icon icon icon
icon icon icon

కాళేశ్వరంపై చర్చిద్దాం.. రండి

‘‘కాళేశ్వరానికి పోదాం. అక్కడే కూర్చుందాం. నిపుణులను పిలిపిద్దాం. తెలంగాణ సమాజం వస్తుంది. మీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయతీ ఉంటే కాళేశ్వరం వద్దే చర్చ పెడదాం.

Published : 25 Apr 2024 03:17 IST

ప్రాజెక్టు వద్దకు రావాలని కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌
పంద్రాగస్టులోపే రుణమాఫీ చేస్తామని వెల్లడి
హరీశ్‌రావు రాజీనామా పత్రం సిద్ధంగా పెట్టుకోవాలి
మతచిచ్చు రేపడమే భాజపా లక్ష్యం
వరంగల్‌ సభ, సికింద్రాబాద్‌ రోడ్‌షోల్లో సీఎం

కేసీఆర్‌, హరీశ్‌రావులకు అధికార మత్తు ఇంకా దిగిందో లేదో తెలియదు. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్‌.. ప్రభుత్వం మారాక అసెంబ్లీకి రాలేదు. సమస్యలపై మాట్లాడలేదు. ప్రభుత్వానికి సలహాలూ ఇవ్వలేదు. తన మెదడును రంగరించి, రక్తాన్ని ధారపోసి కాళేశ్వరం కట్టారట. అలా కట్టారో లేదో.. ఇలా కూలిపోయింది. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు నాగార్జునసాగర్‌ కట్టించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం, శ్రీరామసాగర్‌, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, జూరాల, దేవాదుల లాంటి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కట్టాం. మీరు కట్టినవి, మేం కట్టినవి.. ఒక్కసారి చూసొద్దాం రండి.

సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు-వరంగల్‌, హైదరాబాద్‌, మడికొండ, రెజిమెంటల్‌ బజార్‌ - న్యూస్‌టుడే: ‘‘కాళేశ్వరానికి పోదాం. అక్కడే కూర్చుందాం. నిపుణులను పిలిపిద్దాం. తెలంగాణ సమాజం వస్తుంది. మీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయతీ ఉంటే కాళేశ్వరం వద్దే చర్చ పెడదాం. మీరు కట్టిన అద్భుతమేందో, అది తెలంగాణకు ఎలా ఉపయోగపడుతుందో వివరించండి’’ అని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారాస అధినేత కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. బుధవారం హనుమకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర సభలో, సికింద్రాబాద్‌ ప్యాట్నీ సెంటర్‌లో కార్నర్‌ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ‘‘రామప్ప శివుడు, సమ్మక్క సారలమ్మ, భద్రకాళీ అమ్మవారి సాక్షిగా చెబుతున్నా. పంద్రాగస్టులోపు నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తా. అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పిస్తానని హరీశ్‌ సవాల్‌ విసిరారు. ఆయన తన జేబులో రాజీనామా పత్రం సిద్ధంగా పెట్టుకోవాలి.

మోదీ, కేసీఆర్‌లు.. నాణేనికి బొమ్మాబొరుసులు

మోదీ, కేసీఆర్‌ నాణేనికి బొమ్మాబొరుసు లాంటివారు. ఇద్దరూ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారు. రాష్ట్రానికి సోనియా గాంధీ ఇచ్చిన విభజన హామీలేవీ మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు.  బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపించక ఈ ప్రాంతానికి మోదీ ద్రోహం చేశారు. కాజీపేటలో పెట్టాల్సిన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని మహారాష్ట్రలోని లాతూర్‌కు తరలించుకుపోయారు. ట్రిపుల్‌ఐటీ, ఐటీఐఆర్‌ ఇవ్వలేదు. నాడు మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పారు. పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలివ్వాలి. పార్లమెంటులో నేనడిగిన ప్రశ్నకు 7,21,680 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని సమాధానం చెప్పారు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు బుద్ధిచెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి బుద్ధిచెప్పాలి. ఈ ఎన్నికల్లో భారాసకు ఎక్కడా డిపాజిట్ కూడా రాదు.

