icon icon icon
icon icon icon

అంతా కోటీశ్వరులే..!

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో దాదాపు అంతా కోటీశ్వరులే ఉన్నారు. చాలామందికి పదులు, వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి.

Updated : 26 Apr 2024 05:36 IST

అత్యంత ధనిక అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో 35 మందికి రూ.10 కోట్లకు పైనే ఆస్తులు
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో దాదాపు అంతా కోటీశ్వరులే ఉన్నారు. చాలామందికి పదులు, వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. చేవెళ్ల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు అత్యంత ధనికులుగా నిలిచారు. అత్యధికంగా భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి రూ.4,560 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తులున్నాయి. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులను పరిశీలిస్తే ఒక్కరు మినహా అందరు అభ్యర్థుల ఆస్తులూ రూ.కోటికి పైగానే ఉన్నాయి. కాంగ్రెస్‌కు చెందిన 17 మంది అభ్యర్థుల్లో 12 మంది ఆస్తులు రూ.10 కోట్లకు పైగా ఉన్నాయి. భాజపాలో 13 మంది, భారాసలో 10 మంది ఆస్తుల విలువ రూ.పది కోట్లు దాటాయి. స్థిరాస్తులకు సంబంధించి బహిరంగ మార్కెట్‌ విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వ విలువ ప్రకారం లెక్కించారు. అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లో ముఖ విలువను పరిగణనలోకి తీసుకున్నారు. వాటి వ్యాపారం, లాభాలు తదితర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వాస్తవ విలువలు లెక్కిస్తే చాలామేర అభ్యర్థుల ఆస్తుల విలువ భారీగా పెరుగుతుంది.

  • చేవెళ్ల నియోజకవర్గం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో అత్యంత ధనికులు ఈ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. ఆదిలాబాద్‌ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తులు తక్కువగా ఉన్నాయి.
  • ప్రధాన పార్టీల్లో అత్యంత తక్కువ ఆస్తులున్న అభ్యర్థిగా నాగర్‌కర్నూల్‌కు చెందిన భరత్‌ప్రసాద్‌ ఉన్నారు. ఆయన తన కుటుంబ ఆస్తుల విలువ రూ.33.85 లక్షలుగా పేర్కొన్నారు. అయితే ఆయన తండ్రి రాములు సిటింగ్‌ ఎంపీగా ఉన్నారు.
  • వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడియం కావ్య (రూ.1.55 కోట్లు), నాగర్‌కర్నూల్‌ భారాస అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ (రూ.1.41కోట్లు) ఆయా పార్టీల్లో తక్కువ ఆస్తులున్న అభ్యర్థులుగా నిలిచారు.

ఐదేళ్లలో పెరిగిన సిటింగ్‌ ఎంపీల ఆస్తులు..

లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది మంది సిటింగ్‌ ఎంపీలు బరిలో నిలిచారు. వీరిలో కొందరు ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తుంటే.. మరికొందరు ఇప్పటికే ఉన్న పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. గత ఐదేళ్లలో వీరందరి ఆస్తులూ పెరిగాయి. కొందరి ఆస్తులు మూడు రెట్లు పెరిగితే.. మరికొందరి ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. సిటింగ్‌ ఎంపీల్లో బండి సంజయ్‌ ఆస్తుల విలువ తక్కువగా ఉంది.


రఘురాంరెడ్డికి రూ.58.27 కోట్లు..  మన్నె శ్రీనివాస్‌రెడ్డికి రూ.16.18 కోట్లు

రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు గురువారం నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులు, అప్పుల వివరాలివి..

మన్నె శ్రీనివాస్‌రెడ్డికి 99 ఎకరాల సాగు భూమి
నియోజకవర్గం: మహబూబ్‌నగర్‌
పార్టీ: భారాస

కుటుంబ సభ్యుల పేరిట బ్యాంకు డిపాజిట్లు, ఆయన పేరిట ఫార్చునర్‌, ఇన్నోవా క్రిస్టా, డిఫెండర్‌, బెంజ్‌, ఇన్నోవా కార్లు ఉన్నాయి. కుటుంబ సభ్యులందరి పేరిట 1.79 కిలోల బంగారు ఆభరణాలు, ఎంఎస్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌, శ్రీకృష్ణ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.10.23 కోట్లు. మహబూబ్‌నగర్‌ నవాబుపేట మండలం గురుకుంట, కరూర్‌, ఎన్మన్‌గాండ్ల, వికారాబాద్‌ జీవన్‌గిరి గ్రామాల్లో మొత్తం 99.07 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. మహబూబ్‌నగర్‌ తిరుమల హిల్స్‌, ఎనుగొండ, రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో వ్యవసాయేతర స్థలాలు; హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌లలో నివాసగృహాలతో కలిపి మొత్తం స్థిరాస్తుల విలువ దాదాపు రూ.6 కోట్లు. రూ.2.73 కోట్ల అప్పులున్నాయి. ఆయనపై కేసులేమీ లేవు.


