icon icon icon
icon icon icon

జైళ్లకు కేసీఆర్‌ భయపడడు.. మళ్లీ మన రాజ్యమే.. ఎవరూ ఆపలేరు

‘1956 నుంచి ఈనాటి వరకు తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే శత్రువు. ఇక్కడి ప్రజలు వద్దంటున్నా ఏపీలో కలిపి 58 ఏళ్లు గోస పెట్టారు. ఇప్పుడు అడ్డగోలు హామీలతో మోసం చేసి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది.

Published : 25 Apr 2024 03:07 IST

తెలంగాణకు శత్రువే కాంగ్రెస్‌ భారాస గెలిస్తేనే ప్రజలకు న్యాయం
ప్రభుత్వ చేతగానితనం వల్లే సాగర్‌ ఆయకట్టుకు దుస్థితి
బస్సుయాత్రలో కేసీఆర్‌ తొలిరోజు మిర్యాలగూడ, సూర్యాపేటల్లో ప్రచారం

తెలంగాణ కోసం 14 ఏళ్లు పోరాటం చేశాను. స్వరాష్ట్రంలో పదేళ్లు సీఎంగా పనిచేసిన నాపై ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఉపయోగిస్తున్న భాష తెలంగాణ జాతి గౌరవాన్ని పెంచుతుందా? ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, ప్రజలకు పంచాయితీ పడింది. ఇది పరిష్కారం కావాలంటే కేసీఆరే పంచాయితీ పెద్దగా ఉండాలి’’

భారాస అధినేత కేసీఆర్‌

ఈనాడు, నల్గొండ: ‘1956 నుంచి ఈనాటి వరకు తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే శత్రువు. ఇక్కడి ప్రజలు వద్దంటున్నా ఏపీలో కలిపి 58 ఏళ్లు గోస పెట్టారు. ఇప్పుడు అడ్డగోలు హామీలతో మోసం చేసి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. మళ్లీ మన రాజ్యమే వస్తుంది. దీన్ని ఎవరూ ఆపలేరు. బంగారు తెలంగాణగా చేసేవరకు విశ్రమించేది లేదు’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వం, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మంత్రుల అసమర్థత వల్ల సాగర్‌ ప్రాజెక్టుకు దుస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ ‘పోరుబాట బస్సుయాత్ర’ను నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ, సూర్యాపేటల్లో ఏర్పాటు చేసిన రోడ్‌షోలు, కూడలి సభల్లో మాట్లాడారు. కేసీఆర్‌ను జైలుకు పంపిస్తానని, ఆయన ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని.. కేసీఆర్‌ జైళ్లకు భయపడబోడని స్పష్టం చేశారు. అలా భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు.

తెలంగాణ బతుకే నీళ్లమీద పోరాటం  

‘సరిగ్గా 21 ఏళ్ల క్రితం నీళ్లు, నిధులు, కరెంటు కోసం కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశాను. తెలంగాణ వచ్చే వరకు సాగర్‌ కెనాల్‌ కింద నీళ్లు ఇవ్వలేదు. ఆనాటి నుంచి తెలంగాణ బతుకే నీళ్ల మీద పోరాటం. పదేళ్ల భారాస పాలనలో 18 పంటలకు నీళ్లిచ్చాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతోంది? నాలుగైదు నెలల క్రితం ధీమాగా ఉన్న రైతు ప్రస్తుతం దిగాలు పడ్డాడు. నీటిపారుదల మంత్రి ఇక్కడే ఉన్నా.. చేతగాక నాగార్జునసాగర్‌ను కేఆర్‌ఎంబీకి అప్పజెప్పారు. ప్రాజెక్టులో నీళ్లున్నా రైతుల పంటలను ప్రభుత్వం ఎండబెట్టింది. తెలంగాణ వచ్చాక పంటలు ఎండిపోవడం ఇదే ప్రథమం. కృష్ణాలో నీళ్లు లేకున్నా.. మూసీ నుంచి ఉదయసముద్రం మీదుగా పెద్ద దేవులపల్లి చెరువులో నీళ్లు నింపి తద్వారా ఎడమ కాల్వకు నీళ్లిచ్చే ప్రయత్నం మేం చేశాం. రెండు దఫాలుగా భారాస ప్రభుత్వం రైతులకు రూ.30 వేల కోట్ల రుణమాఫీ చేసింది. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట తప్పారు. రైతుబంధును దగా చేశారు. కరెంటు మాయమైంది. మిగులు కరెంటు ఉన్నా ఎందుకు సరిగ్గా ఇవ్వడం లేదు? కాంగ్రెస్‌ ఎన్నికల హామీగా కల్యాణలక్ష్మిలో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఏమైంది.? మహాలక్ష్ములు, నిరుద్యోగులను మోసం చేశారు. కేసీఆర్‌ వైదొలిగాక నాలుగైదు నెలలకే మంచినీళ్లు మాయమయ్యాయి. ఇరవై రోజులైనా రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదు? ప్రధాని మోదీ ధాన్యం కొనను అంటే నేను, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దిల్లీలో ధర్నా చేశాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యాన్ని కొనిపించాం.

