icon icon icon
icon icon icon

అభ్యర్థుల్లో అత్యధికులు సంపన్నులే

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు.

Updated : 25 Apr 2024 06:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు. ఆయా అఫిడవిట్ల ప్రకారం వివరాలివి.


5 కిలోల బంగారం..

అభ్యర్థి: కొంపెల్ల మాధవీలత

నియోజకవర్గం: హైదరాబాద్‌

పార్టీ: భాజపా

కుటుంబ ఆస్తుల విలువ రూ.221.40 కోట్లు. ఆమె పేరిట విరించి లిమిటెడ్‌, వివో బయోటెక్‌లలో రూ.8.92 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. అన్‌లిస్టెడ్‌ కంపెనీలైన గజ్వేల్‌ డెవలపర్స్‌, పీకేఐ సొల్యూషన్స్‌, విరా సిస్టమ్స్‌లలో రూ.16.27 కోట్ల షేర్లు ఉన్నాయి. ఆమె భర్త కొంపెల్ల విశ్వనాథ్‌ పేరిట విరించి లిమిటెడ్‌, వివో బయోటెక్‌లలో రూ.56.19 కోట్ల విలువైన షేర్లు, అన్‌లిస్టెడ్‌ కంపెనీలైన గజ్వేల్‌ డెవలపర్స్‌, పీకేఐ సొల్యూషన్స్‌, విరా సిస్టమ్స్‌, శ్రీశ్రీ రిసార్ట్స్‌లో రూ.29.56 కోట్ల షేర్లు ఉన్నాయి. ఆమె పేరిట 3.9 కిలోల బంగారం, భర్త పేరిట 1.11 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.165.47 కోట్లు. సొంతంగా ఎలాంటి వ్యవసాయ భూములు, వాహనాలు లేవు. షేక్‌పేట, కీసర, సికింద్రాబాద్‌; ఏపీలోని మొగల్తూరులలో వ్యవసాయేతర స్థలాలు, హిమాయత్‌నగర్‌లో వాణిజ్య స్థలం, మల్కాజిగిరి, ఈస్ట్‌ మారేడ్‌పల్లి, షేక్‌పేటల్లో నివాసగృహాలు ఉన్నాయి. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.55.92 కోట్లు. రూ.27.03 కోట్ల అప్పులున్నాయి. ఆమెపై ఒక క్రిమినల్‌ కేసు ఉంది.


రూ.155.90 కోట్ల ఆస్తులు..

అభ్యర్థి: నామా నాగేశ్వరరావు

నియోజకవర్గం: ఖమ్మం

పార్టీ: భారాస

కుటుంబ ఆస్తుల విలువ రూ.155.90 కోట్లు. మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌, మధుకాన్‌ గ్రానైట్స్‌, టీఎన్‌డీకే ఎక్స్‌ప్రెస్‌ వే, మధుకాన్‌ మెగామాల్‌, ఎన్‌ఎన్‌ఎఆర్‌ ఇన్‌ఫ్రా, మధుకాన్‌ ల్యాండ్‌ డెవలపర్స్‌, నామా ఇన్వెస్ట్‌మెంట్స్‌, నామా ప్రాపర్టీస్‌లలో షేర్లు ఉన్నాయి. మూడు కార్లు ఉన్నాయి. ఆయన సతీమణి పేరిట 2.5 కిలోల బంగారు ఆభరణాలున్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.72.03 కోట్లు. ఏపీ, తెలంగాణల్లో  కలిపి ఆ కుటుంబానికి దాదాపు 108 ఎకరాల వ్యవసాయ భూములు; గోవా, ఖమ్మంలలో వ్యవసాయేతర స్థలాలు, హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌, దిల్లీల్లో వాణిజ్య భవనాలు; జూబ్లీహిల్స్‌, ఖమ్మంలలో పలు నివాసగృహాలతో కలిపి రూ.83.87 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. ఒక్క రూపాయి కూడా అప్పు లేదు. ఆయనపై రెండు క్రిమినల్‌ కేసులున్నాయి.


రూ.63.58 కోట్ల ఆస్తులు.. సొంతంగా కారు లేదు..