మతం పేరుతో భాజపా విద్వేషాలు

భాజపాకు మతపిచ్చి పట్టుకుంది. దేశంలో అన్ని మతాలవారు కలిసిమెలిసి జీవిస్తుంటే.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వాళ్ల ఆస్తులు వీళ్లకిస్తుందని, ఒకరి రిజర్వేషన్లు తగ్గించి ఇంకొకరికి ఇస్తుందని దుష్ప్రచారం చేస్తూ మతచిచ్చు రేపడమే భాజపా నాయకుల లక్ష్యం. అందరూ కలిసిఉండటం మోదీకి ఇష్టం లేదు. గ్రామాల్లో పీర్ల పండగను ముస్లిం సోదరులతో కలిసి జరుపుకొంటాం. క్రిస్మస్‌ నాడు చర్చిలకు వెళ్తాం. ఇందుకు విరుద్ధంగా భాజపా నాయకులు ఓట్ల కోసం గోడలపైకి శ్రీరాముడిని తెచ్చారు. శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి వాళ్లే చేశారా? మనం చేయలేదా? మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపాను ఓడించాలి.

కిషన్‌రెడ్డి ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా?

తెలంగాణ ఏర్పడకముందు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పదేళ్లలో హైదరాబాద్‌కు ఐటీ, ఫార్మా పరిశ్రమలు, అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చాయి. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఓఆర్‌ఆర్‌, మెట్రోరైలు తీసుకొచ్చారు. రాజధానికి కృష్ణా, గోదావరి జలాలను తెచ్చారు. ఐదేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి రాష్ట్రానికి చేసింది శూన్యం. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో వరదలొచ్చినప్పుడు అప్పట్లో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకురాలేదు. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా? ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు వస్తున్నవారిని గుజరాత్‌లో ఏర్పాటు చేయండంటూ కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తే అడ్డుకోలేదు. రైల్వేలను ప్రైవేటుపరం చేస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు? రైతుల భూములు ఆక్రమించిన అరూరి రమేశ్‌కి భాజపా వరంగల్‌ టికెటిచ్చింది. కడియం శ్రీహరి కాంగ్రెస్‌ టికెట్‌ అడగలేదు. నిజాయతీ ఉన్నవారు ప్రభుత్వం వెంట ఉండాలని.. ఆయన వద్దకు నేనే పార్టీ పెద్దలను పంపించి టికెట్‌ ఇస్తామని ప్రతిపాదించా. వరంగల్‌ను అన్నిరకాలుగా అభివృధ్ధి చేస్తా. అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకొస్తా.


సికింద్రాబాద్‌లో ఏ పార్టీ వారు గెలిస్తే వారిదే కేంద్రంలో అధికారం

సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఏ పార్టీవారు గెలిస్తే.. ఆ పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్‌ ఉంది. బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ల విషయంలో ఇదే జరిగింది. దానం నాగేందర్‌ను గెలిపిస్తే కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది. రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారు. దానంను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే పార్టీ అగ్రనేతలను ఒప్పించి కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించేందుకు కృషి చేస్తాను. ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ కోసం భాజపాతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకే పద్మారావుగౌడ్‌కు టికెట్‌ కేటాయించారు. పీజీఆర్‌, దానం నాగేందర్‌లా పద్మారావు మంచివారు. కానీ, కేసీఆర్‌ను నమ్ముకుంటే నట్టేట మునుగుతారు. పద్మారావు నామినేషన్‌ వేసేందుకు వెళ్తే.. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో, కేటీఆర్‌ జూబ్లీహిల్స్‌ అతిథిగృహంలో సేదతీరారు. హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకొంటున్న భారాస చేసిందేమీ లేదు. పురపాలకశాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌.. నగరంలో నీటి కొరత ఏర్పడకుండా ఏవైనా కొత్త ప్రాజెక్టులు తీసుకువచ్చారా?’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

ఓరుగల్లు జనజాతర సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకొస్తే దాన్ని నేడు మోదీ తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వరంగల్‌ భారాస నేతలపై విచారణ జరిపి.. కటకటాల్లోకి పంపాలన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగిస్తూ.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లోని హామీలు అమలు చేయడంతో కేసీఆర్‌కు భయమేస్తోందన్నారు.

కార్యక్రమాల్లో ఎంపీ అభ్యర్థులు కడియం కావ్య(వరంగల్‌), దానం నాగేందర్‌(సికింద్రాబాద్‌), వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌధరి, తెజస అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, యశస్విని, నాగరాజు, నేతలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, అజారుద్దీన్‌, రోహిణ్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతా శోభన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, దానం నాగేందర్‌లు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ జోనల్‌ కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img