icon icon icon
icon icon icon

మళ్లీ మోసపోవద్దు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి మోసపూరిత హామీలు ఇస్తున్నారని, వాటిని నమ్మి మళ్లీ మోసపోవద్దని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రజలను కోరారు.

Updated : 24 Apr 2024 03:35 IST

రేవంత్‌రెడ్డి కపట హామీలను నమ్మొద్దు
మతం పేరుతో ఓట్లడిగే భాజపాను విశ్వసించొద్దు
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

ఈనాడు, వరంగల్‌ - రాజేంద్రనగర్‌, అలంపూర్‌, ఉండవల్లి, శివనగర్‌, బాలసముద్రం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి మోసపూరిత హామీలు ఇస్తున్నారని, వాటిని నమ్మి మళ్లీ మోసపోవద్దని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రజలను కోరారు. హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌కు బుద్ధి చెబుదామని అన్నారు. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నాయకులు చెప్పుకోవడానికి ఏమీలేక మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారని, అలాంటి పార్టీని నమ్మొద్దన్నారు. మంగళవారం చేవెళ్ల భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ నామినేషన్‌ సందర్భంగా రాజేంద్రనగర్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో సభ ఏర్పాటు చేశారు. బుద్వేల్‌ చౌరస్తా నుంచి అక్కడి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. వరంగల్‌లో వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల భారాస విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ చౌరస్తాలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో భారాస అలంపూర్‌ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాల్లో కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రజలకు అనేక హామీలిచ్చి నెరవేర్చకుండా మోసం చేశారు. రైతుల రుణమాఫీకి రూ.45 వేల కోట్ల నిధులు ఆగస్టు 15లోగా ఏవిధంగా తెస్తారు? ఆయన హామీలకు ప్రజలు రెండోసారి మోసపోవద్దు. నాడు కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయాం. కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ రూపంలో రూ.లక్ష ఇస్తే ఆ డబ్బుకు మరో తులం బంగారం కలిపి రేవంత్‌రెడ్డి ఇస్తామని చెప్పారు. ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? రెండోసారి మోసం చేసిన వ్యక్తిని నమ్మితే తప్పు ప్రజలదే అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భాజపాతో లోపాయికారీ ఒప్పందం ఉంది. అందుకే కేంద్రంలో రాహుల్‌ గాంధీ అసలు లిక్కర్‌ స్కాం జరగలేదంటే ఇక్కడ రేవంత్‌రెడ్డి జరిగిందని, కవితను జైల్లో వేయడం సరైన పని అని అంటారు.

పదేళ్లలో మోదీ ఏంచేశారు?

ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి ఏంచేశారని ఓటేయాలి?పదేళ్లలో ప్రజల ముక్కుపిండి రూ.30 లక్షల కోట్లు వసూలు చేసి అంబానీ, అదానీలకు పంచారు. రాష్ట్రంలో భాజపాను ఓడించే సత్తా భారాసకే ఉంది. తెలంగాణలో భారాస 12 లోక్‌సభ సీట్లు గెలిస్తే మళ్లీ రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్‌ శాసించగలరు.

అమ్మ లాంటి పార్టీని మోసం చేశారు

భారాసలో పదవులు అనుభవించిన మహేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి మనపై పోటీకి దిగుతున్నారు. అమ్మలాంటి పార్టీని మోసం చేశారు. వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత భారాస కార్యకర్తలపై ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కేసీఆర్‌ అన్ని పదవులు ఇచ్చారు. ఆయన కుమార్తె కావ్యకు టికెట్‌ ఇచ్చాక నమ్మకద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరడం దారుణం’’ అని కేటీఆర్‌ విమర్శించారు. వరంగల్‌, చేవెళ్ల, నాగర్‌కర్నూల్‌ భారాస అభ్యర్థులు సుధీర్‌కుమార్‌, కాసాని జ్ఞానేశ్వర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌లను గెలిపించాలని ఆయన కోరారు. రాజేంద్రనగర్‌ ర్యాలీలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దయానంద్‌ గుప్తా, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌, పైలెట్‌ రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు. అలంపూర్‌ సమావేశంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు విజయుడు, కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్‌ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా భారాస నేతలు పాల్గొన్నారు. అంతకుముందు కేటీఆర్‌ హనుమకొండ పార్టీ కార్యాలయంలో కేటీఆర్‌ క్రికెట్ ట్రోఫీని విజేతలకు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img