అభ్యర్థి: వెంకట్రామిరెడ్డి

నియోజకవర్గం: మెదక్‌

పార్టీ: భారాస

కుటుంబ ఆస్తుల విలువ రూ.63.58 కోట్లు. ఆయనకు 10 తులాల బంగారం, ఆయన సతీమణికి 3.3 కిలోల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. రాజపుష్ప ఫామ్స్‌లో రూ.4.48 కోట్ల పెట్టుబడి ఉంది. మొత్తం చరాస్తుల విలువ రూ.9.97 కోట్లు. పెద్దపల్లి ఓదెలలో ఎకరన్నర వ్యవసాయ భూమి, గాజులరామారంలో 261 గజాల స్థలం, గుట్టల బేగంపేటలో 430 గజాలు, తెల్లాపూర్‌లో 17 గుంటలు, మహేశ్వరం మంఖాల్‌ గ్రామంలో రాజపుష్ప ఫామ్స్‌ పేరిట ఉన్న 1,84,355 చదరపు గజాల్లో నాలుగో వంతు వాటాగా వ్యవసాయేతర స్థలాలున్నాయి. సొంతగా కారు, నివాసగృహం లేవు. తెల్లాపూర్‌లోని 17 గుంటల భూమిని డెవలప్‌మెంట్‌కు ఇచ్చారు. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.53.60 కోట్లు. రూ.9.8 కోట్ల అప్పులున్నాయి. ఆయనపై ఒక క్రిమినల్‌ కేసు ఉంది.


తెలంగాణ, ఏపీల్లో 52 ఎకరాల సాగుభూములు..

అభ్యర్థి: మల్లు రవి

నియోజకవర్గం: నాగర్‌కర్నూల్‌

పార్టీ: కాంగ్రెస్‌

కుటుంబ ఆస్తుల విలువ రూ.52.32 కోట్లు. ఆయన సతీమణి రాజ భన్సీదేవికి రాహుల్‌ ఏజెన్సీస్‌, కార్డమామ్‌ ఎస్టేట్‌, అల్డోరా ఎస్టేట్‌, అవీషా ఎస్టేట్‌, ట్రేడ్‌వెల్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఆయనకు 4.5 తులాల బంగారం, ఆయన సతీమణికి 87.5 తులాల బంగారు ఆభరణాలు, 10 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయి. ఆయనకు రూ.20.66 లక్షలు, ఆయన సతీమణికి రూ.25.61 కోట్ల విలువైన చరాస్తులున్నాయి. తెలంగాణ, ఏపీలో మొత్తం 52.33 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. తమిళనాడులోని కూనూరు, హైదరాబాద్‌లో పలు వ్యవసాయేతర స్థలాలు.. షేక్‌పేటలక్ష అపర్ణక్రెస్ట్‌, సికింద్రాబాద్‌, అమీర్‌పేటల్లోని వాణిజ్య సముదాయాల్లో స్థలాలు, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, మాదాపూర్‌, హైటెక్‌సిటీ; విజయవాడలోని గుణదల, గన్నవరంలలో నివాస గృహాలతో కలిపి మొత్తం స్థిరాస్తుల విలువ రూ.26.49 కోట్లు. రూ.4.42 కోట్ల అప్పులున్నాయి. 5 క్రిమినల్‌ కేసులున్నాయి.


35 ఎకరాల సాగు భూములు..

అభ్యర్థి: జీవన్‌రెడ్డి, కాంగ్రెస్‌

నియోజకవర్గం: నిజామాబాద్‌

కుటుంబ ఆస్తుల విలువ రూ.3.55 కోట్లు. ఇన్నోవా క్రిస్టా కారు ఉంది. ఆయనకు 12.5 తులాల బంగారు ఆభరణాలు, ఆయన సతీమణికి 50 తులాల బంగారం ఉన్నాయి. చరాస్తుల విలువ రూ.63.38 లక్షలు. 35.24 ఎకరాల భూములున్నాయి. జగిత్యాలలో ఇల్లు, బ్యాంకుల్లో రూ.58.14 లక్షల రుణాలున్నాయి. 4 క్రిమినల్‌ కేసులున్నాయి.


సొంత ఇల్లు లేదు..

