icon icon icon
icon icon icon

పొంగులేటి వియ్యంకుడికే ఖమ్మం టికెట్‌

కాంగ్రెస్‌ అధిష్ఠానం పెండింగ్‌లో ఉన్న మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఎట్టకేలకు ఖరారు చేసింది. ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా పాతతరం కాంగ్రెస్‌ నాయకుడు రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడైన రఘురాంరెడ్డిని ఖరారు చేసింది.

Updated : 25 Apr 2024 06:56 IST

రఘురాంరెడ్డి వైపు కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గు
కరీంనగర్‌కు వెలిచాల రాజేందర్‌రావు
హైదరాబాద్‌కు మహ్మద్‌ వలీవుల్లా సమీర్‌
ఈనాడు- హైదరాబాద్‌, ఈటీవీ- ఖమ్మం

కాంగ్రెస్‌ అధిష్ఠానం పెండింగ్‌లో ఉన్న మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఎట్టకేలకు ఖరారు చేసింది. ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా పాతతరం కాంగ్రెస్‌ నాయకుడు రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడైన రఘురాంరెడ్డిని ఖరారు చేసింది. కరీంనగర్‌ టికెట్‌ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కుమారుడు రాజేందర్‌రావుకు దక్కింది. హైదరాబాద్‌ సీటుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ వలీవుల్లా సమీర్‌ పేరును ఖరారు చేశారు. ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి ఎంపికపై ముఖ్యనాయకుల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ మూడు స్థానాలకు అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. నామినేషన్ల దాఖలుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు సమయం ఉండగా.. బుధవారం రాత్రి వారి పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి విషయమై గత కొన్ని రోజులుగా చర్చల మీద చర్చలు జరిగాయి. చివరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీలను బెంగళూరుకు పిలిపించి మాట్లాడారు. మొదట భట్టి, పొంగులేటితో వేర్వేరుగా, తర్వాత ఇద్దరితో కలిపి చర్చించారు. సోమవారం రాత్రికే అభ్యర్థుల జాబితా వెలువడవచ్చని భావించినా.. తేల్చుకోలేక మళ్లీ పెండింగ్‌లో పెట్టారు. అధికారికంగా ప్రకటించక ముందే కరీంనగర్‌ నుంచి వెలిచాల రాజేందర్‌రావు నామినేషన్‌ దాఖలు చేయగా, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఇతర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంగళవారం రఘురాంరెడ్డి తరఫున స్థానిక నాయకులు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటించినందున గురువారం ఆయన నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిసింది.

ఖమ్మం సీటుకు తీవ్ర పోటీ

ఖమ్మం లోక్‌సభ స్థానానికి మొదటి నుంచీ ముఖ్యనాయకుల మధ్య పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్‌ అధిష్ఠానానికి జటిలమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు సెగ్మెంట్లనూ కాంగ్రెస్‌ గెల్చుకున్నా.. లోక్‌సభ అభ్యర్థి ఎంపికలో తీవ్ర జాప్యం తప్పలేదు. భట్టి విక్రమార్క తన భార్య నందినికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాదరెడ్డికి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగంధర్‌కు టికెట్‌ ఇవ్వాలని కోరారు. దీనిపై స్క్రీనింగ్‌ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీల్లో పలు దఫాలు చర్చలు జరిగిన తర్వాత.. మంత్రుల కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి అధిష్ఠానం అంగీకరించలేదు. కానీ తాను కాంగ్రెస్‌లో చేరినప్పుడు ఎంపీ టికెట్‌ గురించి హామీ ఇచ్చారని పొంగులేటి పట్టుబట్టడంతో.. ఆయన సోదరుడికి బదులు రఘురాంరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు తెరపైకి రావడం.. దాదాపు ఖరారైందనే ప్రచారం జరిగింది. భట్టి విక్రమార్క మరో అభ్యర్థి పేరును కూడా సూచించారు. వీటన్నిటిపై దీపా దాస్‌మున్షీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తదితరుల వద్ద కూడా పంచాయితీ జరిగింది. చివరకు రఘురాంరెడ్డి పేరును ప్రకటించారు.

ఖమ్మంతో కరీంనగర్‌కు ముడి..

అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్‌ నుంచి పోటీకి టికెట్‌ ఇవ్వలేకపోవడంతో కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి అవకాశం ఇస్తామని మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఎంపీ టికెట్‌ కోసం ఈయనతోపాటు వెలిచాల రాజేందర్‌రావు తదితరులు పోటీపడ్డారు. ఖమ్మం స్థానాన్ని మండవ వెంకటేశ్వరరావుకు ఇచ్చి.. కరీంనగర్‌ నుంచి ప్రవీణ్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలనుకున్నారు. కానీ ఖమ్మం అభ్యర్థి మారడంతో కరీంనగర్‌ నుంచి రాజేందర్‌రావుకు అవకాశం దక్కింది.

తండ్రి వారసుడిగా కాంగ్రెస్‌లో రఘురాంరెడ్డి

కాంగ్రెస్‌ రాజకీయ దిగ్గజం రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డి. వీరి స్వస్థలం ఖమ్మం జిల్లా పాలేరు నియోజవర్గంలోని కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామం. సురేందర్‌రెడ్డి గతంలో మహబూబాబాద్‌, వరంగల్‌ లోక్‌సభ స్థానాల నుంచి ఎంపీగా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని డోర్నకల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాలుగుసార్లు ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రఘురాంరెడ్డి 1985 నుంచి కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. డోర్నకల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా, వరంగల్‌ లోక్‌సభ స్థానం ఇన్‌ఛార్జిగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ వైస్‌ ఛైర్మన్‌గా, హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. రఘురాంరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకులు. రఘురాంరెడ్డి చిన్న కుమారుడు అర్జున్‌రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డితో వివాహమైంది.

మూడు తరాలుగా రాజకీయాల్లో వెలిచాల కుటుంబం

వెలిచాల రాజేందర్‌రావు తండ్రి, తాత రాజకీయాల్లో పనిచేశారు. ఈయన తాత వెలిచాల కేశవరావు స్వాతంత్య్ర సమరయోధుడు, కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉండేవారు. రాజేందర్‌రావు తండ్రి జగపతిరావు కరీంనగర్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజేందర్‌రావు సింగిల్‌ విండో ఛైర్మన్‌గా, కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్రంలో యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2001 నుంచి 2004 వరకు తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2004లో చొప్పదండి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి.. 30 వేల ఓట్లు పొందారు. 2007 నుంచి 2009 వరకు ప్రజారాజ్యం పార్టీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో ఆ పార్టీ తరఫున కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. పోచంపాడు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమెటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టరుగా ఉన్న రాజేందర్‌రావు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌లో చేరారు.


ఆరేళ్లుగా కాంగ్రెస్‌కు సమీర్‌ సేవలు

హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి మహ్మద్‌ వలీవుల్లా సమీర్‌ తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. టోలీచౌకీలో నివసిస్తున్న సమీర్‌ స్థిరాస్తి వ్యాపారిగా, ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంటర్‌ వరకు చదువుకున్నారు. మీడియా రంగంపై ఆసక్తితో ఇండియన్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌ (ఐఎన్‌ఎన్‌)ను స్థాపించారు. అనంతరం ఐఎన్‌ఎన్‌ ఛానెల్‌ను ప్రారంభించారు. ఆరేళ్ల క్రితం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం హైదరాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ విభాగం ఛైర్మన్‌గా నియమితులయ్యారు. కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img