icon icon icon
icon icon icon

కరెంటు, నీళ్లు రాకపోవడమే కాంగ్రెస్‌ తెచ్చిన మార్పు..

కరెంటు, తాగునీరు, సాగునీరు ఇవ్వకపోవడమే కాంగ్రెస్‌ తెచ్చిన మార్పు అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

Published : 26 Apr 2024 03:32 IST

సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది..
కేసీఆర్‌ మళ్లీ రావాలంటే భారాస అభ్యర్థులను గెలిపించండి: రోడ్‌షోలో కేటీఆర్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల, కోనరావుపేట, న్యూస్‌టుడే: కరెంటు, తాగునీరు, సాగునీరు ఇవ్వకపోవడమే కాంగ్రెస్‌ తెచ్చిన మార్పు అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఏదైనా విలువైన వస్తువు దగ్గర ఉన్నప్పుడు మనకు అర్థం కాదని, ఇప్పుడు కేసీఆర్‌ అధికారంలో లేకపోతే రాష్ట్రానికి జరిగిన నష్టమేంటో తెలుస్తోందన్నారు. కేసీఆర్‌ మళ్లీ రావాలంటే.. 10-12 ఎంపీ సీట్లలో భారాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అలా చేస్తే.. ఏడాదిలోగా రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్‌ శాసించే పరిస్థితి వస్తుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో గురువారం కరీంనగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌ షోలో కేటీఆర్‌ ప్రసంగించారు. అంతకుముందు సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో ముస్తాబాద్‌, గంభీరావుపేట, తంగళ్లపల్లి మండలాల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోకసభ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా ఉండేదని, ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి వచ్చిందన్నారు. దిల్లీలో ప్రధాని మోదీ పెద్ద మోసగాడు.. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిన్న మోసగాడని కేటీఆర్‌ విమర్శించారు. పార్లమెంటులో వినోద్‌కుమార్‌ వంటి వ్యక్తి ఉంటే మన సమస్యలపై గళమెత్తుతారని, లేకుంటే మనకు మళ్లీ మోసం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కరీంనగర్‌ ఎంపీగా బండి సంజయ్‌ అయిదేళ్లలో వేములవాడ, కోనరావుపేట ప్రాంతాలకు ఒక్క రూపాయి పని చేయలేదని కేటీఆర్‌ ఆరోపించారు. కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గానికి అయిదేళ్లలో ఏం అభివృద్ధి పనులు చేశారో చర్చించేందుకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ అరుణ, భారాస వేములవాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img