icon icon icon
icon icon icon

నేడు రాజీనామా లేఖతో వస్తా.. మీరూ రండి

‘ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ, ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న విషయం నిజమైతే శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరుల స్తూపం వద్దకు నేను రాజీనామా లేఖతో వస్తా.. మీరు కూడా రాజీనామా పత్రాన్ని వెంట తీసుకురావాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు.

Published : 26 Apr 2024 03:27 IST

సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌
దేవుళ్ల మీద కాదు మీ మీద ఒట్టు వేసుకున్నా ప్రజలు నమ్మరని వ్యాఖ్య
నా ఎత్తు గురించి కాదు.. కల్లాల్లో వడ్లపై ధ్యాస పెట్టాలని సూచన

మెదక్‌, న్యూస్‌టుడే: ‘ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ, ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న విషయం నిజమైతే శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరుల స్తూపం వద్దకు నేను రాజీనామా లేఖతో వస్తా.. మీరు కూడా రాజీనామా పత్రాన్ని వెంట తీసుకురావాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. ఇద్దరి రాజీనామాలను మేధావుల చేతుల్లో పెడదాం.. ముఖ్యమంత్రి చెప్పినవి అమలు చేస్తే నా రాజీనామా లేఖను వారే స్పీకర్‌కు ఇస్తారని.. ఒక వేళ చేయకుంటే ముఖ్యమంత్రి రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇస్తారని ఇందుకు సిద్ధమేనా అని ఆయన సీఎంను ప్రశ్నించారు. మాట మీద నిలబడే వ్యక్తివైతే.. గన్‌పార్క్‌ వద్దకు రావాలన్నారు. 2018లో కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి తోకముడిచారని.. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందని హరీశ్‌ పేర్కొన్నారు. భారాస మెదక్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ సందర్భంగా గురువారం జిల్లా కేంద్రం మెదక్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాందాస్‌చౌరస్తాలో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో, మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామశివారు పీఎస్‌ఆర్‌ పాఠశాల ఆవరణలో వరంగల్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి సుధీర్‌కుమార్‌ విజయం కోసం గురువారం రాత్రి నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి హరీశ్‌రావు హాజరై మాట్లాడారు. మాజీ మంత్రి మాట్లాడారు. వందరోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పి రేవంత్‌రెడ్డి బాండ్‌పేపర్‌ మీద రాసిచ్చి దాని విలువ తీసేశారని విమర్శించారు. బాండ్‌పేపర్‌తో రాజకీయాలు నడవవని తెలిసి దేవుళ్ల మీద ఒట్టు వేసి వారిని రాజకీయాలకు వాడుకుంటున్నారని.. మీ మీద ఒట్టుపెట్టుకున్నా.. దేవుడిపై ఒట్టు వేసినా ప్రజలు నమ్మరని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

లక్ష తులాల బంగారం ఇవ్వాలని డిమాండ్‌

కాంగ్రెస్‌ హామీ ఇచ్చినట్లుగా రైతు భరోసా రూ.15వేలు, మహిళలకు రూ.2,500, ఇందిరమ్మ ఇళ్లు, వితంతువులు, వృద్ధులకు రూ.4వేలకు పింఛన్‌ పెంపు ఏవీ అమలు చేయడం లేదని విమర్శించారు. వివాహాలు చేసుకున్న వారికి రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకు లక్ష వివాహాలు అయ్యాయని, లక్ష తులాల బంగారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 280 మంది రైతులు, 30 మంది ఆటో కార్మికుల ఆత్మహత్యలు, ఎస్సీ విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతున్నా వారిని పరామర్శించిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. నిత్యం దిల్లీకి పర్యటనలు తప్ప, ప్రజల గురించి పట్టించుకోవడం లేదని రేవంత్‌రెడ్డిని విమర్శించారు. హరీశ్‌రావు ఎత్తు గురించి కాకుండా సీఎం కల్లాల్లోని వడ్లపై ధ్యాసపెట్టాలని సూచించారు. రైతు రుణమాఫీ, ఆరుగ్యారంటీలు అమలు కావాలన్నా.. నిరుద్యోగభృతి, రైతు భరోసా రావాలన్నా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలన్నారు. కాంగ్రెస్‌ నేతలకు అహంకారం నెత్తికెక్కి గాలిలో ఉన్నారని.. వారిని భూమి మీదకు తేవాలంటే మెదక్‌ నుంచి వెంకట్రామిరెడ్డిని పార్లమెంట్‌కు పంపాలని కోరారు.

కొత్త జిల్లాలు తీసేస్తామంటున్నారు

గత ప్రభుత్వ హయాంలో పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే ఎక్కువయ్యాయని వాటిని తీసేస్తామని, ఎన్ని ఉండాలనే దానిపై కమిషన్‌ వేస్తామని సీఎం అంటున్నారు.. నలభై ఏళ్ల పోరాటం ఫలితంగా మెదక్‌ పట్టణ కేంద్రంగా జిల్లా ఏర్పాటైందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయడమంటే మెదక్‌, సిద్దిపేట జిల్లాలను పొగొట్టుకోవడమేనని వ్యాఖ్యానించారు. ఈ ఎంపీ ఎన్నికల్లో 8 నుంచి 9 స్థానాల్లో భారాస విజయం సాధిస్తుందని ఓ సర్వేలో తేలిందని పేర్కొన్నారు. గులాబీ అధినేత బస్సు యాత్రతో కాంగ్రెస్‌ నేతలు గజగజలాడుతున్నారని చెప్పారు. భాజపా నాయకులు అన్ని అబద్ధాలే చెబుతున్నారని, వైద్య, నర్సింగ్‌ కళాశాలలు, నవోదయ పాఠశాలలను ఇవ్వలేదని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మెదక్‌ జడ్పీ అధ్యక్షురాలు హేమలతగౌడ్‌, నర్సాపూర్‌, దుబ్బాక, సంగారెడ్డి ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, కొత్తప్రభాకర్‌రెడ్డి, చింత ప్రభాకర్‌, ఎమ్మెల్సీలు శేరిసుభాష్‌రెడ్డి, యాదవ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, భారాస నాయకులు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img