కాళేశ్వరంతో 2.5 లక్షల ఎకరాలకు సాగునీళ్లు

కాళేశ్వరం ప్రాజెక్టుతో కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లోని 2.5 లక్షల ఎకరాలకు సాగునీళ్లిచ్చాం. సూర్యాపేటను జిల్లా కేంద్రం చేశాం. వైద్యకళాశాలతో పాటు సద్దుల చెరువును అందంగా మార్చాం. కోదాడ, సూర్యాపేటల్లో ఎడారుల్లా మారిన చెరువులను కాళేశ్వరం జలాలతో నింపాం. సూర్యాపేట ప్రజలకు 30 ఏళ్ల పాటు మూసీ మురికినీళ్లు తాగించింది కాంగ్రెస్‌. ప్రజలు స్వచ్ఛమైన కృష్ణా జలాలను తాగేలా భారాస మిషన్‌ భగీరథ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 225 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు’ అని  కేసీఆర్‌ తెలిపారు.\

ఊరూరా ఘనస్వాగతం

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సులో బుధవారం మధ్యాహ్నం మిర్యాలగూడకు బయల్దేరిన కేసీఆర్‌కు ఊరూరా ఘనస్వాగతం లభించింది. చౌటుప్పల్‌, చిట్యాల, నార్కట్‌పల్లి క్రాస్‌రోడ్‌, నల్గొండ బైపాస్‌, తిప్పర్తి మీదుగా సాయంత్రానికి మిర్యాలగూడ చేరుకున్నారు. నల్గొండ సమీపంలోని అర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మాడ్గులపల్లి సమీపంలోని ఒక హోటల్‌లో కొద్దిసేపు ఆగి నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడారు. అక్కడి నుంచి బయల్దేరే సమయంలో కేసీఆర్‌ కాన్వాయ్‌లోని పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎవరికీ ప్రమాదం లేకపోవడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. మిర్యాలగూడ రోడ్‌షోలో ప్రసంగించాక.. కేసీఆర్‌ సూర్యాపేటకు బయల్దేరారు. దారిలో తిప్పర్తి మండలం సిలారుమియాగూడెం వద్ద ప్రజల అభ్యర్థన మేరకు కాసేపు ఆగి ప్రసంగించారు. నకిరేకల్‌, కేతేపల్లిలో ప్రజలు కేసీఆర్‌ బస్సు యాత్రకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన సూర్యాపేటకు చేరుకొని పట్టణంలో భారీ ర్యాలీతో రోడ్‌షోలో ప్రసంగించి ఇక్కడే బస చేశారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్గొండ లోక్‌సభ భారాస అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, భూపాల్‌రెడ్డి, భగత్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలంగాణ భవన్‌లో జేజేలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌ నుంచి కేసీఆర్‌ యాత్ర చేపట్టిన బస్సు బుధవారం మధ్యాహ్నం బయలుదేరింది. కేసీఆర్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు జేజేలు పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. భవన్‌ ప్రాంగణంలోని తెలంగాణ తల్లికి కేసీఆర్‌ పూలమాల వేశారు. నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ కేసీఆర్‌ బస్సు యాత్రను ప్రారంభించారు. తెలంగాణ భవన్‌ వెనుక గేటు (జగన్నాథస్వామి ఆలయం వైపు) నుంచి బస్సు మిర్యాలగూడకు బయలుదేరింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పద్మారావుగౌడ్‌, కంటోన్మెంట్‌ అసెంబ్లీ భారాస అభ్యర్థి నివేదిత, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌ జోగినపల్లి తదితరులు పాల్గొన్నారు.


60, 70 టీఎంసీలు సముద్రంపాలు

-కేసీఆర్‌

‘కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటో రెండో పిల్లర్లు కుంగితే బ్రహ్మాండం బద్దలైనట్లు మాట్లాడుతున్నారు. దీన్ని భూతద్దంలో చూపి 60, 70 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారు. టెయిల్‌పాండ్‌ నుంచి ఏపీ 5 టీఎంసీల నీటిని తీసుకుపోతుంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎక్కడ పడుకున్నారు? ఈ ప్రభుత్వం చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకుండా మోసం చేస్తోంది. 1100 గురుకులాలను ఏర్పాటు చేస్తే అందులో తిండి సరిగా లేక 135 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నలుగురు చనిపోయారు. ఈ విషయంపై ప్రభుత్వానికి పట్టింపులేదు. భారాస బలంగా ఉంటేనే ప్రభుత్వం మెడలు వంచి.. హామీలను అమలు చేసేలా కొట్లాడగలం. లోక్‌సభ ఎన్నికల్లో భారాసను 10 నుంచి 12 స్థానాల్లో గెలిపిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. సూర్యాపేటలో భారాసకు 50 వేల మెజార్టీ రావాలి. ఇక్కడి ఓట్లతోనే కంచర్ల కృష్ణారెడ్డి ఎంపీగా గెలవాలి’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img