icon icon icon
icon icon icon

మల్కాజిగిరికి మేలు చేయని కాంగ్రెస్‌కు ఓటేస్తారా?

‘ప్రశ్నించే గొంతు అని చెప్పుకొన్న రేవంత్‌రెడ్డిని గత ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా గెలిపిస్తే ఆయన ఈ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి. మల్కాజిగిరి ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవినిచ్చింది.. ముఖ్యమంత్రిని చేసింది.

Published : 25 Apr 2024 03:58 IST

వలస పక్షులను గెలిపిస్తే ఉపయోగం లేదు..
12 ఎంపీ సీట్లు వస్తే కేసీఆర్‌ రాజకీయాలను శాసిస్తారు
ఓటమి వల్ల అధికారులెవరూ మన ఫోన్లు ఎత్తట్లేదు: కేటీఆర్‌

శామీర్‌పేట, న్యూస్‌టుడే: ‘ప్రశ్నించే గొంతు అని చెప్పుకొన్న రేవంత్‌రెడ్డిని గత ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా గెలిపిస్తే ఆయన ఈ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి. మల్కాజిగిరి ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవినిచ్చింది.. ముఖ్యమంత్రిని చేసింది. అన్నీ మర్చిపోయి ఇప్పుడు మరోసారి మోసం చేయడానికి వస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్‌ సందర్భంగా బుధవారం శామీర్‌పేట దొంగల మైసమ్మ చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలిపిస్తే కేసీఆర్‌ మరో ఏడాదిలోపు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో కీలకపాత్ర పోషిస్తారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల మనం ఫోన్లు చేసినా.. అధికారులు, పోలీసులు స్పందించడంలేదు. లోక్‌సభ ఎన్నికల్లో గెలవకపోతే మరీ పలచనైపోతాం. 2019లో ఇక్కడ ఎంపీగా గెలిపించినందుకు రేవంత్‌రెడ్డి.. మీ అందరి కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన పోసుకోవాలి. గెలిచాక ఆయన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారా? దిల్లీలో గొంతు విప్పారా? అందుకే వలస పక్షులకు ఓట్లేస్తే ఉపయోగం లేదు. స్థానికంగా మీ సమస్యలు తెలిసిన రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలి. ఇవి ఉత్తుత్తి ఎన్నికలు కావు. ఓ వైపు పదేళ్ల నిజం.. కేసీఆర్‌ పాలన, అటు 100 రోజుల అబద్ధం.. రేవంత్‌రెడ్డి పరిపాలన, మరోవైపు పదేళ్లపాటు మోసం చేసిన మోదీ పాలన. అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానన్న రేవంత్‌రెడ్డి.. ఆ హామీని అమలు చేశారా? పింఛన్లు, ఆడబిడ్డలకు రూ. రెండువేలు ఇస్తానన్నారు. రైతుబంధు, రుణమాఫీ, కల్యాణలక్ష్మికి రూ. లక్షతోపాటు తులం బంగారం అన్నారు. ఇవన్నీ ఇచ్చారా? రాష్ట్రంలో కేసీఆర్‌ 36 ఫ్లైవోవర్లు నిర్మిస్తే, కేంద్ర ప్రభుత్వం ఉప్పల్‌, అంబర్‌పేటలో చేపట్టిన రెండు వంతెనలు ఇప్పటికీ పూర్తి కాలేదు. జైశ్రీరామ్‌ అంటూ ఓటు అడుగుతున్నారు.. అక్షింతలు పంపించారని ఓటు వేస్తే మోసపోతాం. కాంగ్రెస్‌, భాజపాలకు ఓట్లు వేయొద్దు’ అని కేటీఆర్‌ కోరారు. ఈ సభలో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, కృష్ణారావు, వివేకానంద్‌, రాజశేఖర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img