icon icon icon
icon icon icon

మోదీ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆస్తులు లాక్కుంటారని.. తాళి బొట్లు గుంజుకుంటారని.. సంపదను ముస్లింలకు పంచుతారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు విచారకరమని, వాటిని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Published : 24 Apr 2024 04:55 IST

దేశంలో కులగణన భాజపాకు రుచించడం లేదు
మంత్రి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆస్తులు లాక్కుంటారని.. తాళి బొట్లు గుంజుకుంటారని.. సంపదను ముస్లింలకు పంచుతారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు విచారకరమని, వాటిని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం కరీంనగర్‌ డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన పాంచ్‌న్యాయ్‌లో భాగంగా చేపడతామన్న కులగణన భాజపాకు రుచించడం లేదు. ముస్లింలను ఉద్దేశించి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలను భాజపా వక్రీకరిస్తోంది. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలకు న్యాయం చేసింది. మోదీ ప్రభుత్వం దేశ జనాభాలో 85 శాతం ఉన్న హిందువులకు ఏమీ చేయలేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే 1.70 కోట్లు హిందువులకు వచ్చేవి. దళితులు, నిరుపేదలకు వ్యతిరేకంగా భాజపా విధానాలు ఉన్నాయి. ఆ పార్టీ నియంతృత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారు. తొలి దశ ఎన్నికల పోలింగ్‌తో మోదీ భయపడుతున్నారు. విశ్వగురువునంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్న మోదీకి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టి తీర్పు ఇస్తారు. భాజపా ఐపీఎల్‌ కూటమిలో మోదీ ఒక్కరే. మాకు ఇండియా కూటమి అనే పెద్ద టీం ఉంది. ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి చేశానని కరీంనగర్‌ ఎంపీ సంజయ్‌ చెప్పడం విడ్డూరంగా ఉంది. రాముడు అందరివాడు, దేవుని పేరుతో రాజకీయాలకు స్వస్తి పలకాలి’’ అని పొన్నం హితవు పలికారు. విలేకరుల సమావేశంలో మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్‌, సత్యనారాయణగౌడ్‌, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి నామినేషన్‌ వేసిన వెలిచాల రాజేందర్‌రావు పాల్గొన్నారు.


నేడు దిల్లీలో సామాజిక న్యాయ సమ్మేళనం

హాజరుకానున్న భట్టి, మధుయాస్కీగౌడ్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సమృద్ధ భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం దిల్లీలో జరగనున్న ‘సామాజిక న్యాయ సమ్మేళనం’లో తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ పాల్గొననున్నారు. ప్లీనరీ సెషన్‌లో కులగణనపై భట్టి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎంపవర్‌మెంట్‌పై మధుయాస్కీగౌడ్‌ ప్రసంగిస్తారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img