icon icon icon
icon icon icon

ఉదయం పొలం బాట.. సాయంత్రం ప్రజలతో మాట

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టనున్న బస్సు యాత్రకు సర్వం సిద్ధమైంది.

Published : 24 Apr 2024 04:54 IST

కేసీఆర్‌ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
నేటి నుంచి 17 రోజుల పాటు రాష్ట్రవ్యాప్త పర్యటన
మే 10న సిద్దిపేటలో బహిరంగసభతో ముగింపు

ఈనాడు- హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టనున్న బస్సు యాత్రకు సర్వం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ యాత్ర కొనసాగించనున్న బస్సుకు తెలంగాణ భవన్‌లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం నుంచి 17 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రతి రోజు ‘ఉదయం పొలం బాట.. సాయంత్రం ప్రజలతో మాట’ ఉండేలా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఉదయం పర్యటనల్లో రైతులతో నేరుగా మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమవుతారు. సాయంత్రం కనీసం 2-3 ప్రాంతాల్లో రోడ్‌షోల్లో పాల్గొంటారు. కూడలి సభల్లో స్థానిక ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం భారాస నాయకులు, కార్యకర్తల ఇళ్లలోనే కేసీఆర్‌, ఇతర నాయకులు బస చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ పర్యటన కొనసాగేలా షెడ్యూల్‌ను రూపొందించారు. తొలిరోజు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు బస్సు యాత్ర తెలంగాణ భవన్‌ నుంచి మొదలై.. ఉప్పల్‌, ఎల్బీనగర్‌, చౌటుప్పల్‌, నకిరేకల్‌ క్రాస్‌ రోడ్డు, నల్గొండ, మాడుగులపల్లి మీదుగా మిర్యాలగూడ చేరుకుంటుంది. అక్కడ సాయంత్రం 5.30 గంటలకు రోడ్‌షోతో కేసీఆర్‌ ఎన్నికల పర్యటన ప్రారంభమవుతుంది. అనంతరం వేములపల్లి, మాడుగులపల్లి, తిప్పర్తి, నార్కట్‌పల్లి బైపాస్‌రోడ్డు, కేతేపల్లి మీదుగా సూర్యాపేటకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు సూర్యాపేట రోడ్‌షోలో ప్రసంగిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. పర్యటన చివరి రోజు కేసీఆర్‌ మే 10న సిరిసిల్లలో సాయంత్రం 5 గంటలకు రోడ్‌షోలో పాల్గొని, అదే రోజు సాయంత్రం  6.30 గంటలకు సిద్దిపేటలో బహిరంగసభకు హాజరై, తర్వాత హైదరాబాద్‌కు చేరుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img