icon icon icon
icon icon icon

నీటిని ఏపీకి దోచిపెట్టి నీతులు చెబుతారా?

పదేళ్ల భారాస పాలనలో కమీషన్లకు కక్కుర్తి పడి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌కు దోచిపెట్టిన నేతలు కూడా నీటి జలాల పంపిణీపై మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.

Published : 24 Apr 2024 03:32 IST

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: పదేళ్ల భారాస పాలనలో కమీషన్లకు కక్కుర్తి పడి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌కు దోచిపెట్టిన నేతలు కూడా నీటి జలాల పంపిణీపై మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘కృష్ణా జలాలు, ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత భారాస నేతలకు లేదు. మనకు రావాల్సిన నీటిని ఏపీకి దోచిపెట్టారు. కమీషన్లకు కక్కుర్తి పడి నిర్మించిన ప్రాజెక్టులన్నీ కూలిపోతున్నాయి. మొన్న మేడిగడ్డ ప్రాజెక్టు, నేడు పెద్దపల్లి ఓడేడ్‌ వంతెన ఇందుకు నిదర్శనం. భారాస పార్టీ చేసిన అరాచకాలు, మోసాలపై ప్రజలు విసిగిపోయారు. ఆ పార్టీ నేతలు మొసలి కన్నీరు కార్చినా, పొర్లు దండాలు పెట్టినా, బస్సు యాత్ర చేసినా ప్రజలు, సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ విషయం తెలుసు కాబట్టే ఈ నెల 27న భారాస వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించడం లేదు.

ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలకు దిగుతారా?

కాంగ్రెస్‌ నేతలు టీవీల్లో బ్రేకింగ్‌ న్యూస్‌ కోసం భాజపాపై, నాపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ప్రభుత్వ విధానాలపై నేను ప్రశ్నిస్తుంటే వ్యక్తిగత దూషణలు చేయడం ఎంతవరకు సమంజసం? ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్లు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. సమయం, సందర్భం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల నేతలందరిపై ఉంది’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img