రఘురాంరెడ్డికి తమిళనాడులో భూములు

నియోజకవర్గం: ఖమ్మం
పార్టీ: కాంగ్రెస్‌
కుటుంబ ఆస్తుల విలువ: రూ.58.27 కోట్లు

బ్యాంకుల్లో డిపాజిట్లు; వివిధ లిస్టెడ్‌, అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లో రూ.13.45 కోట్ల విలువైన షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టబడులు ఉన్నాయి. వివిధ వ్యక్తులు, సంస్థలకు రూ.6.47 కోట్ల అడ్వాన్సులు ఇచ్చారు. కవాసకీ బైక్‌, మహీంద్రా థార్‌, ఇన్నోవా కార్లు, 19.90 కిలోల వెండి వస్తువులు, 4 తులాల బంగారంతో కలిపి మొత్తం చరాస్తుల విలువ దాదాపు రూ.31 కోట్లు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌, తమిళనాడు, మహబూబాబాద్‌లలో విలువైన వ్యవసాయ భూములు; బేగంపేట, శేరిలింగంపల్లిల్లో వాణిజ్య భవనాలు; ఖమ్మం, హైదరాబాద్‌లలో నివాసగృహాలతో కలిపి మొత్తం రూ.27.19 కోట్ల స్థిరాస్తులున్నాయి. రూ.9.54 కోట్ల అప్పులున్నాయి. ఆయనపై ఒక క్రిమినల్‌ కేసు ఉంది.


వెలిచాల రాజేందర్‌రావుకు వ్యవసాయ భూములు లేవు..

నియోజకవర్గం: కరీంనగర్‌
పార్టీ: కాంగ్రెస్‌
కుటుంబ ఆస్తుల విలువ: రూ.26.58 కోట్లు

బ్యాంకుల్లో డిపాజిట్లు, పోచంపాడు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో షేర్లు, ఇన్నోవా, ఎంజీ ఈవీ, బాలెనో, టాటానెక్సాన్‌ కార్లు, 1.14 కిలోల బంగారు ఆభరణాలతో కలిపి మొత్తం చరాస్తుల విలువ రూ.8.25 కోట్లు. కుటుంబ సభ్యుల పేరిట ఎలాంటి వ్యవసాయ భూములు లేవు. కరీంనగర్‌ కొత్తపల్లిలో 3,818 గజాలు, మాదాపూర్‌లో 1,230 గజాల వ్యవసాయేతర స్థలాలు ఉన్నాయి. గచ్చిబౌలి, కొండాపూర్‌, కరీంనగర్‌ కొత్తపల్లిల్లో వాణిజ్య భవనాలు.. గచ్చిబౌలి, బంజారాహిల్స్‌, కరీంనగర్‌లలో ఆరు నివాసగృహాలతో కలిపి స్థిరాస్తుల విలువ రూ.18.33 కోట్లు. అప్పులు రూ.4.68 కోట్లు.


బాబూమోహన్‌ ఆస్తులివే..

నియోజకవర్గం: వరంగల్‌ - స్వతంత్ర అభ్యర్థి

ఆయన వద్ద నగదు రూ.50 వేలు, ఇన్నోవా వాహనం, 50 గ్రాముల బంగారం ఉన్నాయి. వీటన్నింటి విలువ రూ.28.20 లక్షలు. ఆయన సతీమణి వద్ద బ్యాంకు ఖాతాల్లో రూ.1.70 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం కలిపి మొత్తం విలువ రూ.14.20 లక్షలు. సంగారెడ్డి జిల్లా చిమల్దారిలో ఆయన పేరిట 36 గుంటల భూమి, ఆయన సతీమణి పేరిట 1.04 ఎకరాల స్థలం, మాదాపూర్‌, బేగంపేటల్లో రూ.1.20 కోట్లు, రూ.50 లక్షల విలువైన రెండు ఇళ్లు ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img