icon icon icon
icon icon icon

నెహ్రూ ఉదాసీనతతోనే చైనా దురాక్రమణ

స్వాతంత్య్రానంతరం మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ అనుసరించిన వైఖరి మన విదేశాంగ విధానంపై ప్రభావం చూపి.. దేశానికి తీవ్ర నష్టం కలిగించిందని విదేశాంగశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆరోపించారు.

Published : 24 Apr 2024 03:29 IST

పటేల్‌ మాటలను పట్టించుకోని నాటి ప్రధాని
ఈసారి వేసే ఓటు విశ్వాసానికి, గ్యారంటీకి..
విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌

ఈనాడు, హైదరాబాద్‌: స్వాతంత్య్రానంతరం మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ అనుసరించిన వైఖరి మన విదేశాంగ విధానంపై ప్రభావం చూపి.. దేశానికి తీవ్ర నష్టం కలిగించిందని విదేశాంగశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆరోపించారు. దూరదృష్టి లేకపోవడం, ఉదాసీనంగా వ్యవహరించడంతో చైనాతో స్నేహపూర్వక సంబంధాలపై వ్యతిరేక ప్రభావం చూపిందన్నారు. పాకిస్థాన్‌తోనూ సరిగ్గా వ్యవహరించకపోవడం వల్లే సరిహద్దుల వెంట సుదీర్ఘకాలం ఉద్రిక్తతలు కొనసాగాయన్నారు. ఫోరం ఫర్‌ నేషనలిస్ట్‌ థింకర్స్‌ హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ‘భారతదేశ విదేశాంగ విధానం- విభేదాల నుంచి విశ్వాసం’ అనే అంశంపై జైశంకర్‌ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, ఫోరం ఫర్‌ నేషనలిస్ట్‌ థింకర్స్‌ అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు సహా పలువురు పాల్గొన్నారు. చైనాతో సంబంధాలపై 1950లో నాటి హోంశాఖ మంత్రి సర్దార్‌ పటేల్‌ సూచనను నెహ్రూ పట్టించుకోని ఫలితంగానే 1962లో భారత్‌పై ఆ దేశం దురాక్రమణకు పాల్పడిందని జైశంకర్‌ అన్నారు. పాకిస్థాన్‌తో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని, ఆక్రమిత కశ్మీర్‌ను ఎందుకు విస్మరించాయని ప్రశ్నించారు. గత పదేళ్లలో భాజపా ప్రభుత్వం నాటి తప్పులను చాలావరకు సరిదిద్దిందని తెలిపారు.

యూపీఏ హయాంలో ఎందుకు వెనుకడుగు?

‘‘2008లో ముంబయిపై ఉగ్రదాడుల అనంతరం.. నాటి యూపీఏ ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన చర్యలకు వెనుకాడింది. ఆనాటి జాతీయ భద్రతా సలహాదారు దీని గురించి రాస్తూ.. ‘మేం దీనిపై కూలంకషంగా చర్చించాం. పాకిస్థాన్‌పై దాడి చేయకపోవడం కంటే.. దాడి చేయడం వల్లే ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఏమీ చేయకపోవడమే మంచిదన్న నిర్ణయానికొచ్చాం’ అని పేర్కొన్నారు. ఇక దీని భావం ఏమిటో మీరే అర్థం చేసుకోండి’’ అని జైశంకర్‌ వివరించారు. అప్పట్లో ఇలాంటి రక్షణాత్మక ధోరణి వల్ల ఉగ్రవాదాన్ని పరోక్షంగా ఆమోదించినట్లయ్యిందని అన్నారు. అలాంటి సంశయాత్మక వైఖరి నేడు లేదని.. ఇప్పుడున్నదంతా ఆత్మవిశ్వాసమేనని తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దుతో పాటు, సరిహద్దులు దాటి పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో దాడులు చేయడం ద్వారా సీమాంతర ఉగ్రవాదాన్ని సహించబోమనే హెచ్చరికలు పంపామని జైశంకర్‌ ఉదహరించారు.

పాతికేళ్ల భవిష్యత్తు కోసం ఓటేయాలి

స్వదేశీ అవసరాల కోసం కొవిడ్‌ వ్యాక్సిన్‌ను సొంతంగా తయారు చేసుకోవడమే కాకుండా.. ఇతర దేశాల అవసరాలనూ తీర్చిన దౌత్యనీతి మనదని జైశంకర్‌ తెలిపారు. ఆయుధాల తయారీలో స్వయంసమృద్ధి సాధించి.. బ్రహ్మోస్‌ క్షిపణులు సహా అనేక ఆయుధాలను ఇతర దేశాలకు విక్రయించే స్థితికి భారత్‌ చేరుకోవడంలో పదేళ్ల భాజపా ప్రభుత్వ కృషి ఉందన్నారు. 2014కు ముందు కూడా ఇవే వనరులు, సదుపాయాలు, శాస్త్రవేత్తలు ఉన్నా.. ప్రభుత్వ ఆలోచన ధోరణిలో మార్పులే దేశ గమనాన్ని మార్చాయన్నారు. ఆత్మనిర్భర భారత్‌, మేకిన్‌ ఇండియా వంటి అనేక విధానాలతో సాధిస్తున్న ఫలితాలు ప్రపంచ దేశాల్లో మన ప్రత్యేకతను చాటుతున్నాయన్నారు. మాల్దీవులు చైనాకు చేరువై, భారత్‌కు దూరం కావడంపై స్పందిస్తూ.. దేశాల మధ్య సంబంధాలను ఒకటి రెండు అంశాలే కాకుండా అవసరాలు, వైద్యం, ఆహార పదార్థాలు సహా అనేక విషయాలు ప్రభావితం చేస్తాయన్నారు. విశ్వాసం, గ్యారంటీతో పదేళ్లలో వేసుకున్న బలమైన పునాదులపై ఆధారపడి.. సాధికారతతో 25 ఏళ్ల భవిష్యత్తు నిర్మాణానికి ఈసారి ఓటు వేస్తున్నామని గుర్తించాలన్నారు. మే 13 పోలింగ్‌ రోజున అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img