icon icon icon
icon icon icon

రాష్ట్రంలో సీట్లన్నీ గెలుస్తాం

హైదరాబాద్‌ సహా తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు.

Published : 23 Apr 2024 03:43 IST

మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం
కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యలు

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, రాజేంద్రనగర్‌: హైదరాబాద్‌ సహా తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని పేర్కొన్నారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు ఎదురులేదు. ప్రతిపక్షాలు సిద్ధాంతాలను పక్కనపెట్టి ఇండియా కూటమి పేరుతో ఏకమయ్యాయి. సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు దిల్లీలో దోస్తీ చేస్తూ... కేరళలో కుస్తీ పడుతున్నాయి. బెంగాల్‌లో మమత బెనర్జీకి కాంగ్రెస్‌తో పొసగడం లేదు. రాహుల్‌గాంధీ కేరళకు వెళ్లి విజయన్‌ను, బెంగాల్‌కు వెళ్లి మమతను విమర్శించడం ఇందుకు నిదర్శనం. ఆయన ఎప్పటికీ ప్రధాని కాలేరు. మోదీ అనుసరించిన సమర్థమైన ఆర్థిక విధానాలతో దేశంలో పేదరికం తగ్గింది’’ అని పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ఎన్‌డీఏ పక్షాలతో కలిసి 400 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అవినీతి భారాస పని అయిపోయిందని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు.

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం అహర్నిశలు పనిచేస్తున్న నరేంద్రమోదీని మరోసారి ప్రధానిని చేయడానికి చేవెళ్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తాను ఎంపీగా విజయం సాధించాక కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెప్పించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.  మాయమాటలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అంతకుముందు విశ్వేశ్వర్‌రెడ్డి.. తన సతీమణి సంగీతారెడ్డితో కలిసి ర్యాలీగా రాజేంద్రనగర్‌లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకొని నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి, మాజీ శాసనసభ్యుడు కె.ఎస్‌.రత్నం, భాజపా నేతలు రవికుమార్‌యాదవ్‌, శ్రీరాములు, వీరేందర్‌గౌడ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img