అభ్యర్థి: జి.శ్రీనివాస్‌, భాజపా, పెద్దపల్లి

కుటుంబ ఆస్తుల విలువ రూ.23.22 కోట్లు. ఆయన పేరిట రెండు కార్లు, 10 తులాల బంగారం, ఆయన సతీమణి పేరిట 35 తులాల బంగారు ఆభరణాలతో కలిపి చరాస్తుల విలువ రూ.82.25 లక్షలు. భూపాలపల్లిలో 4.27 ఎకరాల వ్యవసాయ భూమి, మహారాష్ట్రలో 2,12,800 చదరపు మీటర్ల (52.58 ఎకరాలు) వ్యవసాయేతర భూములు, హైదరాబాద్‌లో ఫ్లాటు ఉన్నాయి. ఆయనకు సొంత ఇల్లు లేదు.


ఊటీలో 18 ఎకరాలు..

అభ్యర్థి: మహ్మద్‌ వలీవుల్లా సమీర్‌

నియోజకవర్గం: హైదరాబాద్‌

పార్టీ: కాంగ్రెస్‌

కుటుంబ ఆస్తుల విలువ రూ.13.20 కోట్లు. బ్యాంకులో డిపాజిట్లు, ఒక ఇండికా కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ల్యాండ్‌రోవర్‌, బొలేరో, కియా సోనెట్‌, ఇసుజీ ఎస్‌క్యాబ్‌, మారుతీ ఎకో కార్లు ఉన్నాయి. ఆయన పేరిట తెలంగాణలోని రాజాపూర్‌, కండ్‌వాడలో 20 ఎకరాలు, తమిళనాడులోని ఊటీలో 18 ఎకరాలు, ఆయన సతీమణి ఆయేషా సిద్దిఖీ పేరిట 2.03 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. మాసాబ్‌ట్యాంక్‌లో వాణిజ్య భవనాలు; బంజారాహిల్స్‌, ఫస్ట్‌లాన్సర్‌, గోల్కొండల్లో నివాస భవనాలు ఉన్నాయి. రూ.1.65 కోట్ల అప్పులున్నాయి. ఆయనపై 4 క్రిమినల్‌ కేసులున్నాయి.


85 ఎకరాల భూములు..

అభ్యర్థి: అరూరి రమేష్‌

నియోజకవర్గం: వరంగల్‌

పార్టీ: భాజపా

కుటుంబ ఆస్తుల విలువ రూ.28.74 కోట్లు. ఆయన సతీమణికి సాయిదత్తా ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌లో రూ.4.26 కోట్ల షేర్లు ఉన్నాయి. కుటుంబానికి సొంత కార్లు లేవు. ఆరూరి దంపతులకు మొత్తం 30 తులాల బంగారు ఆభరణాలున్నాయి. చరాస్తుల విలువ రూ.5.53 కోట్లు. 44.38 ఎకరాల వ్యవసాయ భూములు; ఘట్‌కేసర్‌, శాయంపేట, కాజీపేట, ధర్మసాగర్‌, ఐనవోలు మహబూబ్‌నగర్‌ కొత్తూరు, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలాల్లో 41.45 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నాయి. వరంగల్‌లో మూడు నివాస గృహాలతో కలిపి మొత్తం స్థిరాస్తుల విలువ రూ.23.21 కోట్లు. రూ.46.03 లక్షల అప్పులున్నాయి. ఆయనపై 6 క్రిమినల్‌ కేసులున్నాయి.


32 ఎకరాల సాగుభూమి..

అభ్యర్థి: గోడం నగేష్‌

నియోజకవర్గం: ఆదిలాబాద్‌

పార్టీ: భాజపా

కుటుంబ ఆస్తుల విలువ రూ.3.09 కోట్లు. ఆయన పేరిట స్విఫ్ట్‌ కారు, కుటుంబానికి 33 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆదిలాబాద్‌లో 32.08 ఎకరాల వ్యవసాయ భూమి.. సికింద్రాబాద్‌, ఆదిలాబాద్‌, జతారాల్లో నివాస గృహాలతో కలిపి స్థిరాస్తుల విలువ రూ.2.58 కోట్లు. రూ.29.01 లక్షల అప్పులున్నాయి.


