icon icon icon
icon icon icon

పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా. పంద్రాగస్టు నాటికి ఏకకాలంలో రూ.2 లక్షల పంట రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.

Published : 25 Apr 2024 02:57 IST

ఉప ఎన్నికలోనూ పోటీ చేయను
హామీ నెరవేర్చకపోతే సీఎం రాజీనామా చేస్తారా?
అమరుల స్తూపం వద్ద ప్రమాణానికి సిద్ధమా?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌

సంగారెడ్డి టౌన్‌-న్యూస్‌టుడే, ఈటీవీ-ఖమ్మం: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా. పంద్రాగస్టు నాటికి ఏకకాలంలో రూ.2 లక్షల పంట రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఉప ఎన్నికలోనూ పోటీ చేయను. ఐదేళ్లవరకు ఎన్నికలకు దూరంగా ఉంటా. అమలు చేయకపోతే సీఎం రాజీనామా చేస్తారా? శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరుల స్తూపం వద్ద అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమా’’ అని సీఎంకు భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. బుధ]వారం సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో, ఖమ్మంలో భారాస విస్తృతస్థాయి సమావేశంలోనూ ఆయన మాట్లాడారు. ‘‘2018 ఎన్నికల్లో కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత మాటతప్పారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని నేను అడిగితే.. భారాసను రద్దు చేసుకుంటారా అని తొండి మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉంటుంది. అమలు చేయించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా భారాసపై ఉంటుంది.  

కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోతోందని దేవుళ్లపై ప్రమాణం

నాలుగున్నర నెలల కాంగ్రెస్‌ పాలన.. తిట్లు, దేవుడిపై ఒట్లకే సరిపోయింది. గ్యారంటీలు అమలు కాకపోవడంతో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోతోందని ముఖ్యమంత్రి ఆపద మొక్కులు మొక్కుతున్నారు. 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని సోనియా గాంధీ స్వయంగా తెలంగాణ ప్రజలకు లేఖ రాశారు. 120 రోజులైనా వాటి ఊసే లేదు. డిసెంబరు 9న రూ.2 లక్షల పంటరుణాలను మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిన మాటను ఆయన నిలబెట్టుకోలేదు. ఆరు గ్యారంటీలు, 13 హామీల అమలుకు చట్టబద్ధతకు కల్పిస్తూ తొలి సంతకం చేస్తామన్న మాట ఏమైంది? ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామని చెబుతున్న ముఖ్యమంత్రి.. అవి ఏవో చెప్పాలి.  ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజలను నిత్యం కలుస్తానని రేవంత్‌ చెప్పారు. దాన్నీ అటకెక్కించారు.  ఎంతమంది దేవుళ్లపై ఒట్లు పెట్టినా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పటం ఖాయం. భారాస నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన రంజిత్‌రెడ్డి, కడియం కావ్య, దానం నాగేందర్‌లు ఎన్నికల్లో మూడో స్థానంలో నిలుస్తారు’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో ఎంపీ అభ్యర్థులు గాలి అనిల్‌కుమార్‌(జహీరాబాద్‌), నామా నాగేశ్వరరావు(ఖమ్మం), రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మెదక్‌ జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img