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సీఎం సిద్ధమా?

‘దేవుళ్లను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు.. రైతుబంధు సాయమే సరిగా ఇవ్వలేదు.

Published : 23 Apr 2024 03:40 IST

అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చారు
కాంగ్రెస్‌ అంటే కరవు, కోతలు, కష్టాలు..
మీ హామీలే మీకు భస్మాసుర హస్తాలవుతాయి..
భారాస సీనియర్‌ నేత హరీశ్‌రావు ధ్వజం

సంగారెడ్డి టౌన్‌, కొండాపూర్‌, న్యూస్‌టుడే: ‘దేవుళ్లను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు.. రైతుబంధు సాయమే సరిగా ఇవ్వలేదు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామంటూ, ఎవరి చెవిలో పూలు పెడతారు? ఏకకాలంలో రూ.39 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేయకపోతే, మీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారా?’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి భారాస సీనియర్‌ నాయకుడు హరీశ్‌రావు సవాల్‌ చేశారు. ‘డిసెంబరు 9న రుణమాఫీ చేస్తానన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తానన్నారు. మొదటి సంతకం ఏమైంది? అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చారు’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్లేపల్లిలో సోమవారం భారాస ముఖ్య కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశం అనంతరం హరీశ్‌రావు విలేకర్లతో మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ప్రతి రోజు ప్రజలను కలుస్తానని చెప్పిన సీఎం.. ఒక్కరోజులోనే దాన్ని పక్కన పెట్టేశారని ఆరోపించారు. పదిహేను రోజులైనా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంలేదని ఆ పార్టీ నాయకులు మోత్కుపల్లి, హనుమంతరావు చెబుతున్నారంటే పరిస్థితి అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్‌ అంటే కరవు, కరెంట్‌ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అని ధ్వజమెత్తారు. ఓటేయకపోతే సంక్షేమ పథకాలు బంద్‌ అవుతాయని ఓటర్లను బెదిరించడం దారుణమన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగినా సర్కారుకు సోయి లేదన్నారు. 2014, 2019 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని, ప్రజలు ఆ పార్టీ పాలన వద్దనుకుంటున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎందుకు ఓడించాలని రేవంత్‌ అడుగుతున్నారని.. ఎందుకు ఓడించాలనడానికి వందల కారణాలున్నాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను బాండు పేపర్‌లో ముద్రించి, హామీలను అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ హామీలే ఇప్పుడు ఆ పార్టీకి భస్మాసుర హస్తంగా మారతాయని హెచ్చరించారు. సమావేశంలో భారాస మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img