ఆస్తులు తక్కువ.. అప్పులు ఎక్కువ..

అభ్యర్థి: దానం నాగేందర్‌

నియోజకవర్గం: సికింద్రాబాద్‌

పార్టీ: కాంగ్రెస్‌

కుటుంబ ఆస్తుల విలువ రూ.59.61 కోట్లు. అయితే రూ.64.59 కోట్ల అప్పులున్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.68.78 కోట్లుగా ప్రకటించారు. భాగ్యనగర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో రూ.16.16 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. నలుగురు వ్యక్తులకు రూ.6.35 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చారు. ఆయనకు, కుటుంబ సభ్యులకు సొంత కారు లేదు. ఆయనకు రూ.2.99 కోట్ల విలువైన 1297 క్యారెట్ల వజ్రాలు, 80 తులాల బంగారు ఆభరణాలు, పది కిలోల వెండి వస్తువులు.. ఆయన సతీమణికి 1350 క్యారెట్ల వజ్రాలు, 225 తులాల ఆభరణాలున్నాయి. చరాస్తుల విలువ రూ.30.92 కోట్లు. ఆయన సతీమణికి 54.17 ఎకరాల వ్యవసాయ భూములు, బంజారాహిల్స్‌లో నివాస భవనంతో కలిసి స్థిరాస్తుల విలువ రూ.28.69 కోట్లు. ఆయనపై 7 క్రిమినల్‌ కేసులున్నాయి.


రూ.17.66 కోట్ల అప్పులు..

అభ్యర్థి: కుందూరు రఘువీర్‌

నియోజకవర్గం: నల్గొండ

పార్టీ: కాంగ్రెస్‌

కుటుంబ ఆస్తుల విలువ రూ.35.57 కోట్లు. వివిధ అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లో వాటాలున్నాయి. ఆస్తా గ్రీన్‌ఎనర్జీ, ఆర్తీ ఎనర్జీ, హిమాచల్‌ ఇన్‌ఫ్రాకాన్‌, యాక్సిలరేట్‌ ఆటోమోటివ్స్‌, బీఎస్‌ అగ్రీక్రౌన్‌, మారెడ్డి వెంచర్స్‌లో షేర్లు ఉన్నాయి. పలువురు వ్యక్తులకు, సంస్థలకు రూ.14.33 కోట్ల అడ్వాన్సులు ఇచ్చారు. కుటుంబ సభ్యులందరికీ కలిపి 99.7 తులాల బంగారు ఆభరణాలు, రూ.40.50 లక్షల విలువైన వజ్రాలు, 2.79 కిలోల వెండి వస్తువులతో కలిపి మొత్తం చరాస్తుల విలువ రూ.32.15 కోట్లు. జూబ్లీహిల్స్‌లో 530 గజాల భూమి ఉంది. సొంతంగా ఇల్లు, కారు లేవు. మొత్తం రూ.17.66 కోట్ల అప్పులున్నాయి. ఆయనపై 2 క్రిమినల్‌ కేసులున్నాయి.


రూ.9.24 కోట్ల చరాస్తులు..

అభ్యర్థి: చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

నియోజకవర్గం: భువనగిరి

పార్టీ: కాంగ్రెస్‌

కుటుంబ ఆస్తుల విలువ రూ.28.72 కోట్లు. బ్యాంకులో డిపాజిట్లు, కేకేసీ రియల్టర్స్‌, ఎల్‌కే డెవలపర్స్‌, కోటి ఎడ్యుకేషన్‌లో పెట్టుబడులు, షేర్లు ఉన్నాయి. సొంతంగా ఆయనకు కారు లేదు. సతీమణి పేరిట కారు ఉంది. ఆయనకు 86.2 తులాలు, సతీమణికి 1.02 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.9.24 కోట్లు. మేడ్చల్‌, చేవెళ్ల, ఆదిలాబాద్‌లలో 6.28 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. నల్గొండలో 2 వాణిజ్య భవనాలు, వనస్థలిపురం, గచ్చిబౌలిల్లో నివాస గృహాలు ఉన్నాయి. రూ.73 లక్షల అప్పులున్నాయి. ఆయనపై 2 క్రిమినల్‌ కేసులున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img