icon icon icon
icon icon icon

పేదల కష్టార్జితంపై కాంగ్రెస్‌ కన్ను

 ‘కాంగ్రెస్‌ కుటుంబ రాజకీయాలు చేస్తోంది. పేదల కష్టార్జితంపై కన్నేసింది. వారు ఎంతో కష్టపడి సంపాదించిన సొత్తును ఆ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న వారికి పంచాలని చూస్తోంది’ అని కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ అన్నారు.

Published : 25 Apr 2024 03:00 IST

దాన్ని ఆ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్న వారికి పంచాలని చూస్తోంది
హైదరాబాద్‌లో ‘పతంగ్‌’ దారం తెంచాలని నిర్ణయించుకున్న ప్రజలు
కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌

ఈనాడు, హైదరాబాద్‌; చార్మినార్‌, న్యూస్‌టుడే:  ‘కాంగ్రెస్‌ కుటుంబ రాజకీయాలు చేస్తోంది. పేదల కష్టార్జితంపై కన్నేసింది. వారు ఎంతో కష్టపడి సంపాదించిన సొత్తును ఆ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న వారికి పంచాలని చూస్తోంది’ అని కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ అన్నారు. రాహుల్‌గాంధీ దేశంలో మొహబత్‌ దుకాణాలు తెరిచామని చెబుతూ.. ఆ దుకాణాల్లో విద్వేష సామాన్లు(నఫ్రత్‌) పంచుతున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి కొంపెల్ల మాధవీలతతో కలిసి చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు. ఆమె నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుల్జార్‌హౌజ్‌ వద్ద ర్యాలీలోనూ మాట్లాడారు. ‘‘దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. చాలా దేశాల్లో యుద్ధాలు జరుగుతుంటే దేశంలో అణు వ్యవస్థను తీసేయాలనేది కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆలోచన. రాహుల్‌గాంధీ, ఒవైసీ ఇద్దరు కూడా ఔరంగజేబు స్కూలు నుంచి వచ్చారు. రాహుల్‌గాంధీ ఒవైసీకి బీ టీమ్‌. హైదరాబాద్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి ఒవైసీ ప్రభావం ఎక్కడా లేదు. భాజపా అభ్యర్థి మాధవీలత పేరే అంతటా వినిపిస్తోంది. పతంగ్‌(ఎంఐఎం ఎన్నికల గుర్తు దారం తెంచాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అమేఠీలో రాహుల్‌గాంధీని ఓ మహిళ ఓడించారు. హైదరాబాద్‌లో ఒవైసీని మాధవీలత ఓడించబోతున్నారు. వయనాడ్‌లో పీఎఫ్‌ఐ సహకారం తీసుకుని ఎన్నికల్లో గెలవాలని రాహుల్‌ కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌.. కార్పొరేటర్‌ కూతురుకే న్యాయం చేయకపోతే దేశంలో ఎవరికి న్యాయం చేస్తుంది’’ అని ఠాకూర్‌ నిలదీశారు. దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత నిర్దోషి అయితే ఆమెకు బెయిల్‌ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇక్కడ దోచుకోవడంతో పాటు దిల్లీలో దోచుకోవడానికి వెళ్లి స్కామ్‌లో చిక్కుకున్నారని అన్నారు. పాతబస్తీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని మాధవీలత అన్నారు. చార్మినార్‌ నుంచి ర్యాలీగా వెళ్లి హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి అనుదీప్‌ దురిశెట్టికి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.


కాంగ్రెస్‌వే మతతత్వ రాజకీయాలు

-లక్ష్మణ్‌

కాంగ్రెస్‌ పార్టీనే మతతత్వ రాజకీయాలు చేస్తోందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. గతంలో కాంగ్రెస్‌.. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్‌లు కల్పించిందని అది ఓటు బ్యాంకు రాజకీయం కాదా అని ప్రశ్నించారు. బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓట్ల కోసం రాజకీయాలు చేసే వారిని ఓడించాలని ప్రధాని మోదీ మాట్లాడిన అంశాలను రాజకీయం చేస్తున్నారని అన్నారు. ముస్లింలకు ఎస్సీ జాబితాలో రిజర్వేషన్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ కోరుతోందన్నారు. భారాస పని అయిపోయిందని, అలాగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కూ తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img