icon icon icon
icon icon icon

మోదీతోనే దేశాభివృద్ధి

దేశభవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల్లో మరోసారి భాజపాకు అధికారం ఇవ్వాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Updated : 24 Apr 2024 03:36 IST

మరోసారి భాజపాకు అధికారం ఇవ్వాలి
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌

భువనగిరి, న్యూస్‌టుడే: దేశభవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల్లో మరోసారి భాజపాకు అధికారం ఇవ్వాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ నామినేషన్‌ను పురస్కరించుకుని పట్టణంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వినాయకచౌరస్తాలో జరిగిన రోడ్‌షోలో జైశంకర్‌ ప్రసగించారు. మంచి ఎంపీ వస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందంటూ బూర నర్సయ్యగౌడ్‌ను గెలిపించాలని కోరారు. పదేళ్లకు పూర్వం దేశం పరిస్థితి ఏంటి.. మోదీ అధికార పగ్గాలు చేపట్టాక ఎలా ఉందనే విషయం ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం 5 కేజీల ఉచిత బియ్యం ఇస్తూ.. పేదల ఆకలిని తీర్చడంతో పాటు రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకుంటోందన్నారు. ప్రధాని మోదీ జి-20 దేశాల సదస్సులో ఆయా దేశాల ప్రతినిధులకు పోచంపల్లి పట్టుచీరలు, వస్త్రాలను బహుమతులుగా ఇచ్చి.. వాటికి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చారన్నారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేదన్నారు. ప్రజలు తమ ఓట్లతో కాంగ్రెస్‌ సర్కార్‌కు కర్రు కాల్చి వాతపెడతారని హెచ్చరించారు. శాసనసభాపక్ష నేత ఎ.మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటమి భయంతో సీఎం రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. భువనగిరి కోటపై కమలం జెండా ఎగరడం ఖాయమన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్‌ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం వీరంతా కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్‌ అధికారి హన్మంత్‌ కే జెండగేకు డాక్టర్‌ నర్సయ్యగౌడ్‌ నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img