icon icon icon
icon icon icon

నాడు హామీ ఇచ్చినా దక్కని ఎంపీ టికెట్లు

అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు ఇవ్వలేక లోక్‌సభ అభ్యర్థులుగా అవకాశం ఇస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. హుస్నాబాద్‌ అసెంబ్లీ టికెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్‌లు పోటీ పడ్డారు.

Updated : 25 Apr 2024 06:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు ఇవ్వలేక లోక్‌సభ అభ్యర్థులుగా అవకాశం ఇస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. హుస్నాబాద్‌ అసెంబ్లీ టికెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్‌లు పోటీ పడ్డారు. గతంలో హుస్నాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రవీణ్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నించారు. అయితే పొన్నంకు కాంగ్రెస్‌ ఈ స్థానాన్ని కేటాయించింది. ఆ సమయంలో కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ఆ ప్రకారం ఈ ఎన్నికల్లో ప్రవీణ్‌రెడ్డికి ఎంపీ టికెట్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా మరికొందరు పట్టుబట్టినట్లు తెలిసింది. ఆయనతో పాటు వెలిచాల రాజేందర్‌రావు, తీన్మార్‌ మల్లన్న తదితరులు ఈ సీటు కోసం పోటీపడ్డారు. చివరకు ప్రవీణ్‌రెడ్డి, రాజేందర్‌రావు పోటీలో నిలవగా, ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా రఘురాంరెడ్డిని ఎంపిక చేయడంతో కరీంనగర్‌కు వెలిచాల వైపు కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గు చూపింది. సూర్యాపేట అసెంబ్లీ టికెట్‌ కోసం నాడు ఆర్‌.దామోదర్‌రెడ్డి, పటోళ్ల రమేశ్‌రెడ్డి పోటీ పడ్డారు. అధిష్ఠానం దామోదర్‌రెడ్డికి ఇచ్చింది. ఆ సమయంలో రమేశ్‌రెడ్డిని బుజ్జగించడానికి ప్రయత్నించిన కాంగ్రెస్‌ నాయకులు నల్గొండ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. ఎంపీ టికెట్‌ గురించి చర్చేలేదు. ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డికి కేటాయించారు. మొత్తంమీద అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వారికి లోక్‌సభ అభ్యర్థిత్వాలు దక్కలేదు. ఇలా హామీ ఇచ్చిన వారిలో సురేష్‌షెట్కార్‌కు జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img