icon icon icon
icon icon icon

కేసీఆర్‌ వల్లే మేడిగడ్డ నాశనమైంది

కేసీఆర్‌ వల్లనే మేడిగడ్డ నాశనమైందని, భారాస పాలనలో కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 

Updated : 25 Apr 2024 06:07 IST

29 మంది భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నారు
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కరెంటు, సాగునీటి ప్రాజెక్టులపై మీడియాకు ప్రజంటేషన్‌


కేసీఆర్‌ అసమర్థత, అవగాహనలేమి, కమీషన్ల కక్కుర్తి, మితిమీరిన జోక్యం వల్లనే తెలంగాణకు మేడిగడ్డ గుదిబండలా మారింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డలో నీరు నిల్వ ఉంటే ప్రమాదకరం అని చెప్పగా కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే నీరు కిందకు వదిలేశారు.

-మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


ఈనాడు, హైదరాబాద్‌: కేసీఆర్‌ వల్లనే మేడిగడ్డ నాశనమైందని, భారాస పాలనలో కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నీటివాటాను కాపాడలేని అసమర్థుడు కేసీఆర్‌ అని ఆయన ధ్వజమెత్తారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం ఇక్కడ సెంట్రల్‌కోర్టు హోటల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాగునీటి రంగం, ధాన్యం కొనుగోళ్లపై ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ‘‘కేసీఆర్‌ సీఎంగా, నీటిపారుదల శాఖ మంత్రిగా  కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు ఆయన హయాంలోనే కూలిపోయింది. దానిని ఆయనే ఇప్పుడు రిపేర్‌ చేస్తానని చెప్పడం జోక్‌లా ఉంది. మేడిగడ్డ పూర్తికావాలంటే రూ.లక్షా 50 వేల కోట్లు అవుతుంది. కనీస జ్ఞానం లేకుండా ఎంత ఖర్చయినా నీరు తెస్తున్నామని ఆయన అంటున్నారు. 30 లక్షల నుంచి 40 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నుంచి నీరిచ్చామని కేసీఆర్‌ దిగజారిపోయి పచ్చి అబద్ధాలు చెపుతున్నారు. కేవలం లక్షా 30 వేల ఎకరాలకు నీరు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా రూ.10 వేల కోట్ల కరెంటు బిల్లు వస్తుంది. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌ ప్రాణహిత-చేవెళ్ల నీటి నిల్వ సామర్థ్యం 14 టీఎంసీలే అని అబద్ధాలు చెపుతున్నారు. పైసల కక్కుర్తి వల్లనే దానిని రీడిజైన్‌ చేసి కాళేశ్వరం కట్టారు. రీడిజైన్‌తో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు సాగించిన దోపిడీ వల్ల ఆ రుణభారం తెలంగాణ ప్రజలపై పడబోతోంది. వారి అవినీతి సామ్రాజ్యంలో కాంట్రాక్టర్లతో కలిసి ఏం చేశారో ఇప్పుడు ప్రజల ముందుంది.

డిపాజిట్లు కోల్పోనున్న భారాస

విద్యుత్‌, సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్లపై భారాస నేతలు పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నారు.  ఈ ఎన్నికల్లో 14 నుంచి 15 స్థానాల్లో భారాస డిపాజిట్లు కోల్పోతుంది. ఈ ఎన్నికల తరవాత భారాస మనుగడ ప్రశ్నార్థకమే. 29 మంది భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్‌ అవాస్తవాలను మాట్లాడుతున్నారు. ప్రతి గింజా మద్దతు ధరకు కొంటామని రైతుకు సంపూర్ణ హామీ ఇస్తున్నాం. వారం రోజుల్లో మేడిగడ్డపై నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఇస్తుంది. అందులో ఏం చేయమని ఉంటే అదే చేస్తాం. కేసీఆర్‌ మైండ్‌ ఆగమాగమై కరెంటు కోతలున్నట్లు ఊహించుకుంటున్నారు’’ అని ఉత్తమ్‌ అన్నారు.  


ప్రగతిభవన్‌ ప్యాలెస్‌ చూసి ఆశ్చర్యపోయా

-కోమటిరెడ్డి

‘‘ఇటీవల నేను వెళ్లి ప్రగతిభవన్‌ను చూశా. అంత ప్యాలెస్‌ చూసి ఆశ్చర్యపోయా. అందుకే.. అంత పెద్ద భవంతిలో ఉండి.. చిన్న ఇంట్లోకి వెళ్లడంతో కేసీఆర్‌ మతిపోయినట్లు మాట్లాడుతున్నారు’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. సుశీ అనే పేరుతో ఉన్న కంపెనీ తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డిదని, దానితో తనకు సంబంధం లేదని, తాను ఏ వ్యాపారంలో లేనని చెప్పారు. ఈ కంపెనీ పేరుతో తాను పనులు చేశానని కేసీఆర్‌ అనడం సరికాదన్నారు. మద్యం కుంభకోణంతో మాజీ సీఎం బిడ్డ కవిత.. దేశ ప్రజల ముందు తెలంగాణ పరువు తీసేశారని అన్నారు. ఏపీలో జగన్‌ గెలుస్తారని కేసీఆర్‌ అంటున్నారని, అక్కడ ఆయన గెలిస్తే మళ్లీ ఏమైనా పైసలు ఇస్తారని చూస్తున్నారని ఆరోపించారు.

నిబంధనలకు విరుద్ధంగా ఫోన్‌ ట్యాపింగ్‌ ఎవరు చేసినా అది ఇల్లీగల్‌. పదేళ్ల జైలుశిక్ష పడుతుంది. భారాస పాలనలో పోలీస్‌ అధికారులైన ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులాంటి వారికి చాటుగా మా (రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి) ఫోన్లు వినాల్సిన అవసరం ఏముంటుంది? ట్యాపింగ్‌తో నాకేం సంబంధం అని కేసీఆర్‌ అంటున్నారు... ఆయన చెప్పకపోతే ప్రభాకర్‌రావు ఎందుకు ఆ పని చేస్తారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img